షడ్రుచులు

షడ్రుచులు

ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చి అప్పటికే సిద్ధంగా ఉన్న క్యాబ్లో లగేజీ సర్ది ఎక్కి కూర్చున్నారు సిద్దు, సంకీర్తన. పదేళ్ల కిట్టు, పన్నెండేళ్ళ మన్విత తల్లికి చెరొక వైపు కూర్చున్నారు. డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్న సిద్దు ఐదేళ్ల తర్వాత స్వదేశాన్ని చూస్తున్న ఆనందంతో ఒక రకమైన మైమరపుతో పారవశ్యంలో ఉన్నట్లుగా విండో లోంచి బయటికి తెరిపార చూస్తూ గత జ్ఞాపకాల దొంతరలో తేలిపోతున్నాడు. క్యాబ్ గమ్యం వైపు వేగంగా దూసుకుపోతోంది.

కిట్టు, మన్వితలు కూడా ఆసక్తిగా బయటికి చూస్తూ వాళ్లకి పెద్దగా ఊహ తెలియనప్పుడు వచ్చారు ఇండియాకి. మళ్ళీ తిరిగి ఇప్పుడే రావడం. ప్రతి ఏడాదిలాగే ఉగాది పండుగకి ఇండియాకి వెళ్దాము అనగానే అభ్యంతరం చెప్పిన సంకీర్తన ఈసారి మాత్రం అత్త మామ గార్లు, భర్త ఒత్తిడితో ఇండియాకి రావడానికి ఒప్పుకోక తప్పలేదు.

సంకీర్తన ఏడాది పిల్లగా ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ పూర్తిగా పాశ్చాత్య సంస్కృతి ఒంట పట్టించుకున్న సంకీర్తన ఇండియా అంటే మురికిదేశం, మూఢనమ్మకాల నిలయంగా కొట్టి పారేస్తుంది. అరగంట పాటు హైవే మీద ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణించిన కారు కాసేపటికి గదుకుదురులతో ఉన్న దారివైపు టర్న్ తీసుకుంది.

గతుకులతో ఉన్నా పచ్చటి తివాచీ పరిచినట్లున్న సన్నటి రహదారి వెంట వేగంతగ్గి వెళుతున్న క్యాబ్ లోంచి ఆశ్చర్యానందాలతో కేరింతలు వేస్తూ చూడసాగారు పిల్లలు. చైత్రమాసంలోని సోయగాలతో ప్రకృతి వింత అందాలతో తుళ్ళిపడుతూ రంగురంగుల విరిబాలలు కనులవిందు చేస్తుంటే, శుఖ పికాల కిలకిలా రావాలు మదిని ఉల్లాసభరితం చేస్తూ అప్పటివరకు వారిలో ఉన్న జడత్వం పారిపోయి ఉత్సాహం వెల్లువలా ప్రవేశించింది.

ఊర్లోకి ప్రవేశిస్తున్న కొద్ది ప్రకృతి వన్నె చిన్నెలు మరింత దేదీప్యమానమవుతూ ఆ అందాలను ఆస్వాదించడానికి రెండు కళ్ళు చాలవేమో అన్నట్లుగా అనిపిస్తున్నాయి. ఆ ఆహ్లాదకరమైన వాతావరణానికి ఉబ్బితబ్బిబ్బవుతూ సంతోషంతో కేరింతలు కొడుతున్నారు పిల్లలు.

“వావ్ మామ్! చూడు ఎంత బ్యూటిఫుల్ నేచర్! మూవీలో చూస్తున్నట్లుగా లేదూ?” తల్లితో అన్నాడు విస్మయంగా కిట్టు. మాట్లాడలేదు సంకీర్తన.

స్వదేశం రావడానికి ముహూర్తం ఖరారు అయినప్పుడు ముడుచుకున్న భార్య ముఖం ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవడం మిర్రర్ లో నుంచి గమనించిన సిద్ధూ చిన్నగా నవ్వుకున్నాడు.

“డాడ్! తాతగారి ఊరు ఇంత బాగా ఉంటుందని ఎప్పుడూ చెప్పలేదే? చూడు.. చూడు.. కిట్టు! ఆ పాండ్స్ లో వైట్ కలర్ డక్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా?”

“అవునక్కా నాకైతే వాటిని కాసేపు దగ్గర నుండి చూడాలని ఉంది..”

“అవును నాకు కూడా! ఇట్స్ రియల్లీ వెరీ అమేజింగ్. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ నేచర్”

“మన్వి ఇది ఇండియా! యూఎస్ కాదు. ఇక్కడ ఉన్నన్ని రోజులు కాస్త పద్ధతిగా తెలుగులో మాట్లాడండి. లేకపోతే తాతయ్య, నానమ్మ నొచ్చుకుంటారు యూఎస్ వెళ్లి తెలుగు మర్చిపోయారు అని” మందలిస్తున్నట్లుగా అన్నాడు కూతుర్ని సిద్దు.

“అదేంటి అలా అంటారు ఇండియా వచ్చినంత మాత్రాన తెలుగే మాట్లాడాలని లేదు కదా? వాళ్లకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా ఉండనివ్వండి..” కాస్త కోపం మేళవించిన స్వరంతో అంది సంకీర్తన.

అలా ప్రకృతి పరవశంలో తేలిపోతూనే ఉన్నారు అందరూ. ఇంతలో అందమైన రహదారిలో మలుపులు తిరుగుతూ తిరుగుతూ సాంప్రదాయ పద్ధతిలో ఉన్నప్పటికీ ఆధునికమైన హంగులతో నిర్మించబడి హుందాగా ఉన్న గృహ ప్రాంగణంలో వచ్చి ఆగింది క్యాబ్.

వీళ్ళ కోసమే ఎదురుచూస్తున్నారో ఏమో కారు శబ్దం వినిపించడం తోటి గంగారాం, సత్యవతి దంపతులతో పాటు అందరూ పరుగు పరుగున వచ్చి నలుగురి చుట్టూ చేరారు. అంతకుముందు నాలుగు రోజుల క్రితమే భర్త పిల్లలతో వచ్చిన చెల్లెలు తీర్థవేణి అన్నయ్య వదినలను పిల్లలను చూసి ఆనందంగా ముందుకు వచ్చి చుట్టేసుకుంది.

ఐదేళ్ల తర్వాత కొడుకును అతని కుటుంబాన్ని చూసిన ఆనందంతో చెమరుస్తున్న కళ్ళను మాటిమాటికి తుడుచుకుంటూ కొడుకును కల్లారా చూసుకున్నారు గంగారాం దంపతులు. అనురాగపూర్వకమైన పరిష్వంగనాలు, ఆప్యాయ పూర్వకమైన మాటలు ఒకరితో ఒకరి ప్రత్యక్ష పరిచయాలు నవ్వులు, కేరింతలతో అరగంట పాటు అక్కడి వాతావరణం ఆనందకరంగా మారిపోయింది.

తన పిల్లలిద్దరూ శింబు, కుందనలను అన్న పిల్లలకు పరిచయం చేసింది తీర్థవేణి. వాళ్ల కట్టుబొట్టు, ఆహార్యం చూసి పిల్లలు కాస్త బెరుకుగా చూసినా తొందరలోనే కలిసిపోయారు. తాము తీసుకొచ్చిన బహుమతులు పేరుపేరునా తల్లిదండ్రుల సూచనలతో అందరికీ ఇచ్చి వాళ్ల కళ్ళల్లోని సంతోషాన్ని తాము కూడా అనుభవించారు పిల్లలు.

కిట్టు, మన్వితలకి ఇన్నాళ్లు తాము పెరిగిన వాతావరణoకి, ప్రస్తుతం చూస్తున్న దానికి తేడాను గమనించి విస్తుపోతున్నారు. ఇంత ఆప్యాయత అనురాగాలను స్వచ్ఛమైన ప్రేమాభిమానాలను వాళ్ళు ఇంతవరకు చవిచూసి ఎరుగరు. ఇంట్లో తెలుగే మాట్లాడాలని సిద్ధూ పిల్లలు ఇద్దరినీ ఆదేశించినప్పటికీ దానికి తన భార్య మద్దతు లేకపోవడంతో ఇంగ్లీషు మాటలే దొర్లేవి ఇంట్లో. తండ్రి ఉన్నప్పుడు మాత్రం తెలుగు మాత్రమే మాట్లాడేవారు అలా మాట్లాడుతున్న క్రమంలో లోపాలను సరిదిద్దుతూ కొత్త కొత్త పదాలను నేర్పించేవాడు.

పూర్తిగా కమర్షియల్ గా ఉన్న అక్కడి జీవితానికి మాటల్లో చూపుల్లో, చేతల్లో, మమకారం ఉట్టి పడుతూ ఆత్మీయ బంధాలను పెనవేస్తూ చుట్టూ తిరుగుతున్న మనుషులు వారి పసి మనసులకు ఏదో తెలియని, ఇన్నాళ్లు తాము చూడని అద్భుతమైన ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపించసాగింది.

తాము వచ్చినప్పటి నుంచి ఊర్లో ఉన్న వాళ్ళందరూ తమకు తోచినదేదో పండు, ఫలమో మరేదో తీసుకువస్తూ చాన్నాళ్లకు వచ్చిన తమ ఊరి మనుషులను ప్రేమగా పలకరించి వెళ్తూ ఉండడం, మాటలు కలుపుతూ మమకారాన్ని పంచే తీరు ఎంతో ఆసక్తిగా ఉంది వాళ్లకి.

ఎన్నాళ్ళ నుంచో కోల్పోయిన అమూల్యమైనది ఏదో ఇప్పుడు తనివి తీరా అనుభవిస్తున్నట్లుగా మది నిండిన ఆనందం. బందీ ఖానాలోని జీవితాలు లాగా మరో మనిషి పలకరించడానికి లేకుండా ఒంటరిగా ఉండే ఆ జీవితాలకు చుట్టూ మనుషులతో అది కూడా ఆత్మబంధువుల లాంటి స్వచ్ఛమైన మనుషుల చుట్టూ ఉండడం వాళ్లకెంతో ఆనందాన్ని ఇస్తుంది.

ఇండియాలో బోర్ అని అమ్మ బ్యాగుల్లో సర్దిన ట్యాబ్స్ ,బుక్స్, టాయ్స్ ఇవన్నీ కనీసం ముట్టుకోవాలన్న ఆలోచన కూడా లేదు వాళ్ళకి ఇప్పుడు.

“మన్వి ఇలా రా! ఈ పరికిణి చూడు నీకు సైజు సరిగ్గా సరిపోతుందో లేదో..”

తీర్ధవేణి పిలిచింది మేనకోడల్ని. తమ్ముడు, అత్త పిల్లలతో కలిసి పావురాలతో ఆటలాడుకుంటున్న మన్విత “వస్తున్న అత్త!” అంటూ పావురాన్ని శింబు చేతిలో పెట్టి పరుగున వచ్చింది. బంగారు రంగు పట్టు పరికిణి, మెరూన్ కలర్ బ్లౌజ్ చేతిలో పట్టుకొని ఉంది తీర్థవేణి.

అంతే ఒక్కసారిగా కళ్ళు మెరిసాయి మన్వితకి. “వావ్ ఇట్స్ సో బ్యూటిఫుల్! ఎంత బాగుందో అత్త ఇది ఎవరికి?”

“ఎవరికి ఏంటి? నీకోసమే టైలర్ దగ్గరనుంచి తెప్పించాను. కొలతలు కాస్త అటు ఇటు ఉంటే సరి చేసుకోవచ్చు ఏది ఇటు తిరుగు..”

తాను కుట్టించిన డ్రెస్సు మన్వితకు సరిగ్గా సరిపోడం చూసి సంతోషంగా తల్లితో “అమ్మ చూశావా! నేను ఎంత బాగా ఎక్స్పెక్ట్ చేశాను. అది బాగా ఎదిగింది ఈ ఐదేళ్లలో నీకు సైజు తెలియదు అన్నావుగా?” ఆనందంగా అంది.

పాలు బాగా మరగ కాచి కాస్త ఇలాచీ పౌడర్, పంచదార కలిపి పిల్లలకు అందిస్తున్న సత్యవతి, “అవును తీర్థ! నువ్వు తెలివైన దానివి. అనుకున్నట్టుగా నీ మేనకోడలుకి సరిగ్గా సరిపోయే డ్రెస్సే కుట్టించావు అందులో మన్వి మెరిసిపోతుందనుకో!” పరికిణిని పట్టి చూసుకుంటూ మురిసిపోతున్న మన్వికేసి ఒకసారి చూసి అన్నారు సత్యవతి.

“అక్క ఇప్పుడు అది వేసుకోవాల్సిందేనా? దానికి అలాంటివి అలవాటు లేదు. అసలే ఒక్కచోట ఆగకుండా గెంతుతూ ఉంటుంది. పాదాలకు తట్టి పడిపోతుందేమో?” అత్త కంటే ముందు తనే సమాధానమిచ్చింది మన్వి.

“లేదమ్మా ఏం కాదు నేను నెమ్మదిగా నడుస్తాలే నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది!”

“పండక్కి సాంప్రదాయ దుస్తులు వేసుకుంటే చూడముచ్చటగా ఉంటారు వదిన పిల్లలు. చందనకు కూడా ఇలాంటిదే తీసుకున్నాను మీరు వస్తున్నారని తెలియగానే నేను మీ అన్నగారు, అమ్మ నాన్న వెళ్లి అందరికీ బట్టలు తీసుకున్నాము” అంటూ సావిత్రిని కేకేసి ఒక్కో కవర్ నుంచి డ్రెస్సులు తీసి పిల్లలందరికీ పిలిచి అందించింది తీర్థవేణి.

రకరకాల కలర్లలో, సరికొత్త డిజైన్లతో ఉన్న లాల్చీ పైజామాలు పిల్లలకు, అన్నకు, భర్తకు కూడా ఇచ్చింది.

పట్టు చీరల సంచి వదిన ముందు పెడుతూ “నీకు నచ్చింది తీసుకో వదిన! తర్వాత మేము తీసుకుంటాము ” అంది.

ఎంత కాదన్నా ఆ పట్టుచీరలోని సొగసుతనానికి ఫిదా కాక తప్పలేదు సంకీర్తనకి. తను ఎంచుకున్న నెమలీక రంగు చీరను భుజం పైన వేసుకుని చూస్తూ ఉంది.

“అమ్మ ఆ చీరలో మీరు ఎంత ముచ్చటగా ఉంటారో” చుడిదార్ లో ఉన్న సంకీర్తనను చూస్తూ అంది సావిత్రి.

***********

ఆరోజు బ్రహ్మీ ముహూర్త సమయంలో అందరిని నిద్ర లేపారు గంగారామ్ గారు. పిల్లలతో సహా అందరూ నిద్రలేచి ఉత్సాహంగా ఇంటి పనుల్లో పాలుపంచుకుంటున్నారు. సావిత్రి చంద్రయ్యలు ఇల్లంతా బూజు కట్టెలతో దులిపి బకెట్స్ తో నీళ్లు కుమ్మరిస్తూ ఇల్లంతా శుభ్రంగా కడిగారు. ఆరుబయట ఆవు పేడతో అలికి రంగురంగుల తీరైన రంగవల్లికలను తీర్చిదిద్దుతున్నారు తీర్థవేణి, సంకీర్తన.

సిద్దు, ప్రతాప్ లు గుమ్మాలకు మామిడితోరణాలు, బంతిపూలను అలంకరించడంలో నిమగ్నమైపోయారు. సావిత్రి సత్యవతి గారికి పూజా మందిరాన్ని అలంకరించడంలో సహాయం చేస్తోంది. చంద్రయ్య బాయిలర్ లో నీళ్లు మరగ కాయడానికి పిడకలు, కట్టెపుల్లలు సిద్ధం చేసుకుంటున్నాడు. పిల్లలు ఆసక్తిగా అన్ని విషయాలను అడిగి తెలుసుకుంటూ వేప పుల్లలతో దంత ధావనం చేసుకుంటూ సందడిగా తిరుగుతున్నారు. తీర్ధవేణి కుందనతో కలిసి ఇంట్లోని గడప గడపను పసుపు కుంకుమలు, బియ్యపు పిండితో అలంకరిస్తోంది.

బాయిలర్ లో మంట రాజేసి అయ్యగారికి నువ్వుల నూనెతో ఒళ్లంతా మర్దన చేసే పనిలో పడ్డాడు చంద్రయ్య. ఇంతలో కిట్టు పరిగెత్తుకుంటూ వచ్చాడు.

“తాతయ్య ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్ అట కదా శింబు అన్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ జనవరిలోనే అయిపోయింది కదా? మరి తను అలా అంటున్నాడు ఏంటి?” తన సందేహాన్ని వెలిబుచ్చాడు.

“అవును కదా తాతయ్య న్యూ ఇయర్ అయిపోయింది కదా? మల్లీ ఇదేంటి?” అంది మాన్విత.

పిల్లలని దగ్గరికి రమ్మని పిలిచి “మన హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఉగాది మాత్రమే. ఇంగ్లీష్ వాళ్లకు జనవరి ఫస్ట్ అయితే మనకు ఈరోజు. వాళ్లకు సంవత్సరానికి 12 నెలలు ఉన్నట్లు మనకు ఒక యుగానికి 60 సంవత్సరాలు ఉంటాయి. 60 సంవత్సరాలలో మొదటిది అయిన ప్రభవని బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పౌర్ణమి అయిన ఈరోజు సృష్టించారు. అందుకే హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు ఈ రోజే కొత్త సంవత్సరం అంటే ఉగాది అన్నమాట.”

“ఓహో ! అయితే మనకు ఉగాదే న్యూ ఇయర్. జనవరి ఫస్ట్ మనది కాదు” అర్థమైనట్లుగా అంది మాన్విత.

“అవును తల్లి! తెలుగు మాసాలలో తొలినెలా చైత్రం అంటే ప్రకృతి అంతా కొత్త చిగుర్లు తొడిగి, మామిడి పూలు, కోయిల కూతలతో విరబూస్తున్న పూలతో అందంగా మార్పు చెందుతుంది. అందుకే దీనిని ప్రకృతి పండుగ అని కూడా అంటారు. ఇదే మన అసలైన నూతన సంవత్సరం అర్ధమైందా?”

చందన ఏదో అడగబోతుండగా..”తాతయ్య గారు మీకు అన్ని తర్వాత వివరిస్తారు కానీ ముందుగా ఒక్కొక్కరుగా రండి నలుగు పెట్టి కుంకుల్లతో తలంటు పోస్తాను” అన్నాడు చంద్రయ్య.

కుంకుడు పులుసుతో తల రుద్దుకొని సున్నిపిండితో, వేడి వేడి నీళ్లతో అభ్యంగనస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తున్న అందరిలోనూ ఏదో తెలియని ఉత్తేజo నరనరాల్లో ప్రవహిస్తున్న అనుభూతి. ఆడవాళ్లందరూ కరకరలాడే పట్టు చీరల్లో వాటికి సరిపడా నగలు ధరించి, తల నిండా అలంకరించుకున్న పూలతో పుత్తడిబొమ్మలని తలపిస్తూ ఇల్లంతా తిరుగుతున్నారు. పిల్లలందరూ ఆత్మీయ పిలుపులతో కళ్ళల్లో వెల్లువలా వస్తున్న వెలుగులతో కనిపిస్తున్నారు.

షడ్రుచులతో తయారు చేయబడ్డ పరిమళభరిత పచ్చడిని ఆస్వాదించారు అందరూ. సత్యవతి స్వహస్తాలతో తయారుచేసిన నేతి బక్ష్యాలు ఆనందంగా ఆరగించారు. సమయం వచ్చినప్పుడల్లా పిల్లలకు విసుగు కలిగించకుండా ఆసక్తి రేకెత్తించేలా సందర్భాన్ని బట్టి ఉగాది పచ్చడి ప్రాశస్యాన్ని, పండుగ పరమార్ధాన్ని వివరిస్తున్నారు గంగారామ్ గారు.

రెండు కార్లలో పిల్లలను తీసుకొని షాపింగ్ కి బయలుదేరారు గంగారామ్ గారు. సిద్దు సంపత్ డ్రైవింగ్ చేస్తుండగా. అందమైన వర్ణాలలో ఉన్న విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు గంగారామ్ గారు.

“ఇన్ని ఎందుకు తాతయ్య ఎవరికోసం?”

కిట్టు ప్రశ్నకు సమాధానంగా, “ఇది మన హిందూ మత సాంప్రదాయం. మనము కాస్త కలిగిన వాళ్ళం కాబట్టి చలికాలం వెళ్లి ఎండాకాలం రాబోతున్న ఈ ఋతువులో పేదవాళ్ళు ఇవన్నీ కొనుక్కోలేరు కదా….! అందుకని వారికి దానధర్మం ఇవ్వడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది వాళ్లు మనల్ని సంతోషంగా ఆశీర్వదిస్తారు. అందుకే మన పెద్దవాళ్లు ఏ పని చేసినా అందులో ఒక మంచి పరమార్థం ఉంటుంది.”

అనాధాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్లి పిల్లల చేత కొన్న వస్తువులన్నింటినీ దగ్గరుండి ఇప్పించారు పెద్దవాళ్లంతా. వస్తువులు తీసుకున్న వాళ్లు మనస్ఫూర్తిగా ఇస్తున్న ఆశీర్వాదాలు పిల్లలలో ఎంతో సంతోషాన్ని కలిగించాయి. వచ్చే దారిలో చలివేంద్రంలో చల్లటి మజ్జిగ నీళ్లను సేవించి సేద తీరారు అందరూ. చలివేంద్రాలు ఏర్పాటు చేయటం వెనుక ఉన్న కారణాలను పిల్లలకు చెప్పారు. ఇంటికి రాగానే రకరకాల పిండి వంటలతో గుబాలిస్తున్న సువాసనలను పీల్చగానే ఆకలి గుర్తుకొచ్చింది అందరికీ.

“పిల్లలూ! తొందరగా కాళ్లు చేతులు కడుక్కొని రండర్రా భోజనాలు వడ్డిస్తాను” అంటూ చాప పరిచింది చంద్రమ్మ.

తీర్థవేణి, సంకీర్తన భోజన పదార్థాలు ఒకటి తీసుకొచ్చి పెట్టారు. అరిటాకుల్లో గుమగుమలాడుతున్న కమ్మని భోజన పదార్థాలను ఒకరికి ఒకరు వడ్డించుకున్నారు. పులిహోర, దద్దోజనం తిన్న తర్వాత చిక్కుడుకాయలు, రాములక్కాయలు రకరకాల ఆకుకూరలతో చవులూరించేలా ఉన్న కూరలతో తృప్తిగా భోజనం చేశారు అందరూ.

సరదా కబుర్లతో, చలోక్తులతో ఇల్లంతా పండగ కళ సంతరించుకొని కన్నుల పండుగగా కనిపిస్తోంది. సాయంత్రం పిల్లలందరినీ తీసుకొని కాలినడకన గుడికి పంచాంగ శ్రవణానికి బయలుదేరారు సీతారాం దంపతులు. దారిలో పంచాంగం వినడం వల్ల లభించే సత్కర్మలు, ఆయుష్ వృద్ధి గురించి వివరించారు. తండ్రి తాము వస్తున్నామని తెలిసినప్పటినుంచి ఒక పద్ధతి ప్రకారం కార్యక్రమాలను నిర్దేశించుకుని పిల్లలకు మన సంస్కృతి, సాంప్రదాయాన్ని వివరిస్తున్న పద్ధతికి మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు సిద్ధూ.

తల్లిదండ్రుల ద్వారా తెలుసుకోని గొప్ప గొప్ప విషయాలన్నీ తెలుసుకుంటూ తాత గారిని ఆరాధన భావంతో చూస్తున్నారు పిల్లలంతా. భార్యలో మొదట్లో కనిపించిన విసుగు,చిరాకు ఇప్పుడు లేషమాత్రంగా కూడా కనిపించడం లేదు సిద్దుకి. పైగా ఆ స్థానంలో ఒక రకమైన మెరుపు, ఆనందం స్పష్టంగా గోచరించి తృప్తిగా నిట్టూర్చాడు.

చాలా రోజుల తర్వాత అందరిలోనూ ఏదో మనసు నిండిన సంతృప్తి కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. ఉగాది పండుగ పిల్లలందరితో జరుపుకోవాలని ఎన్నాళ్లుగానో తపిస్తున్న ఆ దంపతులు తమ కోరిక తీరిన ఆనందంతో ఉన్నారు. వాళ్ళ వదనాలు వికసిత కమలాలే అయ్యాయి. తన పిల్లలు ఎక్కడ తెలుగుతనాన్ని, సంస్కృతిని మరిచిపోయి పరాయీకరణం చెందుతారో అన్న బెంగ తీరినట్లు అనిపించింది సిద్దుకి. తాతయ్య మాటల పట్ల ఎంతో ప్రభావితమైనట్లుగా కనిపిస్తున్న పిల్లల్ని చూస్తున్న కొద్దీ.

సాయంకాల భోజనాలు కూడా సందడిగా ముగిశాయి. అందరూ ఒకచోట చేరారు. తాతయ్య పొద్దున చెప్తా అన్నావు కదా “ఉగాది ఎందుకు జరుపుకోవాలి? ఇప్పుడు చెప్పవా ప్లీజ్” అంది మాన్విత తాతయ్య దగ్గరగా జరుగుతూ.

ఆ పిల్లకి మొదటి నుంచి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువ. దానికి తోడు తండ్రి తరచుగా భారతీయ విలువల గురించి చెబుతూ ఉండడంతో ఆసక్తి ఇంకా ఎక్కువైంది.

“యుగం ఆరంభం అవుతుంది కాబట్టి దానిని మనము ఆ ప్రకృతి ద్వారా లభించే అన్ని రకాల పదార్థాలతో కలిసి పచ్చడిని చేసుకొని ఆరగించడం వెనక ఎంతో గొప్ప ఉద్దేశ్యం ఉంది తల్లి..”

అందరూ తాతయ్య దగ్గరగా జరుగుతూ ఆ విషయం తెలుసుకోవాలన్నట్లుగా ఆసక్తిగా చూసారు.

“పండగ పరమార్థం అంతా పచ్చడిలోనే ఉందమ్మా. పులుపు, చేదు, వగరు, ఉప్పు, తీపి, కారం ఈ షడ్రుచుల సమ్మేళనంతో చేసే ఉగాది పచ్చడి మనకు అందిస్తున్న సందేశాలు ఎన్నో. జీవితంలో కూడా ఆరు రుచుల లాగా రకరకాల అనుభూతులు అంటే సంతోషం, బాధ, దుఃఖం ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటినీ సమర్థవంతంగా స్వీకరించి, స్థిత ప్రజ్ఞతతో అన్నింటినీ అధిగమిస్తూ ఆశావాహదృక్పథంతో ముందుకు సాగడమే వివేకవంతుల లక్షణం అని అన్యాపదేశంగా చెబుతుంది ఇదేనమ్మ ఈ పండగ మానవాళికి ఇస్తున్న సందేశం.”

పిల్లలతో సహా అక్కడున్న పెద్ద వాళ్ళందరూ కూడా సంతోషంగా చప్పట్లు చరిచారు. చాలా బాగా చెప్పారు అంటూ..

***********

“వెళ్ళొస్తాం మామయ్య గారు వెళ్లొస్తాము అత్తయ్య.!”. అంటూ అత్త మామ గారి పాదాలకు నమస్కరించింది సంకీర్తన.

సిద్దు కూడా తల్లిదండ్రులకు ప్రణామం చేశాడు. బావగారిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. చెల్లెలు దగ్గర, పిల్లల దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. కిట్టు, మాన్విత తాతయ్య, నాన్నమ్మలను, అత్తను, పిల్లలని వదలలేక వదలలేక కన్నీళ్ళతో వెనుతిరిగారు. మళ్లీ కొడుకును, పిల్లల్ని ఎప్పటికీ చూస్తాము అన్న దిగులో, వాళ్లతో ఇన్ని రోజులు పెనవేసుకున్న ఆత్మీయ అనుబంధాల వల్ల ఏర్పడిన సంతృప్తో మరి కళ్ళనీళ్లు తిరుగుతుండగా వీడ్కోలు చెప్పారు ఆ దంపతులు.

“చిన్నా..! మళ్లీ ఎప్పుడురా ఈ అమ్మానాన్నలు చూడడానికి వచ్చేది?” కారు ఎక్కబోతుండగా తండ్రి గొంతులోంచి కాకుండా గుండెల్లోంచి వస్తున్న ఆవేదన పూరితమైన మాటలతో చలించి పోయాడు సిద్దు.

కానీ సమాధానం సిద్దు చెప్పలేదు. “మామగారు నేను వాగ్దానం చేస్తున్నాను. ప్రతి ఉగాది పండుగకు మీ అబ్బాయి, నేను పిల్లలు మీ ముందు వాలిపోతాము. ఇది నా మాటగా చెప్తున్నాను” అంది సంకీర్తన నీళ్ళు నిండిన కళ్ళతో.

ఆశ్చర్యంగా భార్య వైపు చూసాడు సిద్దు. అతని కళ్ళలో కన్నీటి జీర కనబడి మాయమైపోయింది. పిల్లలు కూడా ఆనందంతో కేరింతలు కొట్టారు. కారు కనుచూపు మేర దాటి వెళ్లిపోయే వరకు అందరూ నిలబడి చెయ్యి ఊపుతూనే ఉన్నారు.

– మామిడాల శైలజ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress