పసి హృదయం

పసి హృదయం

 

అంతా గజిబిజిగా ఉంది. ఏమి అర్ధం కావడం లేదు. ఎవరెవరో వస్తున్నారు, వెళ్తున్నారు. నేను చూస్తూ ఉండిపోయాను. నన్ను ఒక లైన్ లో నిల్చోమన్నారు. అలాగే చేసాను. కాని ఇంతలోనే, ఒక టీచర్ వచ్చి నా రెండు చెంపలు  వాయిస్తూ, సరిగా లైన్ లో నిల్చోవడం కూడా రాదా? అంటూ నన్ను సరైన పద్దతిలో నిలబెట్టి వెళ్ళిపోయారు .

ఆ తర్వాత ఒక అన్న వచ్చి, నా షర్ట్ కి ఎదో పెట్టి వెళ్ళిపోయాడు. అదేంటో నాకు అర్ధం కాలేదు. అది మూడు రంగులతో ఉంది. మధ్యలో తెల్లగా ఉండి ఎదో కలర్ ఉంది. నాకు ఏమి తెలియలేదు. అప్పుడు నేను మూడవ తరగతి చదువుతున్నాను.

ఆ స్కూల్ లోనే మా అమ్మ పనిచేసేది టీచర్ గా… అందుకే నేనంటే అందరికి మంచి ప్రేమ. కాని ఏమి చదవను, దేంట్లో ఆక్టివ్ గా లేను అని మా అమ్మ అందరికి పర్మిషన్ ఇచ్చింది, ఏమైనా చెయ్యకపోయినా, వినకపోయినా, చెడా, మడా వాయించేయ్యమని… మా అమ్మకి ఆరోజు ఆరోగ్య బాగా లేకపోవడం వాళ్ళ స్కూల్ కి రాలేదు. అందుకే నేను ఒక్కడినే వచ్చాను.

అంతలోనే రోజూలాగే, ప్రార్ధన మొదలైంది. అందరు రోజు దానికంటే కాస్త గట్టిగా పాడసాగారు. నాకు దాన్ని ఏమంటారో కూడా సరిగ్గా తెలియదు. ఏమి అర్ధం కాని నేను కూడా అందరికంటే గట్టిగా పాడాను. అది చూసి కొంత మంది నవ్వారు. టీచర్లు మాత్రం కోపంగా చూసారు. కాస్త గొంతు తగ్గించాను. ఆ తర్వాత టీచర్లు, సార్లు ఎదో మాట్లాడారు.

ఆ తర్వాత నా షర్ట్ కి ఒక అన్న పెట్టిన లాంటిదే ఒక తాడుతో మా మేడం లాగారు. అది చూసి అందరు ఒక పాట పాడారు. నాకు తెలిసిన పాటే కాబట్టి నేను కూడా గుంతు కలిపాను. ఆ తర్వాత ఒక తాత ఫోటో కి దండ వేసి, తన గురించి కాస్త మాట్లాడారు.

ఆ తర్వాత అన్నలు, అక్కలు, కొన్ని పాటలు, డాన్స్ లు చేసారు. అందరితో పాటు నేనూ చప్పట్లు కొట్టాను. ఆ తర్వాత నాకు లడ్డూ, చాక్లేట్ లు ఇచ్చి పంపించారు.

నేను వాటిని మెల్లగా తినుకుంటూ, వస్తూ ఉన్నాను. అప్పుడు ఒక బస్ వెళ్తూ ఉంటె దాని పక్కనుంచే వెళ్తూ ఉన్నాను. అప్పుడు బురద నా పై పడింది. కాసేపు ఏడ్చాను, అమ్మకి పెద్ద పని పెట్టానని. ఉతికె పని, షర్ట్ ని కాదు, నన్ను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాను.

అమ్మ చూసి చాలా తిట్టింది. ఆ తర్వాత అందరు సర్దుకుని, తిన్నాము. అప్పుడు మా అమ్మతో, అమ్మ, అమ్మ పొద్దున్న స్కూల్ లో ఒక తాత ఫోటో తెచ్చి పెట్టి, ఎదో పాట పాడారు, నేను కూడా పాడాను, అలాగే నా షర్ట్ కి ఎదో పెట్టారు, దాన్నే ఒక తాడుతో విడదీసి పాట పాడారు.

అసలు అది ఏంటి? ఏం పాట పాడారు? ఎప్పుడూ ఆ తాత ఫోటో బయటకి తియ్యలేదు కదా, ఈరోజే ఎందుకు తీసారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసాను. అప్పుడు మా అమ్మ, మన స్కూల్ లో ఒకతను ఉంటాడు కదా, అదే మిమ్మల్ని ఆడిస్తాడు అనగానే నేను జాన్ సార్ అని పేరు చెప్పాను.

అప్పుడు అమ్మ, అవును అతనే అతనికి మనకి తేడా ఏంటి అని అడిగింది దానికి నేను కాస్త ఆలోచించి  అతను తెల్లగా ఉంటాడు. మరి నువ్వు, నేను ఆయనంత కాకుండా కాస్త నల్లగా ఉంటాను, అని చెప్పాను. హ అవును.

పసి హృదయం
పసి హృదయం

తన లాగే ఉన్నవాళ్లు, కొన్ని లక్షల మంది మన దేశానికి వచ్చి, మనల్ని పరిపాలించారు అని చెప్పింది.

పరిపాలించారా అంటే అని అడిగితె, అవును. అంటే, ఇప్పడు నువ్వు చాక్లెట్ కొనుక్కొని తింటావు కదా? ఆ డబ్బులు ఎక్కడిని నుండి వస్తాయి? నేను పని చేస్తే వస్తాయి. ఇప్పుడు ఆ జాన్ సార్ వచ్చి ఆ డబ్బును లాక్కుంటే ఏమవుతుంది? అని అడిగితె, అదెలా అవుతుంది.

అది నీ డబ్బు కదా అతనెందుకు తీసుకుంటాడు? హా అలాగే అన్యాయంగా జాన్ సర్ లాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి, మన బంగారం, డబ్బు, సంపదలు అన్ని లాక్కున్నారు. అంటే అప్పుడు నేను, అంటే ఆ జాన్ సర్ మన దగ్గరనుండి డబ్బు లాక్కుంటాడా? అని అడిగితె అప్పుడు అమ్మ, ఏమో, లాక్కోవచ్చు అని అంది. అంటే మనం స్కూల్ కి వెళ్లొద్దు అమ్మ అని అనగానే, అలా చేస్తే ఎలా? మన జాగ్రత్తలో మనం ఉండాలి అని మళ్ళి చెప్పడం స్టార్ట్ చేసింది.

అప్పుడు మనం ఇంట్లోనే ఉండాలి, ఇలా మనం మాట్లాడుతున్నాం కదా ఇలా కూడా ఎవ్వరితో మాట్లాడవద్దు, వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. మనం ఎం తినాలో కూడా వాళ్ళే చెప్తారు. ఇలాంటి వన్నీ చేసేవాళ్ళు అని చెప్పింది. మరి మనం ఏమి చెయ్యలేదా? మన డబ్బుని దోచుకుంటే ఏమి అనలేదా? మన డబ్బుతో మనం చాక్లెట్ లు కొనుక్కోవచ్చు కదా… అని అడిగాను.

అవును నీ లాగే ఆలోచించి చాలా మంది వాళ్ళని చంపడానికి ప్రయత్నించారు. అనగానే, హ మంచి పని చేసారు. వాళ్ళని చంపెయ్యాలి. నేను కూడా అలాంటి వాళ్ళని చంపేస్తా అని అంటే, అప్పుడు అమ్మ, తప్పు అలా చెయ్యొద్దు. అందుకే గాంధి అనే ఒక తాతయ్య, వాళ్ళని ఎదురించాడు. కాని, ఒక్కరిని కూడా చంపలేదు. అలా మన దేశం నుండి వాళ్ళని వెళ్ళగొట్టి, మనల్ని హ్యాపీ గా ఉండేలా చేసారు అని చెప్పింది.

అప్పుడు నేను మరి జాన్ సర్ ని ఎందుకు పంపలేదు? అని అడిగాను. అలాంటి కొంతమంది మన దేశం గురించి తెలుసుకొని, మన దేశం నచ్చి ఇక్కడే ఉండిపోయారు అని చెప్పింది. అయితే కాని ఒకతను మాత్రం అందర్నీ ఎదురించి చంపేసాడు అని చెప్పింది. అప్పుడు నేను అబ్బ నాకు అతనంటే ఇష్టం.

కాని ఈ తాతయ్య నచ్చలేదు అని చెప్పాను. కాని అమ్మ మాత్రం నన్ను మందలించి అది కాదు నాన్న, ఆ తాతయ్య ఒక్క ప్రాణం కూడా తీయకుండా మనల్ని కాపాడాడు. కాని అతను చాలా మందిని చంపేసాడు.

ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను చంపితే ఎం చేస్తావు అని అడిగింది. కాని నేనేమి చెప్పలేదు. కదా, మనకి ఎవరైనా హాని తలపెడితేనే మనం ఎవరినైనా శిక్షించాలి అని చెప్పింది. అప్పుడు నేను, మరి జాన్ సర్ నిన్ను చంపేస్తే నేను అతన్ని చంపోచ్చా అని అడిగాను… దాంతో మా అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యింది… 

అతి చిన్న వయసులోనే దేశం గురించి, గాంధి గురించి, సుభాష్ చంద్ర బోస్ గురించి తెలుసుకున్న ఆ బుడ్డోడు, తల్లి మాటలు విని, దేశ భక్తుడు అవుతాడో, ఆ మాటలని వేరే విధంగా అర్ధం చేసుకొని దేశ ద్రోహి అవుతాడో, ఆ దేవుడికే తెలియాలి…  

 

– ప్రణవ్

Related Posts