సీనియర్ సిటిజన్

సీనియర్ సిటిజన్

రిటైర్మెంట్ పెద్దరికమిస్తుందని ఈ మధ్యే తెలుసుకున్నాడు సీతారాముడు. మనుషులందు రకరకములు కలరు అని తెలుసుకున్నాడు.

ఓహో రిటైరయ్యారా అని అడిగేవాళ్ళు, జాలిగా చూసేవారు, జెలసీతో చూసేవారు (వీళ్లు ఆఫీసు బాపతు) ఇలాంటి నానాజాతి సమితి చూపులు అలవాటయిపోయాయి.

అయితే మనవాడు. టంఛనుగా తలకు రంగేస్తాడు. నలగని బట్టల నిగనిగలతో టకాపీతో మెరిసిపోతుంటాడు.

“మీరు సీనియర్ సిటిజన్ అయారు మర్చిపోకండి ” భార్యామణి చురక చురుక్కుమంటుంటే చిరచరలాడుతుంటాడు సీతారాముడు.

ఈమధ్యే ఇల్లు మారాడు మనవాడు. ఎక్కడికి వెళ్లాలన్నా మెట్రో లో వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. హైదరాబాద్ అందాలను ఆస్వాదించటం నేర్చుకున్నాడు.

సీనియర్ సిటిజన్ కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించారని తెలిశాక మహదానందపడి వెతుక్కుంటూ వెళ్ళాడు మెట్రో ప్రయాణంలో. ఆ సీట్లన్నీ నిండిపోయిన్నాయి. చెరువులో పద్మాల్లా ఒకరిద్దరు సీనియర్ సిటిజన్లు ఉన్నారు.

ముగ్గురు, నలుగురు స్టూడెంట్స్ ఆ సీట్లలో కూచోటంతో కోపం నషాళానికంటుకుంది తన ముందున్న మరో సీనియర్ సిటిజన్ ని చూసి ఒక కుర్రాడు లేచి నిలబడి తన సీటు ఖాళీ చేశాడు. ఆ గౌరవం తనకివ్వకపోవటంతో సీతారాముడుకి గర్వభంగమయినంత పనయింది.

“బాబూ, నేనూ సీనియర్ సిటిజన్ నే” కోపంగా అన్నాడు.
నవ్వును బిగపట్టుకున్నారు ఆ పిల్లలు.

“సీనియర్ సిటిజన్ ఫెసిలిటీ కావాలి. డై కొట్టిన యంగ్ లుక్ కావాలి. అంకుల్ గ్రేట్ సీనియర్ సిటిజన్”

వాళ్లలో ఒక కుర్రాడు గొణిగినట్టన్నా గట్టిగానే అన్నాడు.

సీతారాముడుకి చెంప ఛెళ్ళుమన్నట్టనిపించింది. ఆ తర్వాత నుంచి మెట్రో లో సీనియర్ సిటిజన్ కోచ్ ఎక్కటం మానేశాడు.

– సి. యస్ .రాంబాబు

Related Posts