శాంతి మార్గంలో పయనిద్దాం
మన చుట్టూ జరిగే హింసాత్మక సంఘటనలే మనకు తీవ్రమైన మానసిక ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. మనుషుల మధ్య విభేదాలే హింసకు కారణం అవుతున్నాయి. శాంతి కోసం తపించే వారికి ఈ హింసాత్మక సంఘటనలు ఏమాత్రం కూడా రుచించవు. మన దేశ రక్షణకు యుద్ధం చేసామంటే అర్థం ఉంది కానీ అయినదానికీ, కానిదానికీ పోట్లాడుతూ ఉంటే ఏ మాత్రం ఉపయోగం లేదు.
అశాంతికి కారణభూతమైన హింసను ప్రతిఒక్కరు తప్పక ఖండించాలి. హింసకు కారణం అయినవారిని చట్టపరంగా శిక్షించాలి. సమాజంలో ఉన్న అసమానతల వలనే హింస ప్రజ్వలిస్తుంది. అసమానతలు దూరం కావాలంటే చర్చించటం ఉత్తమ పద్ధతి. చర్చల ద్వారా శాంతిని పునరుద్ధరణ చేయ వచ్చు. కూర్చుని మాట్లాడితే సానుకూల వాతావరణం ఏర్పడి శాంతి స్ధాపన సుగమం అవుతుంది.
ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడే అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా విస్తరిస్తాయి. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలంతా శాంతి మార్గంలో పయనించాలి. దేశ రక్షణకు యుద్ధం చేస్తే అది వీరత్వం. అనవసర హింస అభివృద్ధిని కుంటుపడేలా చేస్తుంది. శాంతిమార్గంలో పయనిద్దాం. దేశ అభివృద్ధికి పునాదులు వేసే ప్రయత్నం చేద్దాం.
– వెంకట భానుప్రసాద్ చలసాని