సమీర

సమీర

“నాన్నా మీకెందుకు అర్ధం కావడంలేదో నాకు తెలీడంలేదు. ఆ అమ్మాయి మనసు మంచిది, మనిషి మంచిది తనతో జీవితం బావుంటుంది. పైగా మేమిద్దరం ఈ దేశంలోనే వుండము, మీకు ఇబ్బంది అనుకుంటే మళ్ళీ ఈ ఊర్లో కనిపించం. ప్లీజ్! మీ కాళ్ళు పట్టుకుంటా, ఒప్పుకోండి.”

అప్పటికి నాలుగు గంటల నుంచీ నడుస్తుంది నాన్నతో వాగ్వాదం. కష్టాల్లో వుంటే రాళ్ళేసే వాళ్ళే కానీ సాయం చేసే ఒక్కడూ లేని బంధువుల గురించి అమ్మా నాన్నా ఎందుకు ఇంత వర్రీ అవుతున్నారో నాకు ఎంత చించుకున్నా అర్ధం కావడం లేదు.

కనీసం అమ్మైనా సపోర్ట్ చేస్తుందేమో అనుకుంటే అదీ లేదు. ఎన్ని చేసినా వెనకేసుకొని వచ్చే అమ్మ కూడా ఎదురు తిరిగే సరికి ఏం చేయాలో తెలీని అయోమయం.

ఒప్పుకుంటే సరేసరి లేదంటే కామ్ గా మన పని మనం చేసుకోవడమే. కొన్నేళ్ల తరువాత వాళ్ళే మెత్త బడతారు అన్న రాజీవ్ గాడి ఫార్ములానే బెటర్ ఏమో.

వాడు సూచన ప్రాయంగా ఇంట్లో చెప్పాడు. ససేమీరా అనగానే అలాగే నాన్నగారూ అంటూ కామ్ గా వెళ్ళిపోయాడు. స్టేట్స్ లోనే పెళ్లి చేసేసుకుని ఫోటో పంపించాడు.

వీళ్ళు ఒక ఏడుపు ఏడ్చి, వాడికి పిండం పెట్టేసి తర్పణం వదిలేసి వూరుకున్నారు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు నెమ్మదిగా మాటలు మొదలయ్యాయి, కలవడమే తరువాయి.

“నువ్వెన్ని చెప్పినా అదైతే జరగని పని, మాంచి సంబంధం చూస్తా. లేదా మనవాళ్లలోనే నీకు ఎవరైనా నచ్చితే చెప్పు, కట్నం ఎంత లాంఛనాలు ఏమిటి అనేవి కూడా అడక్కుండా పెళ్లి చేసేస్తా.”

“నేను మనసిచ్చిన వ్యక్తి, నన్ను అర్ధం చేసుకున్న మనిషి వుండగా ఇంకో అమ్మాయిని ఊహించుకోను కూడా లేను. అమ్మా నువ్వైనా అర్ధం చేసుకో.”

“ఇవన్నీ వయసులో వచ్చే ఆకర్షణలేరా నాన్నా.. ఇప్పుడు మేమేం చెప్పినా చేదుగానే వుంటుంది. తర్వాత జీవితంలో అప్పుడు అమ్మా నాన్నల మాట వింటే బావుండు అనుకున్నా లాభం లేదు. నాన్నగారు ఎందుకు చెప్తున్నారో అర్ధం చేసుకో!”

మిగతా అన్ని విషయాల్లో ఎంతో ఆదర్శంగా అభ్యుదయ భావాలతో వుండే అమ్మ కూడా ఎందుకు ఇలా మాట్లాడుతుంది? కులాలు, మతాలు మనం సృష్టించుకున్నవే, వీటికన్నా మానవ జన్మ గొప్పది అని చెప్పే అమ్మకి ఏమైంది?

కష్టమైనా నష్టమైనా ఇది నా నిర్ణయం, దానికి పూర్తి బాధ్యత నాదే కదా? ఇంకొకరిని ఎందుకు నిందిస్తాను? ఈ చిన్న విషయం ఎందుకు అర్ధం చేసుకోడానికి ప్రయతించదు?

ఇక వాదించి ఒప్పించడం అనేది జరగని పని. It is waste of time to argue when reason doesn’t work. ఇంకేం మాట్లాడకుండా రూమ్ లోకి వెళ్ళిపోయా.

సమీరకి ఫోన్ చేశా!

“హలో సమీ, భయపడినట్టే అయింది. అమ్మా నాన్నలే హఠాత్తుగా పరాయి వాళ్ళలా మాట్లాడుతున్నారు. ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా వినడం లేదు.”

“నువ్వేం బాధపడకు, ఇది expect చేసిందేగా? నెమ్మదిగా ఒప్పించొచ్చులే!”

“Yeah, no point in worrying మా రాజీవ్ గాడి ఫార్ములానే బెస్ట్”

“హహ, Cheer up Baby! ఛలో, హైద్రాబాదులో కలుద్దాం. నువ్వుకూడా ముందే ట్రైనుకి రిజర్వు చేసుకుంటే సరిపోయేదిగా?”

“నిజమే, తత్కాల్ అయినా దొరుకుతుందిలే అనే Over Confidence, ఏం చేస్తాం?”

“లవ్ యు”

“లవ్ యు టూ, టేక్ కేర్. బై”

సమీర! కాలేజ్ లో నా జూనియర్. మనిషి బావుంటుంది, నవ్వు ఇంకా బావుంటుంది. సహజంగానే అందమైన అమ్మాయిల ను చూస్తె నాకు చాలా భయం వేస్తుంది. కాబట్టి నేను అమ్మాయిలతో మాట్లాడేవాడిని కాదు.

తర్వాత US లో వుండగా మళ్ళీ కనబడింది. కామన్ ఫ్రెండ్స్ వుండడం వల్ల తరచూ కలిసే వాళ్ళం. ఇతరులపట్ల తను చూపించే ఆప్యాయత, సానుభూతి, సహాయం చేసే గుణం నాకు చాలా ఇష్టం.

అందరితోనూ వున్నట్టే నాతోనూ వుంటుంది అనుకున్నానే గానీ వేరేలా ఎప్పుడూ అనుకోలేదు. నాకు తనంటే ఇష్టం వున్నా భయం చేత చెప్పలేదు.

మనకన్నా మన ఫ్రెండ్స్ ఇలాంటివి ముందే పసిగట్టేసి సంబంధాలు కలిపేస్తుంటారు. మొదట్లో వీళ్ళు ఇద్దరినీ కలిపేసి కామెంట్లు చేస్తుంటే తను ఏమనుకుంటుందో అనే భయం ఉండేది.

ఎప్పుడైతే తను వీళ్ళని వారించకపోగా సిగ్గు పడటం చూశానో నేనూ నెమ్మదిగా ప్రొసీడ్ అయిపోయా. తర్వాత ఒకసారి చెప్పింది, ‘నువ్వు ఎవరినీ జడ్జ్ చేయవు, ఎవరి గురించీ చెడ్డగా మాట్లాడవు. ఈ రెండూ నీలో బాగా ఇష్టం’ అని.

జీవితం కలిసి పంచుకోవాలి అని నిర్ణయించుకున్నాం. వాళ్ళ పేరెంట్స్ కి నేను తెలుసు, వాళ్ళు US వచ్చినప్పుడు పరిచయం అయ్యింది. ఇప్పుడు ఇంట్లో చెప్పింది, వాళ్ళకీ అభ్యంతరం లేదు. నా వైపు నుంచే సమస్య.

వారం గడిచింది. చుట్టాలనీ, స్నేహితులనీ కలిసి, గుళ్ళూ, గోపురాలు తిరిగేసరికీ తిరిగెళ్లే టైం వచ్చేసింది.

“హలో బేబీ ఆల్ ఒకే? ఫ్లైట్ టైం కి మూడు గంటల ముందే వచ్చేయ్. మళ్ళీ నాకు టెన్షన్ గా వుంటుంది.”

“ఠీక్ హై మేరీ మా .. బై!”

