రైలు ప్రయాణం

అయిదేళ్ళు ఉన్నప్పుడు జరిగిన ఈ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది కారణం ఏమిటంటే నాకు అప్పుడే కొద్ది కొద్దిగా ఉహ వస్తున్నది కాబట్టి అంతకు ముందు ప్రయాణం చేసినా గుర్తు లేదు. కానీ, మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లాలి అంటే మాత్రం రైలులో వెళ్లాలి. అలా వెళ్ళిన నాకు గుర్తున్న, నా ఉహ తెలిసిన నా  ప్రయాణం గురించి చెప్తాను.

మా అమ్మ, నాన్న గారిని అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తాను అని, దానికి మా నాన్న ససేమిరా ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎందుకు అవసరం లేదని అన్నారు. కానీ, అమ్మ వెళ్తాను అని పట్టు పట్టింది. ఎందుకంటే అమ్మమ్మకు బాగా కడుపు నొప్పిగా ఉందని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాం, అని రమ్మని వారం క్రితం లెటర్ వచ్చింది. దాంతో పాటు అమ్మకు ఏదో పీడకల రావడంతో అలా వెళ్తాను అని పట్టుబట్టింది. అందువల్ల నాన్నగారు అతి కష్టం మీద ఒప్పుకున్నారు. వెళ్లడానికి మమల్ని ట్రైన్ ఎక్కించడానికి వచ్చారు.

మేమున్న ఊరు నుండి బస్ ఎక్కి ఇంకొక ఊరికి వెళ్లి రొడ్ మీద దిగి నడుస్తూ రైల్వే స్టేషన్ కు వెళ్లాలి అక్కడ టికెట్ తీసుకుని ట్రైన్ కోసం ఎదురుచూడాలి ఆ ఊరు భలే ఉండేది. రోడ్ మీద దిగాక ఉర్లోకి వెళ్ళాలి అంటే కొంచం కిందికి వెళ్లాలి అంటే కట్ట దిగి వెళ్లాలి మీకు అర్దం అయ్యింది కదా?!!

అల మట్టి బాట వెంబడి నడుస్తూ వెళ్తుంటే రోడ్ కు ఇరువైపులా పచ్చని చెట్లు, పొలాలు ఉండేవి. అవి చూస్తూ ఒక కిలో మీటర్ నడిస్తే స్టేషన్ వచ్చేది సినిమాల్లో చూపించినట్టుగా చిన్న ఇల్లు లాగా ఉండి అందులో టికెట్లు ఇచ్చేవాళ్ళు (కుదిరితే మీకు ఫోటో పెడతాను ఎప్పటికైనా!) ఆ ఇంటికి ఆనుకుని చెక్క కట్టెలు ఉండేవి అంటే, ఎవరు లోనికి రాకుండా ముందు నుండి వెనక నుండి మెట్లు ఉండేవి. కూర్చోడానికి బెంచీలు, దాని పైకి పాకిన కాగితం పూల చెట్లతో స్టేషన్ ఉండేది.

స్టేషన్ ఎదుట అందులో పనిచేసే వాళ్ళ ఇళ్ళు ఉండేవి, ఊరవతల కాబట్టి ఎంతో నిశ్శబ్దంగ ఉండేది. మాకు ఒక్కో సారీ భయం వేసేది. ఇక మేము వెళ్లిన తర్వాత నాన్నగారు టికెట్ కొన్నారు. ఆ తర్వాత, కాసేపటికి రైలు వచ్చింది. ఎక్కి కూర్చున్న తర్వాత నాన్న బఠాణీలు కొని ఇచ్చారు. తొందరగా రమ్మని అంటూ అమ్మకు చెప్పి రావడానికి కొంత డబ్బు ఇచ్చారు. అయితే, ట్రైన్ ఎక్కిన తర్వాత మాకు సీటు బాగానే దొరికింది. ఎందుకంటే అక్కడ ఎవరో దిగారు. దాంతో ఫ్రీగానే దొరికింది. ఇక నన్ను మా అమ్మ కిటికీ పక్కన కూర్చోబెట్టి తమ్ముళ్లను తన వైపు కూర్చో బెట్టుకుంది.

రైలు ప్రయాణం

Free photo Subway Journey City Street Urban Train Transport - Max Pixel

రైలు మెల్లిగా స్టార్ట్ అయ్యింది. కానీ, అసలు నాకు ఏమి తెలియలేదు అంత స్లోగా అసలు కుదుపులు లేకుండా వెళ్లినట్టు అసలు అనిపించకుండా, ఏమాత్రం తోపులాటలు లేకుండా, మా సీటు అని గొడవలు లేకుండా ప్రశాంతంగా వెళ్తుంటే, నేను కిటికీ లోంచి చూస్తుంటే, చెట్లు అన్ని వెనక్కి వెళ్లడం, కొంగలు చెరువులో వాలడం, అదే చెరువులో కలువలు, చాలా అరుదుగా కనిపించే తామరలు చూస్తూ అవి నా కోసమే పూచాయి అని అనుకుంటూ, ఆ తామర లకు నేను వస్తాను అని ఎలా తెలిసిందో అనే ఆశ్చర్యం ,   అవి నా రాక  కోసమే ఎదురుచూస్తున్నాయేమో , అందమైన ఆ తామరలు మొత్తంగా నాకే సొంతం గా భావిస్తూ..

కొంగలు నన్ను రా రామ్మని అంటున్నట్టుగా ఇలా (అప్పుడే మనకు కవితా ధోరణి ఉండేదేమో ) నా కోసమే గాలి విస్తునట్టుగా అనిపించింది అలా వెనక్కి వెళ్తున్న చెట్లను పొలాల్లో పని చేస్తున్న వారిని , చిన్నగా కనిపించే ఇళ్ళను చూస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చూస్తున్న నన్ను దావే బుజ్జి దిగు అంటూ అమ్మ పిలిచే సరికి ఏంటి అప్పుడే వచ్చేసిందా అని అనిపించింది.

అసలు ట్రైన్ వెళ్లినట్టు కూడా అనిపించ లేదు ఇక మళ్ళీ అమ్మమ్మ ను చూసి మళ్ళీ మా ఊరికి మళ్లీ అదే ట్రైన్ లో అలాగే ప్రకృతిని ఆస్వాదిస్తూ వచ్చాము . అప్పటి నుండి ఎప్పుడు ప్రయాణం చేసినా నాకు కిటికీ పక్కన సీటు కావాల్సిందే.. మరి మీకు ఇలాంటి అనుభవాలు అనుభూతులు ఉన్నాయా ..

-శ్రీమతి సురేఖ

Related Posts