సాలెగూడు

సాలెగూడు

ఎటు చూసినా సగం చినిగిన కవర్లు
సగం చినిగిన బట్టలు, తిని పారేసిన
కొనుక్కొచ్చిన టిఫిన్ కాగితాలు,
వాడిన పువ్వులు, తాగి పారేసిన
బీడీ సిగరెట్ పీకలు, ఖాళీ అయిన సీసాలు
వాడి పారేసిన కండోమ్ కవర్లు, విస్పర్ ప్యాడ్స్
వేసుకుని ఉసిన గుట్కా ప్యాకెట్లు ఓ వైపు

ఆకలితో ఏడ్చే పిల్లలు ఓ వైపు
సగం ఆకలి తీరక విటుడి కోసం చూపులు ఓ వైపు
రక్తం కారుతున్నా దెబ్బలు తింటూ పాలిచ్చే తల్లులు ఓ వైపు ,
ఈ గిరాకీ పోతే మళ్ళీ గిరాకీ రాదేమో అన్న తొందర ఓ వైపు ,
తన గిరాకీ నీ లాకున్నావన్న అరుపులు ఓ వైపు ,
కనిపించని తల్లి కోసం ఎదురు చూపులు ఓ వైపు
మల్లెలు వాడకుండానే నలిపేసి వ్యంగపు వ్యక్తులు ఓ వైపు
అలసిన శరీరానికి విశ్రాంతి కూడా ఇవ్వలేని అశక్తత ఓ వైపు,

మురికి కాలువ పక్కన ఒక ముద్ద వేయక పోతారా అని
వయసుడిగిన కన్నెల చూపులు ఓ వైపు

ఒకప్పుడు వెలిగిన వెలుగు తిరిగి రాకపోతుందా అని చూసే జాలి చూపులు ఓ వైపు ,
ఎందుకీ బతుకు బతికి అంటూ చావు కోసం చూసే చూపులు ఓ వైపు
ఇక ఈ రోత మాకొద్దు అనే చూపులు ఓ వైపు
తెల్లారి… కాలే కడుపు కోసం మళ్లీ మంచం ఎక్కాలని నిశ్చయించుకుని గిరాకీ కోసం ఎదురు చూపులు ఓ వైపు …

విరిసి విరియని కన్నెలు ఈ కబంధహస్తాల నుండి కాపాడేవారి కోసం చూసే చూపులు ….

వెరసి అది ఒక సాలెగూడులో బంధీఖానా లో

ఖానా కోసం తపించే చూపులు … తట్టుకునేదేవ్వరు ..

-భవ్య చారు 

Related Posts

1 Comment

Comments are closed.