ప్రతి ప్రాణికి నియమమే…!!!

ప్రతి ప్రాణికి నియమమే…!!!

పిలుపేదో కదలికలేవో కనిపించక
పోయినా క్రమంతప్పని కాల నిర్ణయం
చీకటి వెలుగుల సంఘమమై…
ఈ లోకానికి సమయ సూచికగా
నిత్య నూతనాలతో ఋతువులను
చిలికిన ఎన్నో చేతనలకు స్వాగతమై
ప్రకృతి చిగురులకు ప్రాణం పోస్తున్నది…

గతి తప్పనిది కాల ప్రవాహం
నిలిచిన నీడన ఆగనిది సమయాల
సందేశం…వాలిన సంధ్యల వాకిళ్ళతో
వెలుగును కప్పిన అభిమానం
తూరుపున తెలవారుతు మారిన
రోజులతో నీ గమ్యాన్ని సూచిస్తు…
నిరంతరమై సాగిపోయే దిక్సూచిని
కాలచక్రమై నడుపుతుంది…

అలజడి లేని ఆశయమో
తానై నేర్చిన సిద్ధాంతమో…
సమయంగా సృష్టికి రంగులు మార్చేదే
అయినా ప్రతి ప్రాణికి నియమమే…
కలల ప్రపంచంలో కునుకు తీయని
భాష్యంతో వినిపించేదంతా బూటకమే…
అరువు నేర్చిన మనో నిచ్చయాన్ని సృజన
చేసిన వాడిగా సముదాయమై కదలిపో…

కొసరని జ్ఞానంతో చెదరని ముద్రవవుతు
ఊహించేది రూపం కాకపోయినా…
నువ్వు కానిది శూన్యమని తలువకు
నిత్య ప్రగతికి శ్రామికుడవై సమయం
నేర్పిన కొత్తధనాలతో మబ్బు తెరలను
తెంచుతు… దేహమై యదార్థాలకు
వాస్తవమైన నియమాన్ని సమయంగా
నడిపించుకో…

– దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *