ప్రేమ లేఖ

ప్రేమ లేఖ

హలో మై హ్యాండ్సమ్, ఓయ్ నిన్నే ఏంటి బాబు హాయిగా బజ్జున్నవా, ఇక్కడేమో నాకు నిద్ర రాకుండా చేసి, వెంటనే నేను ఎం చేశాను అంటావేమో… నీకేం తెల్సు నువ్వు ఎంత అల్లరి పిల్లోడివో, రోజు నా కల్లోకి పదే పదే వచ్చి నా మనసు తలుపులను తట్టుతుంటే ఎలా బాబు పడుకొనేది…

అందమైన ని రూపం నా మదిలో మెదులుతూ మరి అల్లరి పెడుతోంది. నువు నన్ను చూసినప్పుడు నీ పెదవులపై పూసే చిరునవ్వు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఎంత అందంగా నవ్వుతావో తెలుసా, ఆ నవ్వు కి ఏ అమ్మాయి పడిపోదు చెప్పు.. అందుకే నేను కూడా నీతో ప్రేమలో పడిపోయానేమో 

ఇంటి ముందు ముగ్గు వేయడానికి వచ్చినప్పుడు ఎదురుగా నువ్వు కనబడతావేమోనని ఎంతగా ఎదురు  చూసేదాన్నో… చివరికి నువ్వు కనబడగానే ప్రపంచాన్నే జయించినంత సంతోషం, ఎవరెస్టు శిఖరం అధిరోహించినంత ఆనందం.

మానస సరోవరం లో విహరించనంత ఉల్లాసం, జాతరలో అన్నయ్య గాజులు కొనితేచ్చినంతా సంబరం, కానీ నువ్వు ఒక్క రోజు కనబడక పోతే ఎంతగా తపిస్తుందో నా పిచ్చి మనసు నిన్ను చూడాలని, నీ రూపం నా కన్నుల్లో నింపుకోవాలని, సాధారణంగా రోజుకి  ఒకటో, రెండో సార్లు గుమ్మం దగ్గరికి వచ్చే నేను, నువ్వు కనబడని రోజు నిన్ను చూడాలని ఎన్ని చక్కర్లు కొడతానో నా గది నుంచి గుమ్మం బయటికి, నాకే తెలీదు అంటే నమ్ము….

అయినా ఏంటో నువ్వెప్పుడూ నీ గది దాటి బయటికె రావు, ఎంత నిరాశ పడేదాన్నో, ఎం బాబు అస్తమానం ఆ ప్రాణం లేని రాతిగోడల మధ్యే బంధీ అయి ఉండే బదులు అప్పుడప్పుడు బాల్కనీలోకి రావచ్చుగా నాకోసం, బయట ప్రపంచాన్ని కొంచం ఆస్వాదించవచ్చు కదా…

చెట్ల మీద కిల కిల పక్షులు, గల్లీలోని చిన్న పిల్లల ఆటలు, అరుపులు, కేరింతలు, చూసే వంకతోనైనా, నీ దర్శన భాగ్యం కోసం ఎదురుచూసే నాలాంటి భాగ్యుల్ని కాస్తనైనా కరుణించ్చొచుగా…
  
మొదటిసారి నన్ను నేనే చాలా తిట్టుకున్న నేనో కవియిత్రిని కాలేదని, నిన్ను వర్ణిస్తూ ఓ కవిత రాయలేకపోతున్నాని, అందమైన పదాలతో అక్షరాలను అల్లకపోయినా, నా అంతరంగంలో అణువణువు నిన్నే నింపుకొని నీకో మాట చెప్పాలని ఈ లేఖ రాస్తున్న ఓయ్ శ్రీ వింటున్నావా…

అదేంటి చదువుతున్నవా అనాలిగా అనుకుంటూన్నావేమో! మనసు పెట్టి చూడు ఇందులోని ప్రతి అక్షరం నేను పలుకుతున్నట్టే వినిపిస్తుంది. ప్రతి పదంలో నా రూపమే కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం నేను పెన్ను పట్టి రాయలేదు నా మనసు పెట్టి రాసాను.

నా భావాల్లో  భావుకత కనిపించక పోవచ్చేమో కానీ నీ పై నాకున్న ప్రేమ కనిపిస్తుందనుకుంటాను.. ఇంతకీ నేను చెప్పాలనుకున్న మాట 721 ఈ పదానికి అర్థం నీ నోటితో చెబితే వినాలని ఉంది. అందుకే నేను ఇక్కడ చెప్పట్లేదు…

ఏంటి ఈ పిల్ల తన ఇష్టానికి ఎదేదో రాసేసి చివరికి  ఒక నెంబర్ పెట్టేసి లేఖ ముగించేసింది అనుకున్నావు కదా, ఎన్నో ఊసులు, ఏవేవో కబుర్లు నీకు చెబుదామనుకున్నా… ఎక్కడ? పెన్ను పట్టుకొని రాద్దామని ఆలోచిస్తుంటే ప్రతి ఆలోచనల్లో తమరే అందంగా నవ్వుతూ కనిపిస్తున్నారు…

ఇంకా ఎలా రాసేది, నా ఆలోచనలు ముందుకు సాగేది, నేను అనుభవించిన ఈ గమ్మత్తైన బాధకి రివెంజ్ గా ఈ చిన్న పజిల్. కాసేపైనా ని బుర్రకి పని చెప్పాలని నా తాపాత్రయం, మరి నీ బదులు కోసం ఎదురుచూస్తూ ఉంటాను.      

ఇట్లు పక్కింటి పిల్ల 

– వెన్నెల శ్రీ

Related Posts