ప్రపంచ రేడియో దినోత్సవం 

ప్రపంచ రేడియో దినోత్సవం 

బూచాడమ్మా బూచాడు బుల్లి పెట్టె లో ఉన్నాడు కళ్ళకి ఎప్పుడూ కనిపించడు కథలు ఎన్నో చెబుతాడు. అంటూ మన పెద్దలు టెలిఫోన్ గురించి ఎప్పుడో పాటను రాశారు. కానీ అదే పాట మనం రేడియో కి కూడా మలుచుకోవచ్చు… అయితే చిన్నప్పుడు రేడియోకు మనకున్న అనుబంధం చెప్పలేనిది.

పొద్దున్నే 6 గంటలకి వందేమాతరం తో మొదలై వార్తలు విశేషాలు దేశవిదేశాల కబుర్లు మన అందరికీ తెలిసేలా చేసేది.

ఆ తర్వాత లలిత సంగీతం 11 గంటలకి తెలుగు పాటలతో అలరించేది. మళ్లీ 12 గంటలకి హిందీ ప్రసారాలు మూడు గంటల వరకు వచ్చేవి ఆ తర్వాత కొంత విరామం.

ఇక సాయంత్రాలు ఏడు గంటలకు వార్తలతో మొదలయ్యి ఎనిమిది గంటలకు కొన్ని పాటలు ఆ తర్వాత తొమ్మిది గంటలకు ఇంగ్లీష్ వార్తలు వంటివి వచ్చేవి. పాత తరం వాళ్ళు రేడియో తోనే ప్రపంచంలో ఏం జరిగినా తెలుసుకునేవారు.

రేడియో ఎప్పుడు ఎక్కడ పుట్టింది అంటే 1895నుండి 1896 నుండి మొదలై కమర్షియల్ గా 1900 లలో బయటకు వచ్చింది.

ఇక అప్పటి నుండి ఎన్నో రకాలుగా జనాలను అలరిస్తూనే ఉంది. మన తెలుగు వారి కోసం ప్రత్యేకంగా కూడా ఆకాశవాణి కేంద్రం మొదలుపెట్టి పాటలు నాటకాలు-నాటికలు,కథానికలు,పద్యాలు ఏకపాత్రాభినయాలు లాంటివి కూడా మనకు వినిపించారు.

ఇక రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అంటూ ప్రతి ఆదివారం కొన్ని కబుర్లు తర్వాత మూడు గంటలకు బాలానందం 11 గంటలకు ఒక పాత చిత్రంతో అలరించేవి.

రేడియో జనాలలో ఒక మంచి పేరును క్రేజ్ తీసుకుని వచ్చింది.అప్పట్లో రేడియో ఉన్నవాళ్ళు పెద్ద ధనవంతుల కిందే లెక్క . పల్లెటూర్లలో ఎవరికైనా రేడియో ఉందంటే సాయంత్రం ఏడు కాగానే అందరూ రాబోయే వార్తల కోసం ఆ రేడియో ఉన్న వారి ఇంటి ముందు గుంపుగా కూర్చునేవారు. అందులో విశేషాలను వింటూ ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకుంటూ ఉండేవారు.

కాలక్రమేణా రేడియో కనుమరుగైపోయింది దూరదర్శన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఈ తరం పాత తరానికి వెళ్ళింది రేడియో అనేది మళ్ళీ మొదలైంది. కాకపోతే ఈ సారి నవతరం తో కొత్తగా మొదలైంది రేడియో మిర్చి , రెడ్ ఎఫ్, ఎమ్ అంటూ ఎన్నో కొత్త కొత్త ఛానల్స్  పుట్టుకొచ్చాయి.

వీటి ద్వారా ప్రదీప్ లాంటి కొత్త యాంకర్లు కూడా రేడియో జాకీలు ఉపాధిని సంపాదించారు. ఇందులో పాటలతోపాటు చిన్న,చిన్నపోటీలు పెట్టేవారు. వాటిని గెలుచుకున్న వారికి సినిమా టిక్కెట్లు ఇచ్చే వారు వాటితో పాటు హైదరాబాద్లో ఉన్న వారికి ట్రాఫిక్ గురించి కూడా చెప్పారు..

ఈ రేడియో ఎఫ్,ఏం. రేడియో మిర్చి లాంటివి ఒక ఊపు ఊపేసాయి ఆ తర్వాత మెల్లగా కనుమరుగు అవుతున్నాయి. ఇప్పుడు ఈ నవతరం లో ఓటి టి లు వచ్చిన తర్వాత రేడియోలకు ఆదరణ తగ్గిందనే చెప్పాలి.

అయితే పాత ఒక రోత కొత్తోక వింత  వింత అన్నట్లు ఇవన్నీ వచ్చినా కూడా ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే పదాన్ని మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రేడియో తన వైభవాన్ని మళ్లీ సంపాదించుకుంటుంది

ఎలాగంటారా ఇప్పుడు కొన్ని,కొన్ని జిల్లాలో విద్యార్థుల కోసం కొన్ని పాఠశాలలు తమ పిల్లల కోసం కొత్తగా రేడియోను మొదలుపెట్టి అందులో వాళ్ళు చిన్న,చిన్నపాటలు, పద్యాలు, కవితలు, కథలు చెప్పే విధంగా పిల్లలని ప్రోత్సహిస్తున్నారు.

అందువల్ల రేడియో అనేది మళ్లీ కొత్త అందాలను సంతరించుకుంటుంది. ఇప్పటికి కూడా రేడియోలో పాటలు వింటూ తమ పనులు చేసుకుంటూ ఉండేవారు చాలా మంది ఉన్నారు.

ముఖ్యంగా విదేశాలలో అయితే ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ రేడియోలను యాంటిక్ పీసులుగా తమ గొప్పకు చిహ్నాలుగా భావిస్తారు. అయితే మన దేశంలో కూడా ఇప్పటికీ రేడియో వింటూ గడిపే వారు చాలా మంది ఉన్నారు.

పాత కొత్త తరంలో రేడియో కి మించిన ఎంటర్టైనర్ లేదు. కరెంటు ఉన్నా పోయినా కూడా సెల్స్ తో పనిచేసే రేడియోలకు ఎక్కువ ఆదరణ ఉంది. కొత్త తరాలు ఎన్ని వచ్చినా పాతవాటిని గౌరవించాలి అనే ఉద్దేశంతో ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా నా ఈ చిన్ని వ్యాసం.

– అర్చన

Related Posts