రేపుందో లేదో

రేపుందో లేదో

వంటరినయానని నీరసంగా నడుస్తుంటాను
తుంటరి కుర్రాడొకడు నాన్నని విసిగిస్తుంటాడు
చిలిపి ప్రశ్నలతో
బాల్యం గొప్పది, వృద్దాప్యం చెడ్డదని చికాకుపడతాను !

వయసైపోయిందని
కుర్చీలో జారగిలబడతాను
వయసైపోయినా
యాభైఏళ్ళుగా ఒకే ధరకు ఇడ్లీలమ్మే ముసలావిడ వీడియో గూగుల్ చూపిస్తూ ఉంటుంది
ఆలోచనలో పడతాను!

రిటైర్మెంట్ తర్వాత ఏంచేస్తున్నావని
జాలిగా అడిగేవారిని ఓదార్పుగా అడిగేవారిని చూసి భగభగమంటాను లోలోపల
కద్రి గోపాలనాథ్ శాక్సోఫోన్
మాండలీన్ శ్రీనివాస్ కృతులు, జతులు మనసు తలుపు తడుతుంటే ఆశ్చర్య పడతాను!

కరిగిపోయే జీవితానికి జడత్వం ఎక్కడ
పరుగులు తీస్తుంది
నడకలు సాగిస్తుంటుంది
వెంట వెళ్ళటం నేర్చుకో
బుజ్జగించే మనసుకు క్షమాపణలు చెప్పాను
రేపుందో లేదో ఎవరికెరుకని
లోకాన్ని కొత్తగా చూడటం మొదలెట్టాను

– సి.యస్.రాంబాబు

Related Posts