సావిత్రే జీవించి ఉంటె ఎపిసోడ్ – 1

సావిత్రే జీవించి ఉంటె ఎపిసోడ్ – 1

గతం గత:

మహానటి సినిమా చూసే ఉంటారు కదా!. అందులో మనకు సావిత్రి ఎలా సినిమాల్లోకి వచ్చి, పెళ్ళైన వాడినే పెళ్లి చేసుకొని తిరిగి పతనం అవ్వడం, చివరకు మరణించడం వరకు చూపించి వదిలేసారు కదా!.

కాని ఆవిడ  మందు తాగి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా తిరిగి కోలుకొని ఉంటె, అదే సమయంలో ఆమె కూతురు చాముండేశ్వరికి పెళ్ళైనా కూడా భర్త అనుమతితోనే తన తల్లిని ఆదుకొని ఉండుంటే చాముండేశ్వరికి అంతో ఇంతో నాట్యంలో ప్రవేశం ఉండి, ఆ నాట్యాన్ని ఉపయోగించుకొని ప్రదర్శనలు ఇచ్చేసి, తన తల్లి అప్పులన్నీ తీర్చేసి ఆమెని మళ్ళి మనుషులలోకి తీసుకొచ్చి బాగు చేసి ఉంటె ఇప్పటికి సావిత్రి గారు బ్రతికి ఉంటె ఎలా ఉండేది?

ఏం జరిగేది?

ఒకవేళ చాముండేశ్వరి సహాయం చేసినట్లయితే వారి అత్తగారు ఏమనేవారు? ఆమె భర్త ఒప్పుకునేవాడా?

ఒకవేళ కూతురు సహాయం చేయకపోయినా సావిత్రి స్నేహితురాలు సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఉంటె, ఇప్పుడు సావిత్రి గారు ఎన్నో సినిమాలు చేసి ఉండేవారు కావచ్చు.

అనే ఆలోచనే నా ఈ కథ. సావిత్రి గారు బతికి ఇప్పటికి ఉంటె ఎలా ఉండేది? ఇంకా ఎన్ని సినిమాల్లో నటించేది అనే నా ఉహకు అక్షర రూపమే ఈ కథ.

అయితే నేను సావిత్రి గారి గురించి ఏ అధ్యయనం చేయలేదు, కారణం ఏమి లేదు సినిమా చూసాను అంతే అది చూసి మూడేళ్ళు అయిన తర్వాత టీవీ లో ఎదో సినిమా చూస్తున్నప్పుడు పాపం ఇప్పటికీ ఆమె బ్రతికి ఉంటె ఎలా ఉండేదో అన్న ఆలోచన ఈ సిరియల్ రాయడానికి నాంది అనుకోవచ్చు.

నాకు నచ్చినట్టుగా కాకుండా ఉహిస్తూ రాసాను, ఫీల్ అయ్యి రాసాను, సినిమా చివర్లో నాకు ఏడుపు వచ్చింది కానీ ఇందులో ఆ ఏడుపు లేకుండా చూడాలనే నా తపన, నా తపనను అర్ధం చేసుకుని, ఈ కథను ఆదరిస్తారని కోరుకుంటూ, ఇందులో కొందరి పేర్లను నాకు నచ్చిన పేర్లు పెట్టి పిలిచాను.

 

సావిత్రే జీవించి ఉంటె-మొదటి భాగం

 

వారి నిజం పేర్లను వాడొద్దు అని కాదు కానీ నాకు తెలియదు కాబట్టి, తెల్సుకో అంటారా ఎందుకండీ తెలుసుకోవాలని చూస్తే నాకు ఏడుపు రావడం సహజం అది నాకు ఇష్టం లేదు.

అందుకే వేరే పేర్లు పెట్టుకున్నా, ఇది ఒక్క సావిత్రి గారి కథే కాదు ఇలాంటి సినిమా తారల కథ, ఎవర్ని నొప్పించడానికో, ఉద్దేశించో కాదు రచయిత ఊహ అనంతం కాబట్టి నా ఉహలకు రూపమిచ్చి నా ప్రాణం పెట్టి రాస్తున్న కథ ఇక మొదలు పెడదాం.

అవును ఎక్కడనుండి మొదలు పెట్టాలి? చిన్నతనం, యవ్వనం, తర్వాత జరిగినవన్నీ మీరు సినిమాలో చూసే ఉంటారు కదా….

ఇక మళ్ళి మొదటినుంచి అంటే చాలా కష్టంగా ఉంటుందేమో, అయినా మీకు మళ్ళి టూకీగా ఒకసారి సావిత్రిగారి సినీ జీవన ప్రయాణం గురించి రెండు లైన్లలో చెప్పేసి ఇక మన కథలోకి వెళదాం సరేనా…..

సావిత్రిగారు ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. ఆమె పుట్టేనాటికే తండ్రిని కోల్పోయింది. పెద్దమ్మ, పెదనాన్న అండతో స్నేహితురాలితో కలిసి నాటకాల్లో వేషాలు వేసింది.

పెదనాన్న సహకారంతో సినిమా చాన్సుల కోసం మద్రాసు వెళ్ళడం, అక్కడ జెమిని పరిచయం, సినిమాల్లోకి రావడం. తిరిగి జెమినితో రహస్య, బహిరంగ వివాహం, దాన ధర్మాలు, ఇల్లు కట్టుకోవడం తన చుట్టూ చేరిన వారు తనని మోసం చేయడం, భర్త కూడా వేరే యువతితో ఉండడం చూసి జీవితం మీద విరక్తి చెందిన సావిత్రి త్రాగుడుకు బానిస అయింది .

ఇంతవరకు మనకందరికీ తెలిసిన కథే సినిమా తాగుబోతుగా మారకముందే సావిత్రి తన కూతురి వివాహాన్ని జరిపించింది.

కొడుకు చిన్నవాడు, స్నేహితురాలుతో రీహాబిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అనుకుందని సినిమాల్లో చూసాము. నేను దీని పాత్రలతోనే కథలాగా రాస్తాను.

దయచేసి ఫీలయ్యి చదవగలరు. సావిత్రిగారు సినిమాలో తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళడం గుర్తుంది కదా, అక్కడినుండి మన కథని మొదలుపెడదాం…….

********************

ఇంటిముందు కారు ఆగింది. సుశీల కిటికీలోనించి చూసింది. కార్లోంచి చిన్ననాటి నేస్తం సావిత్రి దిగడం చూసి, చాలా సంతోషించి ఎదురెళ్ళింది సుశీల.“

ఏమ్మా ఇన్ని రోజులకు గుర్తుకు వచ్చానా నేను, అయినా ఇదేంటి చాలా సన్నగా అయ్యావు, అంది సుశీల సావిత్రిని  కౌగిలించుకుంటూ. సావిత్రి సుశీలను నవ్వుతూ చూసి, నన్నంటున్నావు కానీ నువ్వే సన్నగా అయ్యావు అని అంది.

సరేలే ఇంకా ఇక్కడే ఎందుకు పద లోనికి వెళదాం అని హలో నాన్న ఎలా ఉన్నావు నీకు నేను గుర్తున్ననా, మర్చిపోయావా? అని అడుగుతూ సతీష్ ని ఎత్తుకొని లోనికి వెళ్ళారు ఇద్దరు.

తాను తాగుతాను అని సుశీలకు తెలియనివ్వకపోవడమే మంచిదని భావించింది సావిత్రి. ఇక తాగడం మానేసి సతీష్ కోసం అయినా ఏదైనా బిజినెస్ చేసి సంపాదించాలనే సుశీల వద్దకు వచ్చింది డబ్బు అప్పుగా అడగడానికి సహాయం అంటే తనకు నచ్చదు కాబట్టి అప్పు తీసుకుని ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలని అనుకుని వచ్చింది ఈ సమయం లో తెలియనివ్వక పోవడమే మంచిది అనుకుంది.

సావిత్రి ఇదిగో ఈగదిలో ఉండు నువ్వు నిన్ను ఎవరు డిస్టబ్ చేయరు, కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకో నేను వీడికి స్నానం చేయిస్తాను అంటూ బెడ్ ని సర్ది, సతీష్ ని ఎత్తుకుని తీసుకుని వెళ్ళింది సుశీల, సావిత్రి గదినంతా ఒకసారి పరీక్షించి చూసి, బెడ్ మిద అడ్డంపడింది.

మానసికంగానూ, శారిరకంగానూ బాగా అలసిపోయిన ఆమె శరీరం విశ్రాంతిని కోరుకుంది. ఆమె నిద్రలోకి జారిపోయింది.

సుశీల సతీష్ కు స్నానం చేయించి, కడుపునిండా భోజనం పెట్టి, తనగదిలో మంచం మిద పడుకోబెట్టుకుని వాడితో కబుర్లు చెప్తూ, ఆడుకుంటూ ఉండగా పని మిద బయటకు వెళ్ళిన సుశీల భర్త రఘు వచ్చిన అలికిడికి  వెళ్ళి అతనికి సావిత్రి వచ్చిన విషయం చెప్పింది.

రఘు కూడా నవ్వుతూ ఇక నీ స్నేహితురాలితో కబుర్లలో పడి నన్ను మరచిపోవు కదా అని హాస్యం ఆడి ఆమెతో మాట్లాడకుండా బిజినెస్ పని మిద వెళ్తున్నందుకు బాధ పడ్డాడు, వచ్చిన తర్వాత ఆమెని కలుసుకుంటా అని తనని క్షమించమని అడగమని చెప్పాడు భార్యతో, అవసరమైతే డబ్బు వాడుకోమ్మని పది రోజుల వరకు రానని చెప్పి వెళ్ళిపోయాడు రఘు.

అనుకూలమైన భర్తను చూసి పెళ్లి చేసినందుకు సావిత్రి మీద అంతు లేని అనురాగం పెరిగింది సుశీలకు.

భర్త వెళ్ళిన తర్వాత సావిత్రి గదిలోకి వచ్చి చూసింది సుశీల కానీ సావిత్రి ఆదమరిచి, ఒళ్ళు తెలియని స్థితిలో నిద్రపోతుంది అది చుసిన సుశీల గుండె తరుక్కు పొయింది.

ఎన్నో రోజుల మానసిక శారీరక ఒత్తిళ్ళ, షూటింగు గొడవలన్నిటిని భరించిన తన నేస్తం ఎన్నాళ్ళుగా నిద్రలేని రాత్రుళ్ళు గడిపిందోనని ఆమెని నిద్ర లేపాలనిపించక తిరిగి మరలి పొయింది సుశీల అలా రెండు మూడు సార్లు వచ్చి చూస్తూ వెనుదిరిగిన సుశీల తాను కూడా తిని సతీష్ దగ్గర నిద్రలోకి జారింది.

దాదాపు నాలుగు గంటలు అవుతుండగా సతీష్ లేచి ఏడవడం తో మెలకువ వచ్చిన సుశీల సమయం చుసి ఆశ్చర్య పోయి సతిష్ కి కాస్త పాలు కలిపి ఇచ్చి, తాను సావిత్రి వద్దకు వెళ్ళి ఇక తప్పనిసరిగా సావిత్రిని నిద్రలేపి, హఠాత్తుగా నిద్రలేచిన సావిత్రి తానేక్కాడ ఉన్నానా అని క్షణం అలోచించి, తర్వాత గుర్తొచ్చి, ఎంత సేపు పడుకున్నా సుశీ అని లేపక పోయావా అంది.

సావి ఎన్ని నిద్ర లేని రాత్రుళ్ళు గడిపావో ఎంత అలసి పోయావో అని లేపలేదు. లే పద భోజనం చెయ్యి అంది సుశీల ఇప్పుడెం భోజనమే రాత్రి తొందరగా తిందాంలే అంటున్న సావిత్రిని వారించి అదేం కుదరదు కావాలంటే రాత్రికి టిఫిన్ తిందువుగాని ఇప్పుడు భోజనం చెయ్యాల్సిందే అని పట్టుబట్టడంతో, అప్పటికే వంటావిడ తెచ్చిన భోజనాన్ని తింటున్న సావిత్రికి ఆమె తినే వరకు సుశీల ఏవేవో కబుర్లు చెప్తూనే ఉంది.

కానీ రెండు ముద్దలు పెట్టుకోగానే తినాలనిపించక చెయ్యి కడిగేసుకుంది. అయ్యో అదేంటే అలా కడిగేసావు? నా మతి మండ సమయం కాని సమయంలో ఏం తింటావులే సరే రాత్రి భోజనం అయినా త్వరగా చేద్దాంలే అని సర్ది చెప్పుకుంది సుశీల. 

సావిత్రి నవ్వుతూ లేచి వెళ్ళింది తనకి కేటాయించిన గదిలోకి. అమ్మా నాకు బొమ్మ కావాలి. ఒక పెద్ద గుర్రం బొమ్మ కావాలి. అని ఏడుస్తూ వచ్చాడు సతీష్.

ఏ నాన్న నీకు ఏ బొమ్మలు కావాలి? అని సతీష్ ని దగ్గరకు తీసుకుంది సుశీల తనకు అప్పటికి సంతానం లేకపోవడంతో సతీష్ అంటే ప్రత్యేకమైన శ్రద్ధ.

ఏరా కన్నా నీకు బొమ్మ కావాలా? ఏ బొమ్మ కొనివ్వాలో చెప్పు నేను కొనిస్తాలే అమ్మను విసిగించకు అంది. వాడు ఎదోటి అడుగుతూనే ఉంటాడు సుశీ. వాడినలా వదిలేయ్ అంది సావిత్రి.

హ హ హ పిల్లలు దేవునితో సమానం, చిన్నప్పుడు నువ్వు చేసిన అల్లరి తక్కువనా, సరే సావి నేను వీడికి కావలసిన బొమ్మలు కొని తెస్తాను కానీ నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో సరేనా అని సమాధానం కోసం ఎదురు చూడకుండానే సుశీల సతీష్ తో బయటకు వెళ్ళిపోయింది.

వాళ్ళు వెళ్ళిన తర్వాత సావిత్రి లేచి బయటకి వచ్చింది. అది పెద్ద ఇల్లే. సర్వెంట్స్ కు క్వార్టర్స్ లాంటివి అమర్చారు.

సుశీల కుటుంబానికి దగ్గరగా ఉండాలని. సర్వెంట్స్ గది దగ్గర ఎదో కోలాహలం వినిపించి అటుకేసి నడిచింది సావిత్రి, అక్కడ సర్వెంట్స్ గది దగ్గర ఒక వ్యక్తి బాగా తాగి ఉన్నాడు.

అతని చేతిలో మద్యం బాటిల్ లాకున్న అతని భార్య అరవంలో అతన్ని తిడుతూ ఎందుకు తాగావు? అమ్మగారు తిడుతారని పనిలోంచి తీసేస్తారని, తిండి ఉండదని అంటోంది. ఆ బాటిల్ ని కిటికీలో పెట్టి అతన్ని లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది.

సావిత్రికి ఆ బాటిల్ చూడగానే నరాలన్నీ లాగాయి. తాగకూడదు అని తీసుకున్న నిర్ణయాన్ని తుంగలో తొక్కి ఆ బాటిల్ తీసుకొని పరుగున లోనికి వెళ్ళిపోయింది ఎవరి కంటా పడకుండా.

గదిలోకి వెళ్ళిన సావిత్రి బాటిల్ ని పక్కన పెట్టి, బాత్రూంకు వెళ్ళొచ్చి వంట గదిలోకి వెళ్ళి, గ్లాస్, నీళ్ళు, తీసుకొని వచ్చి కూర్చుంది. ఇంతలో ఎదురుగా టీవీ కనిపించడంతో వెళ్ళి టీవీ పెట్టింది.

బాటిల్ మూత తీసి ఒక సారి వాసన గట్టిగా పీల్చి, సగం గ్లాస్ లోకి పోసుకుంది, నీళ్ళు కలిపింది. ఇంతలో టీవిలో తన భర్త పాట రావడం చూసి అతనా హీరోయిన్ తో రొమాన్స్ చెయ్యడం చూసి, కోపంతో, ఆవేశంతో గబగబా గ్లాస్ ని ఖాళీ చేసింది.

అతన్ని చూస్తున్న కొద్దీ అతను చేసిన ద్రోహం, మోసం అన్ని గుర్తొచ్చి వెక్కి, వెక్కి ఏడుస్తూ అతని మీద ప్రేమ చావక బాధని మర్చిపోవడానికి అన్నట్లు బాటిల్ మొత్తాన్ని గడగడా తాగడం మొదలుపెట్టింది. మందు వెచ్చగా గొంతులోంచి కడుపులోకి దిగుతూ, మండుతూ ఉంటె తనను తానూ నిలువుగా మంటల్లో పెట్టుకున్నట్టుగా భావించుకుంది సావిత్రి.

అలాంటి వాడికోసం, కేవలం సెక్స్ కోసం, ప్రేమ పేరుతో ఇలా ఎందర్ని మోసం చేస్తున్నాడో తెలిసి, అందులో తానూ ఒకతినని భావించి, అతని చేతుల్లో అనుభవించిన సుఖం అంతా గుర్తుకు వస్తుంటేనే ఒంటిమిద తేళ్ళు, జేర్లు పాకినట్టు గా ఇప్పుడు సావిత్రిని దహించివేస్తున్నది.

అలా ఎత్తిన బాటిల్ ని దించకుండా, కనీసం నీళ్ళు కూడా కలపకుండా మొత్తం తాగేసిన సావిత్రి మైకం ఎక్కువ కావడంతో, అలాగే మత్తుగా మంచం మీద వాలిపోయింది.

తాగి పడిపోయిన సావిత్రిని చూసి సుశీల ఏం చెయ్యబోతుంది? సావిత్రి తాగుతుందని సుశీలకు తెల్సా? తెలియక పొతే ఇప్పుడు తెలుసుకుంటే ఏం చేస్తుంది సుశీల? అన్ని మానేయాలని, మరచిపోవాలని వచ్చిన సావిత్రి మళ్ళి తాగడం మొదలుపెట్టడం దేనికి సంకేతం?

చదవండి తదుపరి భాగంలో. (సావిత్రి తాగింది తాగుబోతు అని అంటుంటే నాకు చాలా బాధగా ఉంది కావాలని ఎవరూ తాగుబోతులు కారు, మనసా, వాచా ప్రేమించిన వాడు ఇంకొకరితో వెళ్ళిపోతే అబ్బాయిలకన్నా ఎక్కువ బాధ పడేది అమ్మాయిలే కానీ దాన్ని ఎవరూ ఒప్పుకోరు,ఇక దాన్ని వదిలేద్దాం కానీ సావిత్రిని నేను తాగుబోతు అని అనలేక పోతున్నా) ఇది నా అభిప్రాయం మాత్రమే….

ఇది కేవలం కల్పితం మాత్రమే. ఎవర్ని ఊద్దేశించి కాదు. కేవలం నాకున్న ఆసక్తితో రాసుకున్నది కాబట్టి సర్వహక్కులు నావే.. ఈ కథ ఎలా ఉందో మీ అభిప్రాయాలూ, సూచనలు, సలహాలు  తప్పకుండా ఇవ్వగలరు.

– భవ్య చారు

Related Posts