” సి యూ సూన్ డియర్”

**********

“వయసులో ఆకర్షణ అలానే వుంటుంది. ప్రేమకంటే చాలా బలమైనది ఈ ఆకర్షణ. నీకంటే పెద్దవాళ్ళం, అనుభవం వుంది. అన్నీ ఆలోచించే చెబుతున్నాం. అర్ధం చేసుకో, బాగుపడతావు”

“వదిలేయమ్మా, ఇక ఆ విషయం మాట్లాడడం నాకిష్టం లేదు”

“సరే, ఫ్లైట్ ఎక్కగానే ఫోన్ చేయి, లేట్ అవుతుందని ఆలోచించకు.”

“అలాగే నాన్నా, బై అమ్మా, జాగ్రత్త!”

“ఆరోగ్యం జాగ్రత్త నాన్నా! “

********

బస్సెక్కి నిద్రపోయా, ఫోన్ రింగవుతుంటే మెలుకువ వచ్చింది. సరిగ్గా వినబడడం లేదు, ప్రణవ్ గాడు..

“అరేయ్, ఏం వినబడడం లేదు, ఇంకో ఇరవై నిమిషాల్లో సిటీ వస్తుంది, నేను సిగ్నల్ దొరగ్గానే కాల్ చేస్తా సరేనా?”

“అదికాదురా.. హలో.. హలో..”

ఎదో తెలీని భయం అనిపించింది. ఎందుకు కంగారు పడుతున్నాడు? నాన్న బానే వున్నారుగా? సిగ్నల్ దొరికితే బావుణ్ణు. సిటీ వచ్చేస్తుంది. సిగ్నల్స్ దొరుకుతున్నాయి.

“రేయ్ ప్రణవ్! మామా, వచ్చేసిందిరా, ఇంకో 10 నిమిషాల్లో సిటీలో వుంటా, మన ఎదవలతో లంచ్ అయ్యాక ఎయిర్ పోర్టుకి వెళ్లడమే. ఏంటో చెప్పు?”

“అదికాదురా, రాత్రి సమీర రైల్వే స్టేషన్ కి వస్తుండగా దార్లో ఆక్సిడెంట్ అయ్యిందట”

“ఏంటీ…?”

“హాస్పటల్ కి వెళ్లే సరికే లేట్ అయిపోయిందంట..”

“రేయ్, ఏం అంటున్నావురా? అసలేం చెప్తున్నావో తెలుస్తుందా?”

స్థబ్దత, ఏం జరుగుతుందో, నేను ఎక్కడ వున్నానో, ఏం చేస్తున్నానో అర్ధం కావడం లేదు. కాదు, ఆలోచన కూడా రావడం లేదు. సమీ లేదా? నాకు ఏడుపు కూడా రావడం లేదు.

గొంతు ఎండుకుపోతుంది, నీళ్లు తాగాలన్నది కూడా అర్ధం కావడం లేదు. ప్రణవ్ ఫోన్ చేస్తూనే వున్నాడు. నేనేం చేయాలో చెప్తూనే వున్నాడు. మళ్ళీ మావూరి బస్సు ఎక్కాను.

ప్రణవ్, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు.

“సమీర వాళ్ళింటికి పోనీ..”

ఇంకా ఏదో చెప్తున్నారు, వినబడడం లేదు. కళ్ళనుండి నీరు ఆగకుండా కారుతూనే వుంది. అంతా మసక మసకగా వుంది. సమీ వాళ్ళింటికి కొంచెం దూరంలో కారు దిగి నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లాం. బయట ఒక ఐదారుగురు కూర్చుని వున్నారు. ఎవరో బాడీ లోపల వుంది అన్నారు.

సమీ గది మధ్యలో బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతుంది. హమ్మయ్య ఏం కాలేదు అన్న చిన్న సంతోషం. ఇంతలో వాళ్ళ అమ్మ గారు నన్ను చూసి పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు.

మళ్ళీ రియాలిటీలోకి వచ్చా. గుండెని ఎవరో చేత్తో పట్టి పిసికేస్తున్నట్టు అనిపిస్తుంది. హఠాత్తుగా కళ్ళు బైర్లు కమ్మాయి, ఏం జరిగిందో తెలీదు, నా మొహం నేలను గుద్దుకున్న శబ్దం మాత్రం వినిపించింది.

కళ్ళు తెరిచే సరికి విపరీతమైన తలనెప్పి, హాస్పిటల్లో వున్నట్టు అర్ధమైంది. పక్కన అమ్మ ఏడుస్తూ కనబడింది. నాన్న కొంచెం దూరంగా డాక్టర్ తో మాట్లాడుతున్నారు.

ప్రణవ్ నన్ను చూసి దగ్గరకి వచ్చాడు. హిట్ అండ్ రన్ కేసు, వాడిని పోలీసులు పట్టుకున్నారు. తాగి నడుపుతున్నాడంట. నేను హాస్పిటల్లో చేరి రెండో రోజు, అంత్యక్రియలు అప్పటికే అయిపోయాయి.

సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారు. ఎస్కేపిజం అనుకుంటా రాత్రీ పగలూ నిద్రపోతున్నా. మెలుకువ వస్తే ఊపిరాడనంత బాధ. డాక్టర్ ఇంటికొచ్చి చూస్తున్నారు.

నిద్ర మాత్రలు కూడా ఇస్తున్నారనుకుంటా. దాదాపు ఓ ఇరవై రోజుల తరువాత ఇంక తిరిగి US వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. డాక్టర్ కూడా పనిలో పడితే బాధ తగ్గుతుంది అని నాన్నకి సలహా ఇచ్చారు.

బాధ తగ్గడానికి మర్చిపోతేగా? యాంత్రికంగా నడుస్తుంది, భవిష్యత్తు మీద ఆలోచనా ఆశా రెండూ లేవు. ఇరవై నాలుగు గంటలూ రాజీవ్ ఇంకా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు తోడుగా వుంటున్నారు.

ఆల్మోస్ట్ రోజూ ఆమ్మో, ప్రణవో మాట్లాడుతూనే వున్నారు. ఒకట్రెండు సార్లు సమీ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడా. వాళ్ళు కోలుకుంటున్నారు. ఇలా వుండగా ఒక రోజు ప్రణవ్ ఫోన్ చేశాడు.

“మామా, మీ నాన్నని పోలీసులు తీసుకెళ్లారురా!”

“ఏం మాట్లాడుతున్నవురా? ఏమైంది, నాన్న ఏం చేశారు?”

“సమీరది ఆక్సిడెంట్ కాదు హత్య చేయించారు అంటున్నారు.”

“What? అసలేం జరుగుతుందో కనుక్కోరా? పోలీస్ నెంబర్ తీసుకో, నేను మాట్లాడతా..”

మా ప్రేమ విషయం తెలిసి నాన్న స్నేహితులు ఎవరో వేరెవరితోనో చేయించారు అనేది పోలీసుల అభియోగం. కేసు నిలబడడం కష్టం అంటున్నారు.

సమీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేశా. నా గురించి మా నాన్న గురించి ఏమనుకుంటున్నారనే దానికంటే అయన ఎలా వున్నారో అన్న ఆలోచనే వుంది నాకు.

“అంకుల్, అసలు ఏం జరుగుతుంది?”

“చంపేశారు గదరా. నువ్ మంచోడివి, నీతో జీవితం బావుంటుంది అని నమ్మిన పాపానికి నా చిట్టితల్లిని పొట్టన పెట్టుకున్నారు”

“అలా అనకండి, ఎక్కడో ఏదో పొరపాటు అయ్యింది. నిజం తెలియాలి.”

“నీకు నిజంగా తెలియదనే అనుకుంటున్నా, ఒకవేళ తెలిసే జరిగితే నీ అంత దుర్మార్గుడు, నయవంచకుడు ఇంకొకడుండడు. మీరు చంపింది నా తల్లినే కాదు, మా కుటుంబాన్ని, గుర్తుపెట్టుకో. ఏదేమైనా ఇంకెప్పుడూ ఫోన్ చేయకు.”

బెయిల్ ఇచ్చారు, నాన్న ఇంటికొచ్చేశారు. రోజూ ఫోన్ చేస్తున్నా నాన్నతో మాట్లాడాలని. దొరకడం లేదు. అమ్మ ఏడుస్తుంది తప్పితే ఏమీ మాట్లాడడం లేదు. ఐదు రోజుల తరువాత నాన్న దొరికారు.

“ఏమైంది నాన్నా? ఏంటిది? అసలు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు?”

“ఇవేవీ కోర్టులో నిలబడవు, నువ్వేం వర్రీ కాకు. ఆరోగ్యం జాగ్రత్త”

“నేనడిగేది అసలేం జరిగిందని..”

“ఇప్పుడు నేనేం చెప్పినా నీకెక్కదు. ఎప్పుడూ నీ మంచే ఆలోచిస్తాం అన్నది గుర్తుపెట్టుకో!”

ఇంకో మాట మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండాఫోన్ కట్ చేశారు.

అప్పటిదాకా ఎంతో నమ్మకంగా వున్నా, దీనికీ నాన్నకీ ఏం సంబంధం వుండదు ఎక్కడో పొరపాటు జరిగింది అని. ఆయన మీద కోపం రావట్లేదు.

టీవీ సీరియల్లో సెంటిమెంటు సీను వస్తేనే కళ్ళమ్మట నీళ్లు పెట్టుకునే నాన్న ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టారు? నిజంగానే ఇదంతా పరువుకోసమే చేశారా?

ఎవరినీ లెక్కచేయని నాన్న బంధువుల్లో చిన్నతనం అని ఇలా చేసే ఛాన్స్ లేదు. లేక, possessiveness)వల్లనా? కొడుకు తన చేయి దాటిపోతున్నాడు, చెప్పకుండా పెళ్లి చేసేసుకుంటాడేమో అనే వూహ భరించలేక ప్రాణం తీయడానికి కూడా వెనుకాడలేదా?

జరిగింది ఏదైనా ఆరోజు చనిపోయింది ఒక్కరు కాదు, ఇద్దరు. ఈరోజు ఒక శవం రెండోసారి చచ్చిపోయింది. అంతే, పెద్ద తేడా లేదు.

నా సమీరని చేజేతులా నేనే చంపేసుకున్నాను. నాకు ఆమాత్రం తెలివి వుండాలి, ఇంట్లో ఇంత దారుణానికి వెనుకాడరనే స్పృహ వుండాలి.

నేనంటూ తన జీవితంలోకి రాకపోయుంటే ఎక్కడో సంతోషంగా బ్రతికుండేది. ఒప్పుకోవడం లేదు అని అర్ధమయ్యాక అయినా తనతో తెగతెంపులు చేసుకుని ఇంట్లోనూ ఇక ఆమెను మర్చిపోతాను అని నమ్మేట్టు చెప్పాల్సింది.

కనీసం నాన్నకి రాజీవ్ లాగా నేనూ చేయను అనే భరోసా కలిగించి వుండాల్సింది. ఇలా చేసుండాల్సింది, అలా అవ్వాల్సింది అనుకోని క్షణం లేదు.

ఎంత అనుకున్నా జరిగింది మార్చలేము అన్న విషయం గుండెకి అర్ధం కావడం లేదు. తనమీద ప్రేమ కంటే, తనని చంపేశాననే బాధే ఎక్కువైంది.

ఒక అభం శుభం తెలీని అమ్మాయికి, తన కుటుంబానికి మేము చేసిన అన్యాయానికి నాకు నేను వేసుకుంటున్న శిక్ష ఇది.

ప్రాణంగా పెంచుకున్న కూతురు దూరమై సమీ కుటుంబం పడే బాధ, నా కుటుంబానికీ అర్ధం కావాలి. ఇది ఆవేశంతో తీసుకుంటున్న నిర్ణయం కాదు. బాగా అలోచించి చేసుకుంటున్న ప్రాయశ్చిత్తం.

చావు తర్వాత వేరే ఏమైనా వుంటే అక్కడ నా సమీని కలిసి తన పాదాలు పట్టుకుని క్షమించమని అడగాలి.

— సెలవ్ —

అనామకుడు

by,

– శ్రీకాంత్

@sree_n_r

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress