రైతు

రైతు

1) తే.గీ
   గూడు లేకున్న కానల కూటి కొరకు
   పోడు గొట్టుచు ముళ్ళతో పోరుసలుపు
   పాడి పంటలు పెంపొంద పాటుబడుచు
   మాడుచుండెడి రైతు సామాన్యుడగునె!

2) తే.గీ
   ఇష్టమున్నను లేకున్న ఇలను దున్ని
   కష్టపడినను రైతుపై కరుణలేదు
   ముష్టి వాళ్ళను జేయుచు మురిసిపోవు
   నాయకుల మాట లెవ్వరు నమ్మరాదు

3) ఆ.వె
   ఆత్మ హత్య పాపమందురే గానిమా
   నిత్యజీవితమున నిజము గనరు
   నమ్ముకున్న పంట నానాట ధరలేక
   రైతు బతుకు లిట్లు రాతలాయె

4) ఆ.వె
   రైతు జన్మభూమి రాణించె నేతీరు?
   కొరతలేక నీరు కోరినాము
   ఊతమిత్తుమంటు ఊరించిపోయిరి
   మాటలన్ని నీటి మూటలాయె

5) ఆ.వె
   ఎన్ని రంగములను నెందరున్నను గాని
   అన్నదాత కన్న అధికులెవరు?
   అన్ని దేశములకు ఆదర్శమూర్తియై
   ఆంధ్ర రైతు ఘనత నందవలయు

రైతు దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు 

– కోట

Related Posts