సప్తపది

సప్తపది

“అభీ…” బెడ్ పై అస్థిమితంగా కదులుతున్న అభినేత్రి తల్లి పిలుపు విని “ఊ ” అంది బద్దకంగా కళ్ళు తెరవకుండానే.

“ఏంట్రా.. రోజూ ఈపాటికే లేచి జాగింగ్ కు బయలుదేరిపోయే దానివి.. ఈరోజు ఇంకా నిద్ర మంచం దిగలేదేమిటిరా! ఒంట్లో గాని బాగుండలేదా ఏంటి?” అంటూ కూతురు దగ్గరికి వచ్చి కూర్చొని తలపై చేయి వేస్తూ ఆప్యాయంగా అడిగింది సుమిత్ర.

తల్లి స్పర్శ తగలగానే గుండెల్లో ఆవహించుకొని ఉన్న గుబులంతా పటాపంచలు అయినట్లుగా ఏదో ఆహ్లాదకరమైన అనుభూతి. వెంటనే పైకి లేచి ఒక్కసారిగా తల్లి ఒడిలో తల పెట్టుకుని నడుము చుట్టూ చేతులు పెనవేసింది అభినేత్రి.

కూతురి చర్యకు సుమిత్ర మాతృ హృదయం ఒక రకమైన పులకింతకు లోనైంది. అదే సమయంలో మనస్సులో ఏదో చిన్న కలవరం! కొద్ది రోజుల్లో తన ఈ అమూల్యమైన పెన్నిధి తనను వదిలిపెట్టి అత్తగారింటికి వెళ్ళబోతున్నదనేదే ఆ కలవరపాటుకి కారణమై కళ్ళు చిప్పిల్లేలా చేసింది.

కానీ అవి కూతురు కంట పడకుండా జాగ్రత్త పడుతూ “ఏంటి బంగారం.. పెళ్లి కుదిరిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను.. అదోలా ఉంటున్నావు.. నీ ముఖంలో మునుపటి ఉత్సాహం, నవ్వు అస్సలు కనిపించడమే లేదు.. ఎందుకురా అలా ?

ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా! అబ్బాయి నీకు నచ్చాడు అన్నావనే కదా ఈ సంబంధం ఖాయం చేశాం. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని నువ్విలా కళాకాంతి లేకుండా దిగాలుగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పు..? ఏమైందమ్మా నీ నిర్ణయం ఏమైనా మార్చుకున్నావా? ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం గానీ ఇష్టం లేదా.? ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు..! నచ్చకపోతే చెప్పు నాన్నగారితో మాట్లాడతాను..!” లాలనగా అంది సుమిత్ర.

మాట్లాడకుండా తల్లి నడుము చుట్టూ ఉన్న చేతుల్ని మరింత గట్టిగా బిగించింది అభినేత్రి. కూతురిలో చెలరేగుతున్న ఏవో భావ సంచలనాలను అర్థం చేసుకున్న దానిలా తలమీద ఆప్యాయంగా నిమురుతూ..

“చెప్పురా నువ్విలా మౌనంగా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది..?”

గొంతులో వీలైనంత మార్ధవాన్ని నింపుకొని మళ్లీ అడిగింది కూతుర్ని.

ఈసారి కూడా మాట్లాడలేదు అభినేత్రి. కాకపోతే గుండె లోతుల్లో ఘనీభవించి ఉన్న దుఃఖం ఒక్కసారిగా బద్దలైనట్లుగా తల్లిని గట్టిగా హత్తుకొని హృదయ విదారకంగా ఏడవడం మొదలు పెట్టింది అభినేత్రి.

ఒక్కసారిగా కంగారు పడింది సుమిత్ర. కూతురు వేదనకు కారణమేంటో ఎంత ఆలోచించినా తట్టడం లేదు. ఏమైంది నా చిట్టి తల్లికి! ఏనాడూ కంటతడి పెట్టనీయకుండా అపురూపంగా అరచేతుల్లో పెట్టుకొని పెంచుకున్న తన కూతురు అంత దీనంగా ఏడుస్తుండడంతో హృదయం కలచి వేసినట్లు అయింది సుమిత్రకి. ఏం చేయాలో, ఎలా ఓదార్చాలో తోచడం లేదు ఆమెకి.

కూతురు దుఃఖం ఉపశమించేదాకా ఓపిక వహించింది. కాసేపు అలాగే నిశ్శబ్దంగా తల నిమురుతూ ఉండిపోయింది.

కాసేపటికి తల్లి ఒడిలోంచి లేచిన అభినేత్రి మళ్లీ తల్లి గుండెలకు హత్తుకుపోతూ అంది వెక్కిళ్ల మధ్య..”అమ్మ నాకు ఈ పెళ్లి వద్దమ్మా..!”

ఒక్కసారి నిశ్చేష్ట అయిపోయింది సుమిత్ర. కూతురు అన్నదేమిటో కాసేపు అర్థం కాలేదు. అర్థమయ్యాక మెల్లగా తనను తాను సంబాలించుకుంది.

“కూతురి వీపు నిమురుతూ మృదువుగా అంది “పర్వాలేదు అమ్మా.. నీకు ఆ పెళ్లి ఇష్టం లేకపోతే అబ్బాయి వాళ్లకి వద్దని చెప్తాం లే.. ఆ అబ్బాయి కాకపోతే నీకు నచ్చిన మరో..”

“అది కాదమ్మా.. నాకు పెళ్లి అంటేనే ఇష్టం లేదు..!”

“అదేంటమ్మా ఎందుకలా అంటున్నావు.. నువ్వు పెళ్లికి ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నాకే కదా ముహూర్తాలు అనుకున్నది! మరి ఇప్పుడు ఏమైంది? పెళ్లి చేసుకోకపోతే ఎలా..?”

“పెళ్లి చేసుకుంటే నిన్ను, నాన్నని చెల్లాయిలని వదిలేసి వెళ్లాలి కదమ్మా! నేను మిమ్మల్ని వదిలి ఉండలేనమ్మా…! నాకు ఎప్పటికీ మీ దగ్గరే ఉండిపోవాలని ఉంది. ఎందుకమ్మా అమ్మాయి మాత్రమే పెళ్లి పేరుతో పుట్టిల్లు వదిలి అత్తారింటికి వెళ్లాలి..? ఆడపిల్లలకు మాత్రమే ఎందుకమ్మా ఇంత కష్టం..! పుట్టి పెరిగి ఆప్యాయత అనురాగాలను పంచుకున్న ఇంటిని వదిలేసి వెళ్లడం ఎంత కష్టమో నీకు మాత్రం తెలియదా..?”

కూతురు ఆవేదనకు కారణం ఏమిటో అర్థం అయ్యాక ఒక్కసారి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది సుమిత్ర. కాసేపటికి అభినేత్రి కళ్ళు వర్షించడం మానేసి ప్రశ్నించడం మొదలుపెట్టాయి. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ కట్టుబాట్ల లోని ఆంతర్యాన్ని ఎదిరించడం మొదలుపెట్టాయి.

“నాకు కూడా అబ్బాయిల్లాగా మీ దగ్గరే ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోవాలని ఉంది! ఆడపిల్లనైనంత మాత్రాన పుట్టుక నుంచి నా చుట్టూ అల్లుకొని ఉన్న బంధాలను ఒక్కసారిగా కాదనుకొని పరాయి ఇంట్లో బ్రతకాల్సిన దుస్థితి ఎందుకు..?” కంపిస్తున్న స్వరంలో ఆవేదన ప్రతిఫలిస్తుండగా అంది. కూతురి ఆవేదనకు కారణం పూర్తిగా అర్ధమైంది సుమిత్రకి. 

ఆమె గడ్డాన్ని పుణికి పుచ్చుకొని ప్రేమగా కళ్ళల్లోకి చూస్తూ “చూడు తల్లి! నీ సంఘర్షణ నాకు అర్థమైంది. పుట్టింటితో అనురాగ బంధాన్ని పెనవేసుకున్న ప్రతి ఆడపిల్ల పెళ్లి పేరుతో మరొక ఇంటికి ప్రయాణమయ్యే సమయంలో సహజంగా ఎదుర్కొనే సమస్యే ఇది.

అమ్మాయికి పుట్టిల్లు ఎప్పుడూ శాశ్వతం కాదు. సమాజం ఏర్పరచుకున్న కట్టుబాట్లలో భాగంగా ప్రతి ఆడపిల్ల ఒక వయసు రాగానే తన తోడును వెతుక్కొని మెట్టినింటిలో కాలు పెట్టాల్సిందే! అక్కడే ఆడపిల్ల తన భర్త, అత్తమామలు వాళ్ల కుటుంబంతో కూడిన బంధాలతో మమేకమై తనకంటూ ఒక శాశ్వతమైన, ప్రత్యేకమైన పరిపూర్ణతను సాధించుకుంటుంది. అత్తిల్లే తన లోకంగా తనను తాను పునర్ర్మించుకుంటుంది. మనసా, వాచా, కర్మణా తనను తాను అత్తింటికి అర్పించుకుంటుంది. అది ప్రతి ఆడపిల్లకు పుట్టుకతోనే అబ్బిన గొప్ప గుణం”

కొత్త విషయం ఏదో వింటున్నట్లుగా తల్లి కళ్ళల్లోకి తెరిపార చూసింది అది.

“కన్న తల్లిదండ్రులను వదలలేను అనుకున్న ఆడపిల్ల పెళ్లయ్యాక అత్తింటికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. అదే తన సర్వస్వంగా భావిస్తుంది. రేపు పెళ్లయ్యాక చూడు నువ్వు కూడా అంతే! మేము రమ్మన్నా నీ భర్తను వదిలి రానంటావు. నీకంటూ కొత్త బంధాలు, బాధ్యతలు ఏర్పడి మెల్లమెల్లగా అదే ప్రపంచంగా మారి పుట్టిల్లునే పరాయి ఇల్లుగా చూడడం మొదలు పెడతావు”

మౌనంగా వింటున్న కూతురు కళ్ళలోకి చూస్తూ ఆప్యాయంగా తల నిమురుతూ మళ్లీ

“ఒక్కసారిగా పెళ్లి పేరుతో అప్పటివరకు ఉన్న ఇంటిని, తల్లిదండ్రులను వదిలి కొత్త బంధంలోకి ప్రవేశించే క్రమంలో ప్రతి ఆడపిల్ల అనుభవించే అంతర్మధనమేనమ్మా నువ్వు ప్రస్తుతం ఎదుర్కొంటున్నది! ఈ స్థితిని కాస్త సంయమనం పాటించి అధిగమించావంటే ఇక ఈ పుట్టిల్లు, అమ్మానాన్న, చెల్లాయిలు గుర్తే రారు నీకు..!” నవ్వుతూ అంది సుమిత్ర.

తల్లి చెప్పేది శ్రద్ధగా వింటూ తీవ్రమైన ఆలోచనా సముద్రంలో లీనమైనట్లుగా కనిపిస్తున్న కూతురితో మళ్లీ అంది సుమిత్ర

“మన వివాహ వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఎందుకు నిలిచిందో తెలుసా?

ఆసక్తిగా చూసింది తల్లి వైపు.

“రెండు వేరు వేరు నేపథ్యాలు, వ్యక్తిత్వాలు గల ఇరువురు మనుషులను ఒక్కటిగా ‘సప్తపది’ పేరుతో ఏడడుగులు నడిపించడంతో మొదలయ్యి ఆజన్మాంతం ఒకరికొకరు తోడుగా, ఒకే ఆశగా, శ్వాసగా ఒకరిలో ఒకరు సగభాగంగా మమేకమయ్యేలా చేస్తుంది కాబట్టి. అందుకేనమ్మ! ప్రపంచ దేశాలకు గర్వకారణంగా నిలిచింది మన వివాహ వ్యవస్థ!”

తల్లి మాటలతో అప్పటివరకు తెలియని గొప్ప సత్యమేదో అవగతమైనట్లు, తనను వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభించినట్లు పెదవుల మీదికి సన్నని చిరునవ్వు వచ్చి చేరింది ఆ అమ్మాయికి. కాసేపలా కూతుర్ని మురిపంగా చూసుకున్న సుమిత్ర

“ఇప్పుడు చెప్పు మరి.! రేపు పెళ్లయ్యాక భర్త, పిల్లలు కుటుంబం ఇలా నీకంటూ ఒక అనుబంధాల ప్రపంచం ఏర్పడ్డాక అసలు ఈ అమ్మానాన్నలు గుర్తుంటారా నీకు?” మాటల్లో కొంటెతనం మేళవిస్తూ అంది సుమిత్ర.

“పో అమ్మా…. నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను.. నువ్వు, నాన్నగారు మీ తర్వాతే నాకు ఎవరైనా!”

సిగ్గు దొంతరలు అలుమకుంటూ ముఖం రాగరంజితం అవుతుండగా బుంగమూతి పెట్టి తల్లి వైపు అభిమానంగా చూస్తూ అంది అభినేత్రి. కూతురు ముఖంలో కనిపించిన తేటదనాన్ని చూసి నిశ్చింతగా, తృప్తిగా నిట్టూర్చింది సుమిత్ర.

“మరి ఇప్పుడు చెప్పు! నాన్నగారితో చెప్పమంటావా ఈ సంబంధం నీకు నచ్చలేదని!” ఆటపట్టిస్తున్నట్లుగా నవ్వుతూ అంది సుమిత్ర.

“అమ్మా..” గారంగా అంటూ మెడ చుట్టూ రెండు చేతులు పెనవేసి గట్టిగా హత్తుకుంది తల్లిని అభినేత్రి.

సమాప్తం

– మామిడాల శైలజ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress