పేరు లేని బంధం

పేరు లేని బంధం

అన్ని మంచి విషయాలు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. జీవితం అంటేనే ఒడిదుడుకుల ప్రయాణం. అలాంటి సమయం లో నాకున్న ఏకైక బంధం నాన్న. నాన్న అనారోగ్య సమస్యల వల్ల ఆయన్ని కోల్పోవాల్సి వచ్చింది. నాన్న చేసేది చిన్న ఉద్యోగమే, ఆస్తులు కూడా లేవు. అమ్మకు ఇల్లు తప్ప వేరే ఏమి తెలియదు. అన్ని చూడాల్సింది నేనే.

ఊర్లో ఉన్న పెద్ద మనుషులు తలా కాస్త చెయ్యి వేయడంతో నాన్న అంతక్రియలు నిర్వహించారు. ఆ తర్వాతే మొదలైంది అసలు సమస్య. ఇల్లు ఎలా గడవాలి అన్నది ఆ సమస్య ఇది లేని వారికి పెద్ద సమస్య అయితే ఉన్నవారికి చాలా చిన్న సమస్య అసలు సమస్య కాదు. ఇక ఇంటిని అమ్మని చూసుకోవడానికి నేనే పెద్దదిక్కు కాబట్టి ఉన్న ఊర్లో ఆస్తులు ఏమీ లేవు ఉన్నదొక ఇల్లు అమ్మను ఒక దాన్ని వదిలి వెళ్ళలేక తనని కూడా తీసుకొని పట్నం బయలుదేరాను బ్రతకడానికి.

రావడం అయితే వచ్చాను కానీ ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అనేది తోచలేదు. సాయం చేసేవారు కూడా నాకు ఈ మహానగరంలో ఎవరూ తెలియదు కాబట్టి ఏం చేయాలో దిక్కుతోచక అదే బస్టాండ్లో అమ్మతోపాటు కూర్చున్నాను ఏం చేయాలని ఆలోచిస్తూ. అలా నిమిషాలు గంటలుగా గంటలు నాలుగు గంటలుగా నాలుగు గంటలు కాస్త రాత్రిగా మారిపోయింది. ఉన్న డబ్బుతో అమ్మకు ఒక బన్ను టీ అయితే తెచ్చి ఇవ్వగలిగాను అంతే తప్ప ఇక నా జేబులో ఒక్క పైసా కూడా లేదు.

రేపు ఎలా అనే చింతే నన్ను తొలి చేస్తున్న సమయంలో, ఎప్పటినుంచి చూస్తుందో తెలియదు కానీ నేను అమ్మ కోసం చాయ్ బన్ను తీసుకొచ్చిన హోటల్ నిర్వహించే ఆ హోటల్ ఓనర్ నా దగ్గరికి వచ్చింది హోటల్ మూసేస్తూ… ఏం తమ్ముడు? ఎక్కడ వరకు ప్రయాణం అంటూ మాటలు కలిపింది. అమ్మ సమాధానంగా, అడుగులు ఎటువైపు వెళ్తే అటువైపే మా ప్రయాణం అమ్మ మాకు దిక్కుమక్కు లేదంటూ ఉన్న విషయం అంతా చెప్పుకొచ్చింది ఏడుస్తూ.

అయ్యో గట్లనా దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటూ నా వైపు చూస్తూ తమ్మి నువ్వు ఏం చదువుకున్నావ్ అంటూ అడిగింది. దానికి నేను చదువుదేముందిలే అక్కా ఏదైనా పని దొరికితే చెప్పు అన్నాను. సరే అవును నిజమే చదువుకున్నవానికన్నా చాకలోడు నయం ఇగో నేను ఇక్కడనే చాయి బండి పెట్టుకొని నా జీవితం నడుపుతున్నా. నా చేతికిందికి ఎవరూ పనోళ్ళు లేరు. నా చేతి కింద పని చేస్తావా అంటూ అడిగింది.

నేను ఆలోచనలో పడడం చూసి ఊరికే వద్దులే నెలకి ఎంతో కొంత ఇస్తాను అంటూ అంది. అయ్యో అదేం లేదండి ఏ పనైనా సరే చేస్తాను కానీ ఉండడానికి గూడు కావాలి కదా అన్నాను. గూడదేముంది నేను ఒక్కదాన్నే ఉంటున్న నా ఇంట్లో నాతోపాటు మీరు ఉంటారు ఈరోజు నుంచి నువ్వు నా తమ్మునివి ఇమే నా అమ్మ. రక్తసంబంధం లేకపోయినా మనం బంధువులమే…. ఏమంటావు అంటూ అడిగింది.

ఇక అనడానికి నాకేం అక్కడ వేరే దారి లేదు. చేయడానికి పని ఉండడానికి గూడు దొరికితే చాలని సంతోషంగా ఒప్పుకున్నాను సరే అండి చేస్తాను అన్నాను మర్యాదగా… ఈ అండిలు గిండీలు మనకు అద్దు. నేను తమ్మి అని పిలిచిన నువ్వు అక్క అను బస్ గంతే సరిపోయింది. పా పోదాం అంటూ అమ్మ చేతిని పట్టుకొని లేపుతూ, దగ్గర్నే ఉంది ఇల్లు పా అంటూ అలా పేరు లేని ఒక బంధం మాకు ఒక దారి చూపించింది.

– భవ్యచారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress