పరువు లేఖ

పరువు లేఖ

పరువు లేఖ

అమ్మ పావని బంగారు తల్లి ఎలా ఉన్నావ్ అమ్మా. అప్పుడే నువ్వు వెళ్లి వారం రోజులు దాటింది అయినా నువ్వు కళ్ళముందు తిరుగుతున్నట్లే ఉంది. నాన్న నాన్న అంటూ నా వెనకాలే తిరుగుతూ ఎప్పుడూ నన్ను ఆటపట్టించే నీ చిలిపి అల్లరితనం నాకు చాలా గుర్తొస్తున్నాయమ్మా… ఇక మీ అమ్మ అయితే నిన్ను తలవని క్షణం లేదు పావని కి ఆ కూర అంటే ఇష్టం ఈ కూర అంటే ఇష్టం అంటూ ఎన్నో రకాలుగా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటుంది.

ఒక్కగానొక్క కూతురివని అల్లార ముద్దుగా పెంచాను నువ్వు అడిగిందల్లా నీకు కొనిచ్చాను నాన్న ఫోన్ కావాలంటే ఫోను, సిస్టం కావాలంటే సిస్టం నీకు నచ్చిన బట్టలు, బంగారం ఏదైనా నాకు తలకు మించిన భారమైన నిన్ను బాధ పెట్టకూడదని నా ఒక్కగానొక్క కూతురి కోరికలన్నీ తీర్చాలని అనుకున్నాను ఏ లోటు రానివ్వకూడదని నిన్ను నిలువెత్తు బంగారంలా చూసుకున్నాను.

పెద్ద చదువులు చదువుకుంటానంటూ పట్నం వెళ్తాను అంటే సరే అన్నాను నిన్ను విడిచి ఉండలేను అని తెలిసినా కూడా గుండె రాయి చేసుకుని భారమైన మనసుతో నిన్ను పంపించాను. కానీ అక్కడ నువ్వు చదువుకన్నా ఎక్కువ వేరే పనుల మీద ఆసక్తి పెరిగింది ఎప్పుడు లేని విధంగా అందంపై శ్రద్ధ పెరిగింది అందానికి నువ్వు ఎన్నో డబ్బులు ఖర్చు చేశావు వాటన్నిటికీ నన్ను డబ్బులు పంపించమని అంటే నేను ఊర్లో ఉన్న చిన్న చిన్న పొలాలు అన్నీ అమ్ముతూ నీకు డబ్బులు పంపించాను.

నా కూతురు బాగా చదువుకుంటుంది అని నా ఊరికి నా ఇంటికి పేరు తెస్తుందని నేను ఎంతో గర్వపడ్డాను. కానీ చివరికి ఒకరోజు నువ్వు ఒక అబ్బాయి తో మన ఇంటికి రావడం నాకు చాలా బాధగా అనిపించింది. అతను చూడడానికి మంచిగా లేకున్నా అతని మనసు మంచిదని చెప్పావు అతన్నే పెళ్లి చేసుకుంటాను అన్నావు అతని మతం ఏదైనా నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటూ పట్టు పట్టావు కానీ నేను వద్దు అని అనేసరికి నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లావు.

పుట్టినప్పటినుంచి కళ్ళల్లో వత్తులు వేసుకొని 21 సంవత్సరాలు నిన్ను మాణిక్యంలా పెంచిన మమ్మల్ని వదిలి వెళ్లాలని నీకు ఎలా అనిపించింది అమ్మా, మేము నిన్ను 21 ఏళ్ళు పెంచొచ్చు. మిగిలిన 80 ఏళ్లు నువ్వు అతనితో జీవితం గడపవచ్చు కానీ వెనక ముందు చూసుకోవాలి కదా, పెళ్లంటే మామూలు విషయం కాదు ఆటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేయాలి అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు.

ఇవన్నీ చెప్పినా నువ్వు ప్రేమ మత్తులో ఉన్నావు కాబట్టి నీకేమీ అర్థం కాలేదు వెళ్లారు గుడిలో పెళ్లి చేసుకున్నారు అలాగే ఏదైనా చేస్తామని అనుమానంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావు. పావని నువ్వు చేసిన పని నీకు సంతోషంగా అనిపించవచ్చు కానీ ఊర్లో ఒక పెద్ద మనిషిగా చెలామణి అయ్యే నన్ను అందరూ ఏమంటున్నారో తెలుసా?

అరేయ్ వీడికి కూతురేరా లేచిపోయింది వీడి పెంపకం అలాంటిది దానికి ఏమి ఇవ్వలేదు అది వాడిలో ఏం చూసిందో అని అంటూ కారు కూతలు కూస్తూ నా మనసును చిధ్రం చేస్తున్నారు అమ్మా…. వారు ఎవరికి సమాధానం చెప్పుకోలేక నేను బయట తిరగలేక అన్ని పనులు మానుకొని ఇంట్లోనే కుమిలి కుమిలి ఏడుస్తూ కూర్చున్నాను.

మీ అమ్మ అయితే నీ పైన బెంగ పెట్టుకొని అన్నం తినకుండా విలవిలలాడుతోంది. ఈ వారం రోజులు మేమెంత నరకం అనుభవించాము అది మాకే తెలుసు కానీ ఇంతలోనే నీ ఉత్తరం నన్ను కదిలించింది. ఎంతైనా కన్న కూతురివి కదా నువ్వు రాసిన దాంట్లో నిజాలు కళ్ళముందు కనిపించాయి అవి నీకు అర్థం అయ్యేసరికి నీ జీవితం తెల్లారిపోయింది.

ముందే చెప్పినట్లు పెళ్లంటే మామూలు విషయం కాదు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి నువ్వు కులాంతర మతాంతర వివాహం చేసుకున్న అబ్బాయి గుణగణాలను పరిశీలించాలి ఇవన్నీ చేసేది పెద్దవాళ్ళు ఎందుకంటే నీ నిండు నూరేళ్లు నీ జీవితం బాగుండాలనే కానీ నువ్వు నాశనం కావాలని కాదమ్మా, నువ్వు అది అర్థం చేసుకోకుండా అతనే లోకమని వెళ్ళిపోయావు.

కానీ ఇప్పుడు జరిగిందేంటి అతను నిన్ను వాడుకున్నన్ని రోజులు వాడుకొని నీ దగ్గర ఉన్న బంగారం డబ్బులు అయిపోయేంత వరకు నీతో కలిసి ఉన్నాడు ఇప్పుడు కనిపించకుండా పోయాడు అని రాశావు. నీ తెలివితేటలన్నీ ఏమయ్యాయి అమ్మా అతన్ని ఆమాత్రం నువ్వు గమనించేసుకోలేకపోయావా, ఇప్పుడు నేను ఈ లేఖ నీకెందుకు రాస్తున్నానంటే నీ తప్పులవి ఎత్తి చూపడానికి లేదా నిన్ను తిట్టడానికి కాదు.

ఊర్లో నన్ను అందరూ పరువు తక్కువ పని చేసింది నీ కూతురు అని ఎద్దేవా చేస్తున్నా కూడా నేనేమీ పట్టించుకోలేదు పట్టించుకోను కూడా ఎందుకంటే నాకు పరువు కన్నా నా కూతురు ముఖ్యం నా కూతురు సంతోషంగా ఉండడం ముఖ్యం. అందరి తండ్రుల్లా నేను పరువు ప్రతిష్టలు అంటూ నిన్ను చంపి మీ అమ్మను అనాధను చేసి నేను జైలుకు వెళ్లి కూర్చోవడం నాకు నచ్చదు. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను నువ్వు ఈ ఉత్తరం ఈ లేఖ అందగానే వెంటనే బయలుదేరి మన ఊరికి వచ్చేయి.

ఇక్కడ నీకు ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకునే నీ తల్లిదండ్రులు ఉన్నారని మర్చిపోకు. పరువు కూడు పెట్టదు పరువు జీవితాన్ని ఇవ్వదు, పరువుతో మనం ఏమి చేయలేం పరువు అంటే పదిమందికి సహాయం చేసేది అంతే తప్ప కుటుంబ పరువు పోతుంది అని అనడం ఆశపదం. అందువల్లే నా కూతురు బాగుండాలని నేను కోరుకుంటున్నాను నేను అందరి తండ్రుల్లా కులాంతర వివాహం చేసుకున్నావని లేదా మతాంతర వివాహం చేసుకున్నావు అని నీ మీద పగ పెంచుకొని నిన్ను చంపాలనే ఉద్దేశం నాకు లేదు ముందే చెప్పినట్లుగా నిన్ను చంపితే నా కడుపుకోత తప్ప ఇంకేం మిగులుతుంది చెప్పు.

అందువల్లే ఈ లేఖ అందగానే నువ్వు వెంటనే వచ్చేయ్ నువ్వు రావడానికి డబ్బులు కూడా పంపిస్తున్నాను లేదా నువ్వు ఎక్కడ ఉన్నా తెలియజేసిన నేను మన వారిని పంపిస్తాను లేదా నేనే వస్తాను. చిన్నప్పటినుంచి నిన్ను చూసి నా అలనా పాలనలో పెరిగిన నీ గురించి నాకు తెలియదా తల్లి ఈ నాన్నను తక్కువ అంచనా వేయకు ఇక్కడికి వస్తే ఆ మాటలు అంటారని అస్సలు అనుకోకు ఎవరెన్ని మాటలన్నా నేనేమీ పట్టించుకోను కాబట్టి నువ్వు వెంటనే వచ్చేయి తల్లి.

– ఇట్లు నిన్ను ఎప్పుడు ప్రేమించే నీ తండ్రి

ఆ ఉత్తరం చదువుతున్న పావని కలలో నీళ్లు టపటపా రాలాయి తను ఎంత తప్పు చేసింది నిజంగా ఒకడు ప్రేమిస్తున్నానని వెంటపడగానే అతన్ని గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకుంది తన వాళ్ళందరినీ కాదనుకుంది తన వాళ్ళ పరువు పోతుందని గ్రహించలేదు వాడి మాయలో పడి తన కన్న వాళ్ళను మర్చిపోయి వాడితో వచ్చింది అలా వచ్చినందుకు తనకు తగిన శాస్తి జరిగింది.

వాడు కొన్ని రోజులు వాడుకొని ఉన్న బంగారం అయిపోయింతవరకు తనతో సరదాగా గడిపి బంగారం, డబ్బు అయిపోగానే, ఇదిగో వస్తానంటూ వెళ్లిన వాడు ఇప్పటికి రాలేదు. నాన్న నన్ను బాగా అర్థం చేసుకున్నారు నన్ను కన్నవారు కాబట్టి కడుపులో పెట్టి దాచుకుంటారు అని అనుకుంటూ బట్టలు సర్దుకుంది పావని.

ఆటో దిగి ఇంట్లోకి అడుగుపెట్టిన పావని తండ్రి వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు పావని కళ్ళనీల పర్యంతమైంది తల్లయితే తన ఏడుపుకు అంతే లేదు ఇప్పటికైనా నువ్వు ప్రాణాలతో తిరిగివచ్చావు తల్లి రోజూ వార్తల్లో పేపర్లో చూస్తూనే ఉన్నాం ప్రేమించామని అంటూ డబ్బు నగలు అయిపోగానే చంపేసి వెళ్ళిపోతున్నారు కనీసం నువ్వు మాకు ప్రాణాలతో అయినా దక్కావు అదే సంతోషం. ఇకముందు ఊర్లో ఎవరు ఏం అడిగినా నేను ధైర్యంగా సమాధానం చెప్పుకోగలను. నా కూతురు నా దగ్గరికి వచ్చిందని నేను సంతోషంగా చెప్పుకోగలను తల్లి.

ప్రేమించే అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళు ఇలాంటి పనులు చేయరు ఒకవేళ ప్రేమించిన వ్యక్తి మంచివాడైతే వారిని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్లి చూపించి వాళ్ళ పుట్టు పూర్వత్రాలన్నీ సేకరించిన తర్వాత వాళ్ళు తగిన వారు అని అనిపిస్తే వాళ్ళ దగ్గర ఉండి పెళ్లి జరిపించే రోజులు ఇవి.

పెద్దవాళ్లు ప్రేమలు అర్థం చేసుకోరు అనేది అబద్ధం వాళ్ళు అర్థం చేసుకున్నంత బాగా ఇంకెవరూ మనల్ని అర్థం చేసుకోరు. అందరి తండ్రులు పావని తండ్రిలా ఉండకపోవచ్చు, కానీ ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నంతకాలం పావని లాంటి అమ్మాయిలు గతం మరిచి ముందుకు సాగి తన భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని ఆశిస్తూ ఈ లేఖ ఇంతటితో ముగిస్తున్నాను.

– భవ్యచారు

నీ రాక Previous post నీ రాక
పరువు లేఖ Next post పరువు లేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *