పశుత్వం – చివరికే తెలుస్తుంది

పశుత్వం – చివరికే తెలుస్తుంది

ఉండాల్సిన విధానాల్లో ఉంటూ సత్కర్మలు చేయడమే కదా…. మానవత్మం అంటే. నేడు, అది జరుగుతోందా? నేను, ఏమో, అనే అంటాను. మీరు ఎమన్నా పరవాలేదు. ఇంకా, నాలో మానవత్వం ఉందనే నమ్ముతాను.

శాంతారామ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతనిది, బలవత్ పదవీ విరమణ. ఆయనను ఎదో తప్పులో ఇరికించేసి ఉద్యోగం లోంచి తీసేశారు. మిగిలిన వారందరూ మానవతావాదులు, పాపం ఈయనోక్కడే వ్యతిరేకావాది అయ్యాడు.

బంధువులు, చుట్టుపక్కలవారు ఈయనని ఈసడించుకోవడం మెదలుపెట్టారు. దాదాపు వెలివేశారనే చెప్పవచ్చు. పేరుకి తగినట్టుగా శాంతరూపం ఆయనది.

పదవీ విరమణకి పూర్వం, నేను మరియు ఆయన కిరాణా షాపులో, పాన్ షాపులో కలిసినప్పుడు అభిమానాన్ని కళ్ళతో, నవ్వుతో ఇచ్చిబుచుకునే వాళ్ళం.

ఈ మానవీయ అడవిలో అతను ఏకాకిలా ఎగురుతూ ఏదో గొణుక్కుంటూ వీధుల వెంట చక్కర్లు కొడుతూ కనిపిస్తాడు. ఆయన మనస్సుకు తగిలిన ఈ గాయం అతనిని మతిభ్రంశుడ్ని చేసింది.

ఇది, జనాల మాట. ఎందుకంటే, ఆయనని ఊరటగా పలుకరించే నాథుడే లేడు. నేను ఒకటి, రెండు సార్లు, “శాంతారామ్ గారు చాయ్ తాగుదాం వస్తారా?” అని అడిగాను.

కానీ, ఆయనలో అదే నవ్వు. విరమణకి ముందూ, తరువాత కూడా అప్పుడు అనిపించింది. ఆయనే సమాజాన్ని వదిలేశాడు, సమాజం అతన్ని కాదు అని, ఆయన స్థిమితత్వం బానే ఉంది. కానీ సమాజంలో మానవత్వం మర్రి ఊడల్లాగ బలంగా వుంది. ఏమి చేయగలం?

శాంతారామ్ గారు నటిస్తున్నారా? అది ఎవరికీ  తెలియాలి? దేవుడి కీర్తన ఆలపించినట్టుగా ఈయన ఈ మాటల్ని నిత్యం గొణుక్కోవడం నేను గమనించాను. ఆయన, “ఈ దేశం నాది, ఈ సైకిల్ నాది, ఈ ఇల్లు నాది, ఈ కారు నాది “, అని మాట్లాడుకోవడం విన్నాను.

ఒక రోజు, ఒక అల్లరి మూక ఈయన్ని రావడం గమనించింది. వారు ఈయన్ని చూడకముందు ఒక పిచ్చి కుక్క ని దాటి వెళ్ళడానికి భయపడుతూ వున్నారు. ఇంతలో, ఆ తుంటరి మూకకి ఈ పిచ్చివాడ్ని ఆట పట్టియ్యాలనిపించింది.

శాంతారామ్ గారు వస్తున్న దిశలో ఈ కుక్కని రాళ్లతో కొట్టి ఉద్రేకపరిచారు. వీరి ఉద్దేశ్యంలో ఆ కుక్క ఈయన్ని వీధుల్లో పరిగెత్తిస్తుంది అని  అలా రెచ్చ గొట్టి, వీరంతా ఒక లారీ చాటున దాక్కున్నారు.

ఆ వీధి కుక్క, ఈయన్ని చూడగానే గారాబాలు చేయడం మొదలుపెట్టింది. దాని తోక ఊపుతూ అతన్ని నాలుకతో నిమరడం చేసింది. ఈ రెండు పిచ్చి జీవులు ఎదో మౌనంగా మాట్లాడుకున్నాయి. బహుశ, ఈ పిచ్చి లోకంలో ‘భాష ఎందుకు?’ అనుకోని వుండచ్చు.

ఇంతలో, రామ్ గారు జేబులో చేయి పెట్టి కొన్ని బిస్కెట్స్ తీసి ఆ శునకానికి తినిపించాడు. ఓ, రెండు, తాను నోట్లో వేసుకున్నాడు. తర్వాత తన ప్రయాణం ప్రారంభమైంది.

ఎదో గుర్తుకొచ్చి  వెనుకకి తిరిగి  ఆ శునకానికి చేయి వూపాడు. హాయ్, బాయ్, టాటా చెప్పడం ‘మానవీయత ‘అనుకున్నాడేమో, ఆ మాటలు ఉచ్చరించలేదు.

ఓ, పది అడుగులు ముందుకి వేసి లారీ చాటున నక్కి దాక్కున్న భవిష్యత్ కారుని (ఫ్యూచర్ జనరేషన్ ) ను చూసి “ఆ కుక్క నాదే, ఈ ఇల్లు నాదే, ఈ చెట్టు నాదే, ఈ కుర్రకారు నాదే” అంటూ ముందుకి సాగిపోయాడు.

ఇహ, మీరే చెప్పండి. నేను ఆ శునకం లో సిసలైన పశుత్వాన్ని, ఆ శాంతంలో సిసలైన మానవత్వాన్ని చూసాను. మీరేం చూస్తారు? ఆ సూక్ష్మగ్రాహి ఈ తంతు అంతా చూసాడు లేండి.!

– వాసు 

Related Posts