పునరుత్థానం

పునరుత్థానం

మదిలో నీరసాల నది పోటెత్తుతూ
పోస్ట్ రిటైర్మెంట్ నావను కుదిపేస్తుంటే
ఆలోచనల తెరచాపనెత్తాను!

ఖవ్వాలీలు,గజల్స్ పాడిన కాలం
ఎటుపోయింది
ఒంటరి పక్షి విరహవేదనందుకుని
నిర్లిప్తపు రహదారిగ మారిందా కాలం!

కలల నక్షత్రాల కాంతులతో
మనోకాశమెంత మధురంగుండేది
ఆనందపు గుండెగదినెప్పుడు ఖాళీచేశావయ్యా
దూరంనుంచి బైరాగి తత్వమై నీ తత్వాన్ని అడుగుతున్నాడు
అది భ్రమా?భ్రమరమా?
నువ్వే తేల్చుకో

దారంతా పగుళ్ళే
మనసంతా దిగులే
మనిషాగటంలేదు..దూసుకుపోతున్నాడు
మనసెందుకు ఆగాలి!మౌనగీతమెందుకవ్వాలి!

మొలకెత్తినగింజలు మంచివైనట్టు
ప్రశ్నలని మొలకెత్తనివ్వలేమో
“అవి నీరసాల నదిని ప్రక్షాళిస్తాయా?
సమాధానాల వనమై నను సముదాయించగలవా?”
సందేహాల మబ్బులను తొలగించే అంతర్వాణికి అవకాశమివ్వు

భ్రమణకాంక్షను తట్టిలేపి
సంచరించే కోరికలను
మనసు సంచిలో వేస్తే
మెజీషియన్ లా జారిపోయిన కాలాన్ని వెలికితీసి
జ్ఞాపకాల జెండాను చుట్టు!

పడిలేచే కెరటాలన్నీ తీరమంటే పడిచచ్చేవే
పదిమందికి పనికొచ్చే పాటలా కావాలని
కాలాన్ని శ్రుతిచేయి
దుఃఖాన్ని కనురెప్పల వెనక దాచేయి
నిర్జీవనదిలో కలల నీళ్ళు నింపు

నీ స్పష్టత అస్పష్టంగా ఉందంటారు
నీ దారిని మూసేశారంటారు
అంటే అననీ
నువు మాత్రం ఫీనిక్స్ పక్షిలా
పునరుత్థానం చెందు..పునరుత్థానం చెందు
అప్పుడు నువ్వందరికీ చెందుతావు!

– సి.యస్.రాంబాబు

Related Posts