పొద్దుపోత నిద్దురలో
కారు మబ్బులు గుమ్మరించిన
చిమ్మ చీకటితో గగనపు దీవెనలు
గ్రహణపు చ్చాయలుగా అల్లుకుపోయి..
గమనమన్నది భౌతిక యాతనై కొలువలేని
శూన్యపు వెక్కిరింతలతో కోరికలను
ఎండ గడుతు…కానరాని లోకాన కరుడు
గట్టిన పరువాలు వెన్నెల కోనన వేదికలై
మోహరింపుల పరిచయాలతో చుక్కల
పల్లకితో పయనమైనాయి…
వినిపించని పిలుపు ఆంతరంగిక
తపోవనమై…మలిచిన మకరంధాలను
కొమ్మనకాసే పూసిన బంధంగా ప్రకృతికి
కోమలి రాగమై చలువ చందనాలను
బదులుగా పూయిస్తు… జీవితం ఒక ఆటని
తెలియని సందేశాలతో నెరవేరని బూటకమని
నిజాలు తెలిసిన నిప్పుల కుంపటిలో అడుగు
పాతాళం కాలిపోతున్నది…
జల్లు జల్లున నడిచిన కాలిగజ్జెల
సవ్వడి…జారిన గుండెను పొడుస్తున్నది
కనిపించని రూపం దాగుడు మూతలతో
కనుపాపలకు బరువై… నైతికత నేర్పని వింత
నాటకంలో విలక్షణ విన్యాసాలు ఉనికి
ప్రభావాన్ని చెప్పలేక…వెలుగుల భాష్యం
రెప్పల క్రింది మాయలో కలిసిపోతున్నది…
నీ ముఖాల తేటతెల్లని గుర్తించని మనస్సుకు
గాయం కానుకగా మిగిలింది…
గుబులు చేసిన మధిలో….
పగిలిన హృదయపు నివేదికలు నిలువని
నిరాశలని..వాల్చిన ముఖంతో వాలుజడను
విసరుతు తగరపు వంపుల తర్ఫీదులతో
ఒలికి పోయిన నిజాన్ని చెదరిన గూటిలో
నిలుపుకోలేవని…. పొద్దుపోత నిద్దురలో
సంధ్య వాకిలిని విడిచి మనస్సు మన్ననని
చూడక…నిలువలేని సంధ్య చుక్కగా
దురమవుతున్నావు….
-దేరంగుల భైరవ