పెద్దల సహకారం ఇదే
ఏమే శృతి ఈ రోజు ఆదివారం కదా నాలుగు భగవద్గీత శ్లోకాలు నేర్పుతాను,నేర్చుకోవే.
ఓ,బామ్మ నా వెనకాల పడకు,నా ఫ్రెండ్స్ తో బోల్డన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటుంది మనుమరాలు.
ఒరేయ్ ,ప్రణవ్ ఆ వీడియో గేమ్స్ ఆపేసి నాతో ఛెస్ ఆడరా.నేర్పుతాను.
ఓయ్ బామ్మ ,ఫ్రీ ఫైర్ అడుతున్నాను. వాడు చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోయిన తరువాత వస్తానులే.
ఏమి ఆటలురా అవ్వి ?అప్రాచ్యపు మాటలు మాట్లాడతావేరా. చక్కగా
చదరంగం నేర్చుకుంటే వరల్డ్ వైడ్ ఛాంపియన్ అవ్వచ్చు రా.ఐ హేవ్ నో ఇంటరెస్ట్ బామ్మ.
సరే,మల్లిక ఈ రోజు సండే కదా.ఇంట్లో ఉన్నావుగా. పిల్లలకు ఏ జంతికలు,లడ్డూలు చేస్తే వారం పొడుగున బయటి
ఫుడ్ తినకుండా పిల్లలు ఇంట్లో చేసినవి తింటే ఆరోగ్యంగా ఉంటారు కదమ్మా.
అబ్బా,అత్తయ్యగారు వారం పొడుగునా పరుగులెత్తి ,ఈ రోజు కూడా రెస్ట్ లేకపోతే ఎలాగండీ? ఈ రోజు కూరలే జమాటోలో బుక్ చేశాను నా వల్ల కాదు అత్తయ్యగారు.మీ ఓపికలు మాకు లేవు అంది
కోడలు.
సరే,ఒరేయ్ బాబీ ఈ రోజు ఇస్కాన్ టెంపుల్ లో
మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం ఉందిటరా.నన్ను కాస్త అక్కడకు తీసికెళితే నాలుగు మంచి మాటలు వింటానురా .
అమ్మా,ఈ రోజు ఒక్క రోజే కదా శెలవు. పిల్లలు,మల్లిక పిక్చర్ కి వెళ్దామంటున్నారు. నవ్వు కూడా రారాదు.
నాయనా,ఆ సౌండ్స్,ఆ పిచ్చ గోల,ఒక కథ ఉండదు,అర్ధనగ్న దుస్తులు,ఒక్క హీరోయిన్ కీ ముక్కు ,మూతి ఉండదు. ఏమిట్రా? ఆ సినిమాలు చూసి సంతోష పడేది.నేను రాలేనురా.
అయితే నువ్వు చక్కగా భగవద్గీత చదువుకుంటూ కూర్చో. మేము మళ్లీ పదింటికల్లా వచ్చేస్తాములే.
అదండీ, ఆదివారం ఇంట్లో మన సహకారం నోరు మూసుకుని భగవద్గీత ,మళ్లీ పైకి చదివితే వాళ్ళకి డిస్ట్రబెన్స్,నిశ్శబ్దం గా లోపల చదువుకోవటమే కదా నాలాంటి సీనియర్ సిటిజన్స్ సహకారం.
ఊరికే కథ కోసం వ్రాశా.నా కోడలు, కొడుకు, మనుమలు చాలా మంచివారండోయ్.
– రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి