ప్రకృతి అందాలు

ప్రకృతి అందాలు

ఏవండీ నేనో మాట్లాడగనా అందావిడ.
ఆలస్యం ఎందుకు అడుగు అన్నాడు అతడు.
ప్రకృతి అంటే ఏంటండి అవి ఎలా ఉంటాయి
కాస్త నాకు విడమరిచి చెప్తారా అందావిడ గోముగా
దానికి ఏం భాగ్యం చెప్తాను ఎందుకు చెప్పను విను మరి…
ప్రకృతి అచ్చం నీలా ఉంటుంది అంటూ ఒక్క ముక్కలో చెప్పాడు అతడు.
మీరు మరీను నేను ఎలా ఉంటానో నాకు ఎలా తెలుస్తుంది
చెప్తేనే కదా తెలిసేది అంటూ మూతి ముడుచుకుంది.

నిలువెత్తు నీ రూపం ప్రకృతి
గుండ్రటి నీ ముఖం ప్రకృతి
వెడల్పాటి నీ నుదురే మైదానం
పెద్దగా ఉన్న నీ కళ్ళలో అప్పుడప్పుడు
ప్రవహించేదే సాగరం,
రెపరెపలాడే నీ కను రేప్పలే ఆల్చిప్పలు
ఆ ఆల్చిప్పల కింద సంపెంగ తోట
ఆ తోటలో ఎన్నో సంపెంగ పూలు
కోపంలో ఎరుపు, విషాదంలో నలుపు
శాంతంలో తెలుపు, ప్రేమలో అరుణారుణర్ణాలకాంతులెన్నో…

ఆ కాంతులన్నీ నీ మోములో ప్రతిఫలిస్తుంటే సూర్యుడు ఉదయిస్తున్నట్టు
నీలో ఆ కాంతులు సన్నగిల్లుతుంటే చంద్రకాంతలు వస్తున్నట్లు
ఇక ముద్దులు మూట కట్టి మాటలు పలికే నీ చిన్నినోరు విచ్చుకుంటే మందారాలు పూసినట్టు, 
నీ పెదాలు విరిస్తే సన్నజాజులు మూగబోయినట్టు, నీ పెదాలు చిరునవ్వు నవ్వితే గులాబీ గుభాళించినట్టు
సన్నగా ఉన్న మేడనే శంఖం
ఆ కింద ఎదలోతులే కొండ ప్రాంతాలు
ఆ కొండలు గుట్టలు దాటుకొని వస్తే
అదే పాతాళ లోకం సృష్టి రహస్యం
ఇక నీ నల్లని కురులే జలపాతాలు
నీ కాలి వెళ్లే నదీపాయలు
నీ కడుపులో పెరిగేవే కాయలు,
ఆ కాయలు సృష్టించేది
రెండు మహా వృక్షాలము మనమే
ఆ కాయ ఫలమై, ప్రతిమై
మన ఎదుట నిలిస్తే మన ప్రయత్నం
ఫలించి మన ఎదుట నిలిచి
మరో కళ్ళతో ప్రకృతి కాంతను చూపిస్తుంది.
పచ్చగా రకరకాల అందాలతో
విరబూసిన సుమాల మాలలతో
సుమాలన్నీ ఏకమై ఒక సుగందాన్ని వెదజల్లే
నీ రూపమే ప్రకృతి.
ఎత్తు పల్లాలు స్వర్గ నరకాలు
పాపపుణ్యాలు అన్నీ ప్రకృతిలో భాగమే.

అని అతను ఇంకేదో అనబోతూ ఉండగా…. ఇలా రండి సార్ టెస్టుల కోసం మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ ఒక నర్సు వచ్చి వాళ్ళిద్దర్నీ చేయి పట్టుకొని నడిపించింది. వారిద్దరి చేయి చేతులు ఒకరినొకరు పెనవేసుకుంటూ తడుముకుంటూ ముందుకు సాగాయి.

– భవ్య చారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *