సామాజిక మాధ్యమాల్లో మహిళల ప్రగతి

సామాజిక మాధ్యమాల్లో మహిళల ప్రగతి

 

సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో మహిళలు ఎంతో ప్రగతిని సాధించారు. అయితే మహిళలు ప్రాచీన కాలం నుండి ఎన్నో వివక్షలు ఎదుర్కొంటున్నారు.

పూర్వకాలం లో మహిళలకు చదువు చాలా తక్కువ, ఎక్కడో ఒక చోట రామాయణ, మహా భారతాలు చదివే వాళ్ళు. ఆ తర్వాత కాలంలో యుధ్ధ విద్యలతో పాటు సంస్కృతం నేర్చుకున్నారు.

ఆ సమయం లో కూడా మహిళలకు చదువు అవసరం లేదని, చదువుకుంటే ఉన్న మతి పోతుంది అని మహిళల పట్ల ఎన్నో అడ్డంకులు తెచ్చారు ఛాందస వాదులు.

ఈ ఛాందస వాదుల నుండి తప్పించుకున్న మహిళలు అంతో ఇంతో చదవడం మొదలు పెట్టారు. కానీ అవి కూడా భక్తి కి సంభందించిన వాటిని మాత్రమే చదివించారు.

భక్తిరస పుస్తకాలు రాసిన వారిలో మొల్ల రామాయణము ముఖ్యమైనది. ఇంకా చాలా రచయితలు వచ్చినప్పటికీ మన తెలుగు లో మొల్ల, కృప భాయ్, సత్తి ఆనందన్, ఎన్హే దువన లాంటి వారు మొదటి మహిళ రచయితగా ప్రాముఖ్యం సంపాదించారు.

కాల క్రమేణా మహిళలు బయటకు వచ్చి చదువుకోవడం మొదలు పెట్టారు. చదువుకుంటున్నారు మీరేం చేస్తారు అన్న వారికి తామేం చేస్తారో అనే విషయాన్ని తెలిసేలా చేశారు. భర్తకు ఉత్తరం రాసుకుంటే చాలు అనే దాన్నుండి గొప్ప గొప్ప నవలలు రాసే స్థాయికి వచ్చారు.

యద్దనపూడి సులోచనారాణి, ఓల్గా, డి కామేశ్వరి, కోడూరి కౌసల్యాదేవి, పోల్కంపల్లి శంతదేవి లాంటి ఎందరో గొప్ప రచయిత్రిలు సినిమాల్లో కూడా తమ సత్తా చాటారు.

అదే సమయంలో చదువుకున్న వారు ఇంట్లో ఉంటూ తన కుటుంబాన్ని కూడా చూసుకుంటూ వ్యవసాయంలో భర్తకు తోడ్పాటు అందిస్తూ, తాము సుకుమారులం కాదని, అవసరమైనంత కష్టాన్ని కూడా చేయగలం అంటూ నిరూపించారు.

తర్వాత తామే స్వయంగా కుటీర పరిశ్రమలు స్థాపించి తన ఉనికిని స్థిర పరుచుకున్నారు. ఇలా పూర్వకాలం నుండి తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు.

సినిమాలు, పరిశ్రమలు, పారిశ్రామిక రంగాలు, సాంకేతిక రంగాల్లో తామెంటో నిరూపించుకున్నారు. ఇన్ని రంగాల్లో తమంటో చుపించుకున్న మహిళలు ఇంకా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు వచ్చాయి సామాజిక మాధ్యమాలు.

అదిగో అప్పుడు మొదలైంది సామాజిక మాధ్యమాలు. ఒకప్పుడు రేడియో, నాటకాలు, టీవీలు చూసిన మహిళలు సామాజిక మాధ్యమాల వైపు మొగ్గు చూపారు. ఫేస్ బుక్, వాట్స్ ఆప్ లు వాడారు.

ఆ తర్వాత టిక్ టాక్, ఇంస్టా గ్రామ్, యూ ట్యూబ్, ట్విట్టర్, మోజ్, షేర్ చాట్, లాంటి వాటిలో ప్రవేశించారు. కొత్తగా వచ్చిన చైనా యాప్ అయిన టిక్ టాక్ ద్వారా మహిళ ల్లో అడుగున ఉన్న నైపుణ్యాలను బయటకు తెచ్చారు.

హీరోయిన్ లు, వివిధ కలారంగల్లో తమ సత్తా చూపించడానికి వసతులు లేని వారికి టిక్ టాక్ ఒక మంచి ప్లాట్ ఫామ్ అయ్యింది. మిగిలిన వృత్తులు, కళల పట్ల అవగాహన ఉన్న వారికి కూడా అవకాశాలు వచ్చాయి.

ఇలాంటి అవకాశాలను అంది పుచ్చుకున్న వారు టిక్ టాక్ కంటే పెద్ద ప్లాట్ ఫామ్ అంటే సినిమాల్లో కి వెళ్ళి తమ టాలెంట్ నిరూపించుకున్నారు. అదే సామాజిక మధ్యమల ద్వారా కొందరు కుటీర పరిశ్రమలు స్థాపించి, ఆ రంగాల్లో అభివృద్ధి సాధించారు.

సామాజిక మాధ్యమాలను వాడుకుంటూ తమ బిజినెస్ ను కొనసాగించారు. తమ బిజినెస్ నలుగురికి తెలిసేలా చేశారు. ఆ విధంగా వాళ్లు సొంతంగానే కాకుండా తమ వల్ల నలుగురికి ఉపాధి చూపించారు. సామాజిక మాధ్యమాలలో తరగతులు నిర్వహిస్తూ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.

ఇలా మహిళలు సామాజిక మాధ్యమాలను వాడుకుంటూ ఎంతో ప్రగతిని సాధించారు. అలా వారు సామాజిక మాధ్యమాల్లో గొప్ప ప్రగతి సాధించిన సమయం లో వారికి వచ్చిన, కలిగిన ఇబ్బందులను అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని, అందరికీ సమాధానం ఇస్తూ తమ శక్తి ఏంటో నిరూపించారు.

ఇదంతా ఒక వైపు మాత్రమే మరి ఆ ఇంకో కోణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సామాజిక మాధ్యమాల్లో ఎంతో ప్రగతి సాధించిన మహిళలు ఓ వైపు ఉంటే, అవే సామాజిక మాధ్యమాల్లో ఇంకో రకంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ట్రోలింగ్ పేరిట వాళ్లు చేసిన అభినయాన్ని దూషిస్తూ తులనాడుతూ చేసిన వాటికి అతిగా స్పందించి, అతిగా బాధ పడిన కొందరు సున్నిత మనస్కులు ఆత్మహత్యలు చేసుకుంటే, మరి కొందరు అవే సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వారి ఆకర్షణలో పడి పండంటి కపురాలను, బిడ్డలను దూరం చేసుకున్నారు.

ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వారి ప్రేమ అనే మాయలో పడిన అమ్మాయిలు, అమ్మలు తమ బిడ్డలను, భర్తలను చంపేసిన సందర్భాలు కోకొల్లలు గా చూశాం. రకరకాల కథనాలూ వచ్చాయి.

ఈ మాధ్యమాల్లో పరిచయమైన వారి ఆకర్షణలో పడిన అమ్మాయిలు వారి కోసం అందర్నీ వదిలి వెళ్తే నమ్మించి మోసం చేసిన వారు వేరే దేశాలకు, వ్యభిచార కూపంలోకి అమ్మేసిన సందర్భాలు అనేకం…

అలా నమ్మి వచ్చిన ప్రేయసి ని తన స్నేహితులతో పంచుకుని తిరిగి బ్లాక్ మెయిల్ చేసిన వింతలు విశేషాలు చూశాం. కన్న బిడ్డలను ఉరేసి చంపుతూ వీడియో తీసిన వారినీ చూసాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.

ఇవ్వన్నీ చూస్తూ సామాజిక మాధ్యమాల్లోకి రావడం ఎందుకు అంటారు చాలా మంది. కానీ ఇది తప్పు ఎలాంటి సామాజిక మాధ్యమాల్లో ఉన్నా, చేస్తున్నది ఏమిటో, చెప్తున్నది ఏమిటో తానెందుకు ఇందులోకి వచ్చారో ఒక అవగాహన, పిచ్చి రాతలు, మాటల పట్టింపులు లేకుండా, ఒక స్పష్టమైన అవగాహన, నిర్ణయం తో వచ్చిన వారికి ఇవెంతో ఉపయోగకరంగా ఉంటాయి.

సామాజిక మాధ్యమాల్లోకి సున్నిత, చంచల మనస్తత్వం ఉన్న వారు రాకపోవడమే ఉత్తమం. అయితే ఇలాంటి వాటిల్లో తాము ఏంటో నిరూపించుకోవాలి అన్నప్పుడు తమ ఇంటి వారి పూర్తి సహాయ సహకారాలు చాలా అవసరం అవుతాయి.

ఎవరో ఏదో అన్నారని భార్యలు భర్తలు వదిలేసిన వారు ఉన్నారు. భార్యలను వదిలేసిన వారు ఉన్నారు. అవకాశాలు ఇస్తామని పిలిచి అత్యాచారాలు చేసిన వారు ఉన్నారు. ఇలా రకరకాల స్వభావాలు ఉన్న వారిని తప్పించుకుంటూ, ఎవరికీ లొంగకుండా తానేంటో చూపించుకున్న మహిళలు ఉన్నారు.

ఇలా సామాజిక మాధ్యమాల్లో మహిళల ప్రగతి కొంత వరకు సాధించినా, మరికొంత కుంటుపడిందని చెప్పవచ్చు. ఏ రంగం లో అయినా మహిళలకు లైగింక వేధింపులు తప్పనిసరి అయిన ఈ కాలం లో మహిళలు ఎంతో సంయమనం పాటించాలి.

తమ సమయ స్ఫూర్తి తో ముందుకు వెళ్లాలి. ఇదే వేరే దేశాల్లో అయితే మహిళ ల పట్ల ఏ కొంచం తేడా గా ప్రవర్తించినా అక్కడి ప్రభుత్వాలు తొందరగా స్పందిస్తాయి. కానీ మన దేశం లో ఆ అవకాశం లేదు.

పైగా లేని పోని మాటలు అంటూ మహిళలదే తప్పు అన్నట్టు ప్రవర్తించడం మామూలే…. కాబట్టి ఏవో సమస్యలు వస్తాయని భయపడకుండా, ముందుకు వెళ్లాలి.

ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ అయినా మిగిలిన వాటిలో మహిళలు దూసుకు వెళ్తున్నారు. అలాగే టిక్ టాక్ పోయిన తర్వాత యూ ట్యూబ్ లాంటి వాటిల్లో చానెల్స్ పెట్టుకుంటూ వంటలు, సంగీతం, నాట్యం వంటి వాటిల్లో తరగతులు నిర్వహిస్తూ ఎంతో ప్రగతిని సాధిస్తున్నారు.

ఇదంతా కొందరి మంచితనం వల్ల జరిగితే, అదే టిక్ టాక్ లో ఫేమస్ అయిన  కొందరు మాత్రం తమకు సెలబ్రిటీ హోదా రావాలని, తమను గొప్పగా చెప్పుకోవాలని, పేరు గడించాలని అనుకుంటూ విపరీత ధోరణులు అనుసరిస్తున్నారు.

ప్రతీ రంగంలో మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు ఉన్నట్టే ఇక్కడ కూడా చెడ్డవారు ఉన్నారు. మంచి వారు ఉన్నారు. అది వారు చేసిన తప్పు కాదు. వాళ్ళు హఠాత్తుగా, రాత్రికి రాత్రి  వారిని సెలబ్రిటీలను చేసిన మన తప్పే…

మనం అలా చేయడం వల్లే వారు అన్నీ ఉహించుకుంటూ, తామేం చేసినా జనాలు చూస్తారని భావించి,  తాము పెట్టుకున్న ఛానెల్స్ లో వికృత చేష్టలు చేస్తూ అసలెందుకు చేస్తున్నారో తెలియని స్థితిలో చేయరాని పనులన్నీ చేస్తున్నారు.

వారు చేస్తున్నది చూస్తూ వారిని తెగ తిట్టుకుంటూ ఉన్నారు జనాలు. కానీ వాళ్ళు తమ తప్పును తెలుసుకుని మంచిగా మారి, మంచి విషయాలను వివరిస్తూ, మంచి వంటలు చూపిస్తే దానికన్నా మంచి ఎక్కడుంది.

జనాలు అన్నీ చూస్తారు అనే ఇంగితం ఎవరికైనా ఉండాలి, కానీ పేరు కోసం వికృత చేష్టలు చేయకూడదు. ఈ విషయాలన్నీ చెప్పిన వారిని తిడుతూ, తాము చేసేదే కరెక్ట్ అని భావిస్తూ వాటిని పిచ్చిని జానల పైకి వదులుతూ ఉన్నారు.

కానీ ఇవ్వన్నీ కాకుండా సామజిక మాధ్యమాల్లో అసలు ఎలా డబ్బు సంపాదించాలి అనే దాని పై ఒక అవగాహన తెచ్చుకుని, తమ నైపుణ్యాలకు సాన పెట్టుకుంటూ, సలహాలు, సూచనలు పాటిస్తూ తమను తాము రూపొందించుకుంటూ ముందుకు సాగితే వారికన్నా బుద్ధిమతులు ఎవరూ ఉండరు.

సామజిక మాధ్యమం ఏదైనా మహిళలు ముందుకు సాగాలి. తమకు ఉన్న నైపుణ్యాన్ని చూపించాలి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఏమి సాధించలేదు అని అనుకోకుండా ఇలాంటి చిన్న, చిన్న సామజిక మాధ్యమాల్లో తమ ట్యాలెంట్ ను పది మందికి చూపిస్తూ, జనాలను అలరించవచ్చు.

తాము కూడా మానసిక ఆనందం పొందవచ్చు, ఒక్క కళలే కాకుండా భక్తి, సంప్రదాయం, పురాణం ఇతిహాసాలకు సంభందించిన ఎన్నో విషయాలను పదుగురికి పంచాలి.

ఇలాంటి వాటిల్లో సంపాదన పరంగా, మానసిక ఆనందం పరంగా మహిళలు ప్రగతి సాధించాలి. తమ ఇంటిని, పిల్లలను, కుటుంబాన్ని తీర్చి దిద్దుతూ, తామెంటో, తమ శక్తి ఏంటో ప్రపంచానికి చాటవచ్చు, మహిళల్లో ఈ శక్తి, సమయ స్పూర్తి ఇలాగే కొనసాగాలని, ఇలా  కొనసాగితే ఇంకా మహిళల్లో అభివృద్దిని చూడొచ్చు.

ఏతా వాతా చెప్పొచ్చేది ఏంటంటే మనం ఏదైతే ఉపయోగించుకోవాలని అనుకుంటున్నామో దాని పై పూర్తి అవగాహనతో ఉంటే ఎలాంటి సమస్యలు రావని, ఒకవేళ వచ్చినా సమయ స్ఫూర్తి తో వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాలని నా అభిప్రాయం.

– అర్చన

Related Posts