రాఖీల పున్నమి
అబ్బో మా తమ్ముళ్ళ గురించి చెప్పాలి అంటే చాలా చెప్పాలి. చిన్నప్పుడు వాళ్ళూ చాలా కొట్టుకునే వారు. నేను పెద్ద కాబట్టి నేను వాళ్లను కంట్రోల్ చేసేదాన్ని. నాన్నకి చెప్తాను అంటూ బెదిరిస్తే, వాళ్ళు భయపడి అక్క వద్దు చెప్పకు అంటూ బతిమాలుతూ ఉంటే అబ్బో చాలా గర్వంగా అనిపించేది.
అప్పుడు నేను వాళ్ళతో నా నోట్స్ రాయించడమో లేదా, నాకు అమ్మ చెప్పిన పనులు వాళ్ళతో చేయించడం చేసేదాన్ని. హా, హా, వాళ్ళు తిట్టుకుంటూనే అన్ని పనులు చేసేవాళ్ళు. వాళ్ళు ఇద్దరు రెండే విషయాల్లో గొడవ పడే వాళ్ళు, విచిత్రంగా, వింతగా ఉండేది వాళ్ళ గొడవ. అదేంటంటే, పెద్ద వాడికి చిరంజీవి అంటే ఇష్టం. చిన్నోడికి వెంకటేష్ అంటే ఇష్టం.
దాంతో, నా హీరో ఫైట్ లు బాగా చేస్తాడు అంటే, కాదు నా హీరో బాగా చేస్తాడు అంటూ తెగ గొడవ పడేవాళ్ళు. ఆ గొడవ ఎంత వరకు వెళ్ళేది అంటే ఇద్దరు షర్టులు చింపుకొని, జట్లు పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్ళేది.
ఇదంతా అమ్మ చూసేది కాదు. పగటి పూట అమ్మ పనిలో, నిద్రలోనే ఉండగా ఇంటి వెనక పెరట్లో జామ చెట్టు మీద కూర్చుని గొడవ పడే వాళ్ళు. అది కూడా సైలెంట్ గానే… లేదంటే, అమ్మ వీపు పగలగొడుతుంది అని భయం. వాళ్ళు గొడవ పడుతుంటే, నేను వెళ్ళగానే ఏం తెలియనట్టు ఆపేసేవాళ్ళు. కానీ, నేను ఉరుకుంటానా మెల్లిగా వెళ్లేదాన్ని. అమ్మకు చెప్తా అంటూ సైగలు చేసేదాన్ని. అన్నట్టు సైగ అంటే గుర్తొచ్చింది.
మాకు ఏదన్నా కావాలన్నా, సినిమాకు తీసుకుని వెళ్ళాలన్నా, నాన్నను అడిగే బాధ్యత పెద్దోడిదే, వాడంటే నాన్నకు ఇష్టం కాబట్టి, వాడిని ముందుకు తోసేవాళ్ళం. నాన్నకు చెప్పు అంటూ సైగలు ద్వారా మాట్లాడుకునే వాళ్ళం. జామ చెట్టు ఆకుల్లో, చింతపండు పెట్టుకుని తినడం, జామ పండును కారం ఉప్పు వేసుకుని తినడం, చార్ పత్తా ఆడడం, చిట్టీల ఆట ఆడుకోవడం, అబ్బో ఒకటేంటి, నా తమ్ముళ్ళు నాకు మంచి స్నేహితులు వాళ్ళతోనే నా ఆటలు.
చిన్నప్పుడు వాళ్ళని ఆడించడానికి, తల కిందులుగా బండల మీద నుండి లాక్కెళ్లి ఆడుకునే దాన్ని. దానికి వాళ్ళు నవ్వుతూ ఉంటే, నాకు సంతోషంగా ఉండేది. కానీ, ఇప్పుడు తల్చుకుంటే అమ్మో అనిపిస్తుంది. నేను అలా చేయడం వల్లనో ఏమో ఇప్పుడు వాళ్ళ తలలు గట్టిగా ఉంటాయి. అయినా అప్పుడు తెలియని తనం.

*******
కానీ, వాళ్ళు నా జీవితాన్ని నిలబెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నన్ను చావు నుండి కాపాడుకున్నారు. నా కోసం ఎంతో కోల్పోయారు. ఎన్నో త్యాగాలు చేశారు, నన్ను నన్నుగా ఇష్టపడేది ఒక్క నా కుటుంబం, నా తమ్ముళ్ళు మాత్రమే. వాళ్లకు నేను ప్రతి సంవత్సరం రాఖీ కడతాను.
అప్పుడు నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం కుటుంబానికి రక్ష అని చెప్తాను. రాఖీ కట్టిన తర్వాత వాళ్లకు కలిగింది ఏదో ఇస్తారు. అదే నాకు సంతోషం, ఆనందం. వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా ఆనందమే, ఎందుకంటే ఈ జీవితం వాళ్ళు ఇచ్చిందే కాబట్టి. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా, పిల్లా పాపలతో, పచ్చగా కళకళలాడుతూ, తమ లక్ష్యాన్ని తొందరగా చేరుకోవాలని, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.
అక్క.
– భవ్య
చాలా బాగుంది అక్క తమ్ముళ్ళ గురించి బాగా చెప్పావు🤗🤗