సంప్రదాయం

సంప్రదాయం

అదిగో చూసావా ఎలా పోతుందో ! చూడే, చూడు, అంటూ కూతుర్ని పిలిచింది అనిత. అబ్బా ఏంటే నీ గోల ఎవరు వెళ్ళేది అంటూ బయటకు వచ్చి చూసింది స్మిత. మాధవి జీన్స్, టీ షర్ట్ లో వెళ్తూ కనిపించింది స్మితకు. దాంతో తల్లి స్మితతో చూడే, ఆ మాధవి జీన్స్ టీ షర్ట్ వేసుకుని ఎలా వెళ్తుందో అనగానే, అవును పోతుంది అయితే ఏమైంది ఇప్పుడు? ఆమె ఆఫీస్ లో వర్క్ చేస్తుంది కాబట్టి ఆఫీస్ కు వెళ్తుంది.

అందులో తప్పేం ఉందమ్మా? ఆమె బ్రతకాలి కాబట్టి పని చేసుకోవడానికి వెళ్తుంది అని అంది స్మిత తల్లితో. అది కాదే మొగుడు చచ్చినా ఎలా తయారవుతుంది చూడు, ఎలా బయట తిరుగుతుందో చూడు అంటున్నా…. అయినా ఇదేం పోయే కాలం? ఏదో ఇంట్లో పడి ఉండక టింగు రంగ అంటూ బయటకు వెళ్లి ఆ జీన్స్, టీషర్ట్ తో నలుగురిలోకి వెళ్ళి పని చేస్తుందా? హవ్వ ఛీ,ఛీ రామ,రామ ఇది మాకు తెలియదు తల్లి.

మా కాలంలో అయితే, మొగుడు చావగానే బొట్టు, పువ్వులు, గాజులు అన్ని తీసేసి, ఓ మూలన పడి ఉండేవాళ్ళం.  నలుగురికి కనిపించే వాళ్ళం కాదు. ఎవరూ లేవక ముందే మా పనులన్నీ చేసుకుని ఓ మూలన ఉండేవాళ్లు. అమ్మో అప్పుడు ఇలాంటివి చేస్తే బ్రతకనిచ్చేవారా ఏమిటి అంటూ బుగ్గలు నొక్కుకుంది అనిత.

అమ్మా అబ్బా ప్లీజ్ అలా మాట్లాడకు జనరేషన్, కాలం మారింది. అప్పటిలా ఇప్పుడు చేయాలి అంటే కుదరదు. అప్పుడు ఆచారాలు, సంప్రదాయాలు అంటూ ఆడవాళ్ళను అణిచి వేశారు. కానీ, ఇప్పుడు ఆడవాళ్ళు అన్నిట్లో సమానం అయ్యారు. అప్పటిలా ఆమె ఇప్పుడు కూడా మూలకు కూర్చుంటే, ఆమె పిల్లలకు తిండి ఎవరు పెడతారు? నువ్వు పెడతావా? అంటూ తల్లిని ప్రశ్నించింది స్మిత.

ఇది బాగానే ఉంది నేనెందుకు పెడతాను? అంది అనిత. అవును పెట్టవు కదా మరి ఆమె పిల్లల కోసం భర్త చనిపోయిన బాధ గుండెల్లో దాచుకుని తన పిల్లల కోసం డబ్బు సంపాదించాలి అని బయట పనికి వెళ్తుంది. ఆమె చేసుకోక పొతే ఎవరూ పెట్టరు చూసావు కదా! వచ్చిన చుట్టాలు అందరూ తినేసి, తిట్టేసి వెళ్లారు పాపం ఆమె తెల్లారితే భర్త చావుకు వారి తిండికి చేసిన అప్పులు కట్టుకోవాలి. అలాగే భర్త చేసిన అప్పులు కూడా కట్టుకోవాలి కదా, మరి వాటికి డబ్బులు ఎవరు ఇస్తారు? ఇన్ని రోజులు భర్త చాటు భార్యగా బ్రతికినా ఆమెను ఎవరూ ఏమి అనలేదు.

భర్త అప్పులు చేస్తే మొగుడికి ఆ మాత్రం చెప్పుకోలేదు అని అలా మాట్లాడితే ఇప్పుడు ఆమె తన బాధ్యతలను మోయడానికి బయటకు వెళ్తుంది అనే వాళ్లు ఎవరు ఆమె బాధ్యతలు బాధలు పంచుకొరు కదా అంది తల్లికి సర్ది చెప్తూ… దానికి అనిత అవును నిజమే కానీ, మరి చీర కట్టుకుని వెళ్తే కాదా అందరికీ మాటలు అనడానికి అవకాశం ఇచ్చినట్టు ఆలా జీన్స్ వేసుకుని వెళ్లడం ఎందుకు అంటూ అనుమానం వ్యక్తం చేసింది తల్లి.

అమ్మా ఆమె చేసేది బ్యాంక్ లో రిసెప్షనిస్ట్ కాబట్టి అలా ఆకర్షణీయంగా కనబడాలి ఆమె చీర కట్టుకుని వెళ్ళినా వాళ్ళు మంచిగా రెడీ అయ్యి రమ్మని అంటారు. ఈరోజుల్లో అందరికీ అలా ఆకర్షణీయంగా కనబడితనే జీతాలు పెరుగుతాయి. వాళ్లకు కస్టమర్లు కూడా పెరుగుతారు. అందుకే మోడల్స్ తో ప్రకటనలు చేయించడం చూడడం లేదా అందుకే తను అలా రెడీ అయ్యి వెళ్తుంది అంటూ వివరంగా చెప్పింది స్మిత.

Page 2 | Royalty-free indian photos free download | Pxfuel

అవును నువ్వు ఆమె పిల్లల బాధ్యత గురించి చెప్పవు బాగానే ఉంది. కానీ, మొన్న బతుకమ్మ పండగ రోజు పువ్వులు, గాజులు, బొట్టు పెట్టుకుని బతకమ్మ ఆడడానికి వచ్చింది. మరి దానికేం అంటావు? అలా సంప్రదాయాన్ని కాదని కాల రాసి ఇది పట్నం కాబట్టి ఎవరూ చూడరు, ఎవరూ ఏమి అనరు అనుకుంటే పొరపాటే! ఆరోజు ఆమెని అందరూ చూసినా చూపు అబ్బో నాకు అయితే సిగ్గు వేసింది. మళ్లీ ఎవరో చెప్తే వెళ్లినట్లు ఉంది అంది అనిత.

అమ్మా నిజమేనా నువ్వు అనేది అంది స్మిత. అయ్యో! నాకేం కోపమే తల్లి ఆమె మీద నిజమే చెప్పాను అంది అనిత. అయితే ఇది తప్పు అని అనాలి ఎందుకంటే సంప్రదాయాన్ని ఎవరూ కాదు అనలేరు. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి అమ్మా అంటూ ఆగింది స్మిత.

ఏంటే ఆలోచించేది? దాని చీర, పువ్వులు, గాజులు, చూసి ఎంత చిరాకు వచ్చిందో అన్నది అధ్యంగ మొహం పెట్టి స్మిత తల్లి అనిత. అమ్మా గాజులు, పువ్వులు, బొట్టు, చిన్నప్పుడు తల్లి పెడుతుంది. భర్త కేవలం తాళి, మెట్టెలు ఒకటే కట్టి పెడతాడు అంతే, అందుకే పెట్టుకుందేమో.!

పైగా తన వయస్సు చిన్నదే కాబట్టి, తనకు తెలియకుండా రెడీ అయ్యిందో ఏమో ఆమె నాకంటే పెద్దది అయినా తెలియక పోవచ్చు అందుకే రెడీ అయ్యిందేమో అన్నది కడుపు పట్టుకుని లేస్తూ…

నువ్వు ఎంత చెప్పినా సంప్రదాయాన్ని ఎవరు కాదు అనలేరు. ఎవరూ దాన్ని తోసి పుచ్చలేరు. మనం సంప్రదాయాన్ని కాపాడితే మన పిల్లలకు, పిల్లలు కూడా మనల్ని గౌరవిస్తారు. బయటకు రెడీ అయినంత మాత్రాన మీ మనసులకు తెలియదా అదొక్కటి చాలు మనసులో వేధిస్తూనే ఉంటుంది

అలాగే బాధ్యత కోసం రెఢీ అయ్యి వెళ్తుంది అంటున్నావు, ఇక వేరే పనులే ఉండవా? వేసుకునే బట్టలది ఏమి ఉండదు అంతా మన శక్తి మీద ఆధార పడి ఉంటుంది. సరే నీ మాటల్ని నేను ఖండించలేను అలాగని సమర్థించే స్థితిలో లేను. బట్టలు ఇలా కట్టుకోబట్టే దారుణాలు జరుగుతూ ఉన్నాయి. హు ఆధునికత పేరుతో కొత్త ప్రయోగం చేస్తూ బ్రష్టు పట్టిస్తున్నారు మా కాలంలో ఇవ్వన్నీ లేవు అమ్మా..

కానీ నువ్వు పురుటికి ఇక్కడికి వచ్చావు ఆమె మొహం మాత్రం చూడకు, ఆమెకు ఎదురుగా వెళ్ళకు నీ మొగుడుకు నిన్ను జాగ్రత్తగా అప్పగించాలి.

సర్లే, పద, పద, వెంట్రుకలు ఆరబెట్టుకుంధి చాలు. ముడేసుకో. అలా విప్పుకుని కూర్చోకూడదు అంటూ కూతుర్ని తీసుకుని లోపలికి వెళ్ళింది అనిత..

సంప్రదాయాన్ని గౌరవిద్దాం.. భావి తరాలకు ఆదర్శంగా నిలుద్దాం.

                                     అనిత మాటల్లో నిజం ఎంత? మీ అభిప్రాయం తెలుపండి…

                                                                                                                                        -రాజు

Related Posts