ప్రకృతి అందాలు

ప్రకృతి అందాలు

నా పేరు అంజలి.. నేను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నా… ఇక్కడ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా… ఎప్పుడూ ఉరుకుల పరుగుల తోనే కాలం గడిచిపోయేది… ఈ హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కి ఏమాత్రం లోటు లేదు… ఈ కాలుష్యం, ఆ వెహికల్స్ నుండి వచ్చిన శబ్దాలు కర్ణబేరిని చెడగొట్టేస్తున్నాయి..

నా జీవితం కూడా అలాంటిదే పొద్దున్నే లేచి, ఫ్రెష్ అయ్యి, ఆ ట్రాఫిక్ లో ఆఫీస్ కి వెళ్లి… మళ్ళీ సాయంత్రం తిరిగి రావడం… వచ్చేసరికి ఎలా అయ్యేదానిని అంటే నలిగిపోయిన గులాబీలా నా మొహం వాడిపోయేది. పోనీ జాబ్ మానేద్దాం అనుకుంటే…” ఈ లోకంలో మనీకి ఉన్న విలువ మనిషికి” ఉండదు…

అలా అలా రోజులు గడుస్తండగా… ఒకరోజు మా ఫ్రెండ్ కి పెళ్లి కుదిరింది అని చెప్పింది…. మొదటగా అంతగా ఆసక్తి చూపించలేదు వెళ్ళడానికి… కానీ మా ఫ్రెండ్ అప్పుడప్పుడు వాళ్ల ఊరు గురుంచి ఎన్నో అద్భుతాలు చెప్పేది.. ఆ చల్లని గాలి, పిల్ల కాలువలు, ఆ తాడి చెట్లు అని వాళ్ల ఊరు అందాలు చెప్తుంటే… ఇక మనసు వెళ్ళమని పోరు పెట్టింది. బ్రెయిన్ నువ్వు అక్కడ ఇమడలేవు వద్దని వారించింది… ఎట్టకేలకు మనసుకు ఓటు వేసి ఆమె పెళ్లికి వెళ్ళడానికి సిద్దమయ్యాను. బస్ ఎక్కినప్పటి నుండి నా బ్రైన్ లో ఒకటే రన్ అవుతుంది.. నిజంగా తను చెప్పినట్టు ఉంటుందా ఊరు లేకపోతే సరదాగా అలా చెప్తుందా అని..

అలా 17 గంటల సుదీర్ఘ ప్రయాణం తరువాత బస్ ఒక పల్లెటూరులో ఆగింది… నేను బస్ దిగి మా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నా… తను నాకోసం వచ్చి నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్ళింది… నిజంగా ఇల్లు ఎంత బాగుంది అంటే మాటల్లో చెప్పలేను… పాత కాలం నాటి పెంకుటిల్లు అది. పెద్ద వరండా… ఎవరు వచ్చినా కూర్చోడానికి వీలుగా కుర్చీలు, ఒక వైపుకి సోఫా అది కూడా చెక్కతో చేసినది.

అలా వరండా లోపలకి వెళ్తే ఎడమ వైపు రెండు రూమ్లు, కుడి వైపు మూడు రూమ్లు, అలా లోపలకి వెళితే వంటగది, స్టోర్ రూం, అలా ఇంకా వెళ్తే బయట రెండు పెద్ద పెద్ద చెట్లు మధ్య ఒక తుగుటుయ్యాల… ఆ చెట్లు ఆ ఇంటికి ఆర్చరీ లా బలే ఉన్నాయి… చుట్టూ చిన్న చిన్న మొక్కలు కోళ్లు, బాతులు తిరుగుతూ ఉన్నాయి…

నాకు ఆ వాతావరణం బాగా నచ్చి మా ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి నాకు ఊరు చూపించమని అడిగాను… తను సాయంత్రం వెళ్దాం నువ్వు ఫ్రెష్ అయ్యి వస్తే తిందాం అని చెప్పింది… సాయంత్రం వరకు ఆగాలా అని అసహనం వ్యక్తం చేస్తూనే సరే అన్నాను…

కానీ సాయంత్రం. ఎప్పుడు అవుతుందో అని వెయిట్ చేస్తూ ఉన్న… అలా బస్ జర్నీ వల్లనో లేక ఏ కాలుష్యం లేకుండా స్వచంగా వచ్చిన గాలి వల్లనో తెలీదు కానీ నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది…. సాయంత్రం 4.40కి మా ఫ్రెండ్ వచ్చి నన్ను లేపి పదా ఊరు చూడ్డానికి వెళ్దాం అని చెప్పింది… ఆ మాటే నా చెవిలో అమృతం పోసినంత హాయిగా అనిపించి గబ గబా లేచి తనతో పాటు గా నడిచాను.

ముందుగా వాళ్ల పొలాలు చూడ్డానికి వెళ్దాం అని చెప్పింది. సరే అన్నాను. అసలు అలా వెళ్తుంటే మనసంతా ఏదో తీయని హాయితో నిండిపోతుంది. వేసవి కాలం కావడం వలన ఎక్కడికక్కడ వరి చేలు కోసేసి పొలం దున్ని పెట్టారు. బహుశా వేరే పంటకోసం అనుకుంటా…

ఆ పొలాల చుట్టూ పెద్ద పెడ్డతాడి చెట్లు మధ్యలో చిన్న చిన్న పిల్ల కాలువలు కొంత మంది వేసవి పంట కోసం నారు పోసి ఉంచారు… ఆ దృశ్యలు నా కళ్ళతో చూస్తుంటే ఎంత బాగుందో… అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా నా ఫోన్ లో వాటిని ఫొటోస్ తీయడం మొదలు పెట్టాను.. అలా నడుస్తూ మా ఫ్రెండ్ వాళ్ల పొలం దగ్గరకి వచ్చేశాం…

నిజం గా ఆ ప్రదేశం ఎంత బాగుంది అంటే…. ఆ ఊరిలో ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అనిపించింది. ఆ పెద్ద పొలానికి ఒక వైపు రేకుల షెడ్డు దానిలో ఒక నులక మంచం ఎవరైనా పెద్దవాళ్ళు పొలాన్ని చూడ్డానికి వస్తె వాళ్ళు అలిసినప్పుడు పడుకోడానికి వీలుగా ఉంది… పక్కనే పంపుసెట్ దానిలో ఫుల్ గా వాటర్ ఉన్నాయి..

ఆ తర్వాత వాళ్ల పూల తోటకి తీసుకెళ్ళింది అది చూసి నాకు అక్కడే ఉండాలి అనిపించింది… అన్ని రకాల పూలు, పండ్లు ఉన్నాయి అక్కడ. అందులోకి వెళ్ళగానే మల్లెలు నేను ఉన్నాను అని ఆ ఘాటైన వాసన కలిగిస్తున్నాయి… సంపెంగలు కూడా నేనేమీ వాటికి తక్కువ కాదు అన్నట్టుగా అవి కూడా వాసనని వెదజల్లుతూ ఉన్నాయి. అలా అలా తిరిగి అలిసిపోయిన మాకు అక్కడ పనిచేస్తున్న పాలేరు వచ్చి కొబ్బరిబొండం ఇచ్చాడు…

అప్పటి వరకు నేను గమనించలేదు కానీ… పక్కనే ఒక కొబ్బరి తోట, మామిడి తోట ఉన్నాయి… వాటికి ఆనుకుని అరటి తోట… వాటి వెనుక వైపు కొద్ది దూరం లో ఒక పెద్ద చెరువు దానిలో ఫుల్ గా కమల పువ్వులు ఉన్నాయి…. ఆ దృశ్యం ఎంత బాగుంది అంటే చాలా చాలా బాగుంది… ఇంకా చీకటి అవ్తుంది అని మా ఫ్రెండ్ చెప్పేసరికి అయిష్టం గానే ఇంటికి కదిలాను కొంచెం గోరింటాకు కోసుకుని…

ఇంకా అక్కడి నుండి వచ్చేసి స్నానం చేసి కూర్చున్న మా ఫ్రెండ్ వాళ్ల నాన్న గారు అప్పుడే పొలం నుండి వస్తున్నారు… అతనిని చూసి వినయం గా లేచి నమస్కారం చేశాను… ఆయన ఈరోజు రాత్రికి ఆరు బయట తిందాం నీకు అభ్యంతరం లేదు గా అని అన్నారు… ఆ మాటకి నాకు 1000 వాట్ బల్బ్ లా నా ఫేస్ వెలిగిపోయింది.. వెంటనే నాకేం అభ్యంతరం లేదు అని చెప్పేశాను….

అలా అలా డిన్నర్ ఏర్పాట్లు అన్ని ఆరుబయట వరండాలో ఏర్పాటు చేశారు… పెళ్లికి ఇంకా ఒక రోజే టైమ్ ఉండటంతో చుట్టు పక్కల వాళ్ళు వస్తూ పోతూ ఉన్నారు… బయట అందరూ కూర్చునే విధంగా చాపలు పరిచి వాటిమీద అరటాకులు పెట్టి వడ్డిస్తున్నారు…. చుక్కల ఆకాశం, చల్లటి గాలి, ఎవరో ముసలి వాళ్ళు రేడియోలో వస్తున్న పాత పాటలు చెవులకి విని, వినిపించినట్లుగా వినిపిస్తుంటే ఆ అనుభూతి వర్ణనాతీతం…

ఇంకా నిద్ర పోవడానికి కూడా బయటే ఏర్పాటు చేశారు… సాయంత్రం తెచ్చిన గోరింటాకు రుబ్బి… అందరికీ పెద్దవాళ్ళు పెట్టారు…. అదే సిటీ లో ఉంటే మెహంది, సంగీత్ అని హడావిడి హడావిడి చేసి ఎన్నో రసాయనాలు ఉన్న మెహంది పెట్టేవారు..

కానీ ఇక్కడ స్వచ్చంగా చెట్టు ఆకు రుబ్బి పెడుతుంటే ఆ వాసన కూడా చాలా బాగుంది….. అలా చిన్న వన జల్లు మొదలయ్యింది అందరూ లోపలికి వెళ్ళిపోయారు… నేను అక్కడే ఉన్న కిటికీ దగ్గర నిల్చుని ఆ మట్టి వాసనని నా మనసులో బందించుకుంటున్నా… సిటీ లో వర్షం పడితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్, డ్రైనేజ్ పొంగి రోడ్స్ మీద ఉండేది… వర్షం నీళ్ళు ఎటు వెళ్ళాలో తెలియక అక్కడే ఉండిపోయేవి…

ఇంకా అప్పటికే టైమ్ చాలా అవ్వడంతో.. నిద్రకి ఆహ్వానం పలికాను… ఎప్పుడు నిద్ర ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే నేను… ఈరోజు చాలా తొందరగా నిద్రలోకి జారిపోయాను…. 

ఎన్ని జరిగిన మన సూర్య బ్రో తన పని చేసుకుంటాడు గా… అదేనండి తెల్లవారింది…. ఎదావిధిగా… 

పెళ్లికి వచ్చిన చట్టాలతో ఇల్లు అంత కళకళలాడింది… మామిడి తోరణాలు, కొబ్బరి పందిర్లు, నులకమంచాలు, అరటి గెలలు ఇలా అన్ని ఆ ఊరి వాళ్ళు ఒక్కొకరు వచ్చి పెళ్లికి సహాయం చేస్తున్నారు… .అలా పెళ్లి అయిపోయింది.. నాక్కూడా సెలవులు అయిపోవడంతో తప్పక పట్నానికి పయనం అయ్యాను…. ఇంకా అప్పుడప్పుడు సెలవులు పెట్టి మరీ ఆ ఊరు వెళ్లేదాన్ని… అక్కడ మనుషులు కూడా వాళ్ల ఇంటి ఆడపిల్లలా చూసుకునే వాళ్ళు…

– మేఘమాల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *