సామ్రాజ్యం ప్రేమలేఖ

సామ్రాజ్యం ప్రేమలేఖ

ప్రేమలేఖ రాయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. పాత కాలంలో ప్రేయసీ, ప్రియులు తమ మనసు మరొకరికి తెలియచేసేందుకు ఇదొక్కటే సాధనం. అన్ని ప్రేమలేఖలు సినిమాల్లో చూపించినట్లు సాహిత్యంతో ఉంటాయని చెప్పలేం.
తెలిసీ తెలియని వయసులో ఆకర్షణను ప్రేమగా భావించి రాసే లేఖలు కొన్ని రాసే వారి అమాయకత్వాన్ని తెలియచేస్తే, కొన్ని లేఖలు హాస్యాన్ని పండిస్తాయి. అలాంటిదే మా సామ్రాజ్యం ప్రేమలేఖ.
దాదాపు పాతికేళ్లకు ముందు నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పటిది ఈ సంఘటన. మేమంతా మా పల్లెటూరినుంచి పక్కనే ఉండే పట్టణానికి వెళ్లి చదువుకునే వాళ్లం. పొద్దున్నే అమ్మాయిలు, అబ్బాయిలు అంతా ఒక ఇరవైమంది మా ఊరి నుంచి వెళ్లే ఒకే ఒక బస్సులో వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవాళ్ళం.
మా గుంపులో సామ్రాజ్యం మాకన్నా ఒకటి రెండేళ్లు పెద్దది. తను పదో తరగతిలో ఉండేది. తన చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో వాళ్ల అమ్మ పొలం పనులు చేసుకుంటూ సామ్రాజ్యాన్ని, వాళ్ల అక్కని పెంచేది.
మా బస్సు కండక్టర్ వలి అని ఒక పాతికేళ్ళ కుర్రాడు ఉండేవాడు. మా సామ్రాజ్యం వలీతో ప్రేమలో పడింది. వాళ్లిద్దరూ బస్సులో కళ్ళతో మాట్లాడుకోవడం మేమంతా గమనించేవాళ్ళం. ఇంతలో దసరా సెలవలు వచ్చాయి.
అందరం ఇండ్లలో సరదాగా గడుపుతున్నాం. ఒకరోజు సామ్రాజ్యం మా ఇంటి ముందున్న తపాలా కార్యాలయంలో కవరు కొనుక్కొని వెళ్లడం నా కంట పడింది. ఆ రోజుల్లో కార్డు కొనేవాళ్లు తప్ప కవర్లు కొనేవాళ్లు తక్కువ. ఎవరైనా కవర్ కొన్నారంటే ఏదో రహస్యం నడిపిస్తున్నారనే అర్థం.
సామ్రాజ్యం కవరు కొన్న విషయం మా అక్కకి చేరవేశాను. ఇక ఇద్దరం తను ఆ కవరు తపాలా డబ్బాలో ఎప్పుడు వేస్తుందా అని వంతులవారీ ఎదురు చూశాం. రెండోరోజు పరికిణీ మాటున దాచిన కవరు డబ్బాలో వేస్తున్న సామ్రాజ్యం కంటపడింది.
అప్పటి నుంచీ మొదలైంది నా ఆరాటం. రాత్రి అందరూ పడుకున్నాక విశ్వ ప్రయత్నాలతో డబ్బాలోంచి ఉత్తరం బయటికి తీశాం. కవరు చింపి రహస్యంగా చదివాము కానీ నవ్వాపుకోవడం మా తరం కాలేదు. అందులో ఏముందంటే…
“వలి” అని పేరు పెట్టి సంభోదిస్తూ మొదలుపెట్టింది ఉత్తరాన్ని. మొన్న పండక్కి నువ్వు కొనిపెట్టిన నారింజ రంగు చీర మా అక్క బాగుందని అడిగింది. అమ్మ ఇచ్చేయమని బలవంతం చెయ్యడంతో అక్కకి ఇచ్చేశాను. మళ్ళీ ఇంకొకటి కొని పెడతావు కదా.
సినిమాకి తీసుకెళ్తానని మాట ఇచ్చావు. మాయదారి సెలవులు అప్పుడే మొదలయ్యాయి. సెలవులు అవ్వగానే తీసుకెళ్లి తీరాలి సుమా. పోయిన వారం మనం శంకర్విలాస్ లో తిన్న మసాలా దోశ తలుచుకుంటే ఇంకా తినాలి అనిపిస్తోంది.
సెలవుల నుంచి వచ్చిన రోజే నువ్వు నాకు అది తినిపించాలి. మొన్న మా చిన్నతాత దినవారాలకి మా పిన్ని వచ్చింది. వస్తూ వాయిదాల్లో రెండు చీరలు తెచ్చింది. వాటికి సరిపడే జాకెట్లు కొంటావు కదా…
అడగడం మరిచిపోయాను మొన్న మీ అక్కా అని చూపించావు చూడు ఆమె జుంకాలు భలే ఉన్నాయి. ఎన్ని గ్రాములు ఉంటాయి? సెలవులు అవ్వగానే కలుసుకుందాం.
అమ్మ పొలం నుంచి వచ్చే సమయం అయింది. నేను వుంటాను మరి… ఇట్లు నువ్వు   ముద్దుగా పిలిచే సాంబులు…
ఎక్కడా  ప్రేమకు సంబంధం లేని ఈ వింత ప్రేమ లేఖ చదివి పగలబడి నవ్వుకున్నాం.  గుట్టుచప్పుడు కాకుండా తిరిగి అతికించి డబ్బాలో పడేశాం.
సామ్రాజ్యం ప్రేమ విషయం వాళ్ల అమ్మకు తెలియజేయాలని మేమిద్దరం సంస్కర్తలలా ఆరాట పడుతుండగా కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు  ఆమెకి ఆ విషయం ఎలాగోలా తెలిసిపోవడం వేసవి సెలవుల్లో సామ్రాజ్యానికి వేరే అతనితో పెళ్లి జరిగిపోవడం కొసమెరుపు….
ఇదండీ మా సామ్రాజ్యం వింత ప్రేమలేఖ.
– రవి పీసపాటి

Related Posts

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress