సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళింట్లో పండగ నెల రోజుల ముందు ఉంది అనగానే బియ్యం ఆరబోసి, ఇసురాల్లతో కాస్త పచ్చి ఆరక ముందే వాటిని ఇసిరి పిండి చేసేవారు. దానికోసం ఒకరింటికి ఒకరు సహాయంగా వెళ్ళేవారు.

అలా వాడకట్టులో అందరికీ సాయం చేశాక పిండిని ఆరబెట్టి ముందుగా ఆరబెట్టిన వారింటికి పక్కింటి వాళ్ళు సహాయానికి వచ్చేవారు. ఇదంతా ఎందుకంటే సకినాలు చేయడానికి… మరి అవే పెద్ద వంటకాలు ఆ రోజుల్లో ఒక్కొక్కరు పది కిలోల వరకు చేసుకునేవారు.

అప్పట్లో అడ్డెడు, మానేడు అనే కొలతలు ఉండేవి. అలా కాల్చుకుని పిండి తడిపి, అందర్నీ పిలిచేవారు. తాతయ్య వాడని ధోతి ఒకటి నీటిలో తడిపి ఈత చాపపై పరిచి ముందుగా మా నాన్నమ్మ బొట్టు పెట్టుకుని అందరికీ బొట్టు, పసుపు ఇచ్చి గౌరమ్మను చేసేది పిండితో దానికి పసుపు, కుంకుమ పెట్టి పూజించి ముందుగా దాని చుట్టూ అయిదు సకినాలు పోసేది.

ఆ తర్వాత మిగిలిన వారందరూ సకినాలు పోసేవారు. పిండి సాయంత్రం వరకు అయిపోవాలి ఈ లోపున మళ్ళీ వంట కూడా చేయాలి అందుకోసం మబ్బున లేచి, వంట చేసి, ముందు బెల్కట్లు అనే ఒక గదిలో ఉంచి మీరే పెట్టుకుని తినండి అంటూ మగవాళ్ళకి, పిల్లలకి చెప్పేది. ఇక సాయమాల్లో ఉన్న ఆడవాళ్లందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ సకినాలు పోసేవారు మా నానమ్మ మూకుడు దగ్గర కూర్చొని ఒక్కొక్కటిగా కాల్చేది. అప్పల పుల్ల అని ఒకటి ఉండేది దాంతో అన్ని కాలిన తర్వాత ఒకేసారి తీస్తూ జల్లెడలో వేసేది. జల్లడానిస్తే ఇంకో జల్లెడ కాదు. ఈత ఆకులతో అల్లిన బుట్ట.

ఆ బుట్ట కింద ఒక పెద్ద తాంబానం పెట్టి అందులో వేసేవారు ఒకవేళ నూనె ఏమైనా ఉంటే ఆ తంబానంలో పడేది. అవన్నీ అయ్యేసరికి రాత్రి 9, 10, 11 కూడా అయ్యేది. మధ్యలో తినడానికి కాసేపు విరామం ఇచ్చేవారు అందరూ తిని వచ్చి మళ్లీ మొదలు పెట్టేవారు ఆ తర్వాత రోజు అప్పాలు. అప్పాలు కూడా ఒక డ్రమ్ములో నిండేలా చేసేవారు ఆ తర్వాత మురుకులు ఇవన్నీ ఒకరి ఇంట్లో మొత్తం అయిపోయిన తర్వాత ఇంకొకరి ఇంటికి సాయం వెళ్లేవారు. 

ఇలా నెలరోజుల ముందు నుంచి అన్నీ అందరూ చేసుకుని పండుగ రోజు ఏం లేకుండా ఏ పని లేకుండా వచ్చిన అల్లుళ్ళకు, కూతుర్లకు మర్యాదలు చేస్తూ వాళ్ళు అడిగినవి చేసి పెడుతూ ఉండేవాళ్ళు. కొన్ని రోజుల వరకు అవే పొద్దునా, సాయంత్రం అల్పాహారంగా తినేవాళ్లు. ఇక పండగ రోజు నువ్వు అయిపోయిన తర్వాత కూతుర్లు వెళ్లే సమయంలో కూతుర్లకి అప్పాలు, సకినాలు, మురుకులు, చేగోళ్ళు అని అవన్నీ కట్టించేవారు.ఎందుకంటే వాళ్ళు చేసుకోలేరు కాబట్టి.

అలాగే భోగి రోజు ఉదయమే అందరూ మూడు గంటలకే లేచి తలస్నానాలు చేసి భోగిమంటలు వేసి పిడకల దండలు వేసి భోగి చుట్టూ తిరుగుతూ పాటలు పాడేవారు. తెల్లారి సంక్రాంతి పండుగ నాడు అన్ని రకాల పిండి వంటలు చేసుకుని అందరూ ఒకేసారి బంతిలా కూర్చొని తిని ముచ్చట్లు పెట్టుకుంటూ సంతోషంగా, ఉల్లాసంగా గడిపేవారు.

ఆ తర్వాతి రోజు కనుమ పండగ. ఆరోజు పొలం దగ్గరికి వెళ్లి పొలం దగ్గరే వంట చేసుకుని పొలంలో తిని అక్కడే సాయంత్రం వరకు గడిపి వచ్చేవారు. ఆ తర్వాత రోజు ముక్కనుమ కనుమ. ముక్కనుమ రోజు ఎవ్వరినీ ప్రయాణాలు చేయనిచ్చేవారు కాదు. మాంసాహారం తినేవారు. అల్లుళ్ళకి ఊరికి కోళ్లను కోసి విందు చేసేవారు. లేదంటే ఊరంతా కలిపి ఒక రెండు మూడు యాటలు కోసి కొన్ని కుప్పలుగా వేసేవారు అంతా పంచుకొని ఇళ్లలో వండుకొని తినేవారు.

ఇంకా గంగిరెద్దుల వాళ్లు వచ్చి ఎవరింటి గొప్పదనం గురించి వాళ్లు కీర్తన చేస్తూ ఉంటే అమ్మలు అక్కలు అందరూ హరిదాసు బుట్ట నింపేవారు గంగిరెద్దుల వాళ్ళు వస్తే కొత్త చీరలు కొని వారి కోసమే ప్రత్యేకంగా వేసేవారు ఇంటిల్లిపాది వాటి ఆశీర్వాదం తీసుకునేవారు ముందే వాళ్ళు వచ్చి చింత చెట్లు కింద గుడారాలు వేసుకొని ఉండేవారు.

ఆ రోజుల్లో సంక్రాంతి పండుగ అంటే అందరూ కలిసి సంతోషంగా గడపడం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఇల్లంతా సందడిగా ఉండేది ఇక ముగ్గుల గురించి అయితే చెప్పనవసరం లేదు రకరకాల ముగ్గులు వేస్తూ చివరి రోజు రథం ముగ్గు వేస్తూ ఒక ఇంటి నుంచి తాడు ఇంకో ఇంటి వరకు గీసి వాళ్లంతా ఇంకో ఇంటి వరకు గీస్తూ అలా ఊరంతా రధాన్ని లాగుతూ వెళ్లేవారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ ఉమ్మడి కుటుంబాలన్నీ మర్చిపోయి పిండి వంటలు చేసే ఓపిక లేక బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తింటూ సినిమాలు షికార్లు చేస్తూ సంతోషంగా ఉంటున్నామని భ్రమలో ఉంటున్నారు తప్ప నిజంగా సంతోషంగా ఎవరూ లేరు అనేది ముమ్మాటికి నిజం. అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.

– భవ్యచారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *