శివరాత్రి

శివరాత్రి

వైకుంఠ ఏకాదశి పొద్దున్నే పనులన్నీ చేసుకుని, అందరం ఉపవాసం కాబట్టి పిల్లలకు మాత్రం ఉప్మా చేసేసి, బాక్స్ లలో పెట్టేసి నేను కూడా తయారయ్యి, బడికి బయలుదేరాను.

ఎప్పటిలా క్లాస్ లన్ని చెప్పేసేసి, లంచ్ లేదు కాబట్టి నేను రాయకుండా వదిలేసిన అసైన్ మెంట్స్ రాసుకున్నా, సాయంత్రం బడి అయ్యాక, ఇంటికి వచ్చేసి, కాళ్ళు చేతులు కడుక్కుని ట్యూషన్ కి వచ్చిన పిల్లలని కూర్చోబెట్టి నేను మా పిల్లలకు హోం వర్క్ చేయించడం మొదలు పెట్టాను.

అదయ్యేసరికి రాత్రి ఎనిమిదిన్నర అవడంతో మాకు టిఫిన్, అలాగే పిల్లల కోసం ఏదైనా చేయాలని అనుకున్నా, అందరికీ కలిపి సేమ్యా ఉప్మా చేశాను. పిల్లలకు పెట్టాను.

నేను మళ్ళీ దేవుడికి దీపం పెట్టేసి అమ్మకు, నాకు ఉప్మా పెట్టాలని అనుకునే సమయంలో హఠాత్తుగా మణికొండ లో ఉండే మా పెద్ద తమ్ముడు వచ్చాడు. రావడం తోనే ఏం చేస్తున్నారు అంటే ఉపవాసం కదా ఉప్మా తినాలనుకున్నాం అని చెప్పాను.

సరే నాకు పెట్టు అన్నాడు. వాడు కూడా ఉపవాసం కాబట్టి ఉన్నదాంట్లోనే సరిపెట్టుకున్నాము. కానీ నాకు ఎక్కడో అనుమానం మొదలు అయ్యింది.

ముందుగా చెప్పకుండా మా తమ్ముడు ఎప్పుడు రాలేదు. వచ్చేముందు ఫోన్ చేసి భోజనం ఏర్పాట్ల గురించే మాట్లాడేవాడు ఇలా హఠాత్తుగా రావడం ఏంటో అర్థం కాలేదు.

ఉప్మా తింటున్నప్పుడు వాడి కేసి అనుమానంగా చూసాను. కానీ వాడు అదేం పట్టించుకోకుండా తినడం లో లీనం అవుతూ అమ్మను ఇంకొంచం వేసుకో అని అడుగుతూ అమ్మను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు.

తిన్న తర్వాత ప్లేట్ లు కడుగుతున్న నా దగ్గరికి వచ్చి, అక్కా అని పిలిచాడు నేను వెనక్కి తిరగ కుండానే ఏంట్రా ఏమైనా కావాలా, పాలు తాగుతావా అని అడిగాను.

అది కాదక్కా, అమ్మమ్మ చనిపోయింది అంటూ చల్లగా చెప్పాడు. ఆ మాటతో ఉలిక్కిపడిన నేను అంట్లు అలాగే వదిలేసి ఎలారా?  ఎప్పుడు అంటూ ఆత్రుతగా అడిగాను.

సాయంత్రం ఏడు గంటలకు పోయింది అంట మామయ్య ఫోన్ చేసి రమ్మన్నాడు అన్నాడు వాడు. అయ్యో అవునా, మొన్ననే కదా వెళ్ళి చూసాము. బాగానే ఉందిగా అన్నాను నేను అయోమయంగా…

ఏమోనే అసలే తనకు బాగాలేదు. రెండేళ్ల నుంచి బెడ్ పైనే ఉంది కదా, తను అలా ఉంటే ఎంత బాధ అనిపించింది. పైగా తనకు బెడ్ సోర్స్ సోకి పుళ్లు పడడం వల్ల ఇంకా నరకం అనుభవించింది. పోనీలే పోవడమే ఒకందుకు మంచిదేమో, పైగా వైకుంఠ ఏకాదశి రోజున పోవడం పుణ్యమే అన్నాడు వాడు.

అవును లేరా నువ్వు చెప్పింది నిజమే కానీ ఇప్పుడు అమ్మకు ఎలారా చెప్పడం అంటూ అడిగాను. అమ్మకు అమ్మమ్మ అంటే ప్రాణం. తను బెడ్ మీద ఉన్నన్ని రోజులూ తానే అన్ని అయ్యి సేవలు చేసింది.

నెలలో సగం రోజులూ మామయ్య దగ్గరే ఉంటూ, తన డబ్బులు పెట్టి అమ్మమ్మకు ఏం కావాలన్నా తెచ్చి పెట్టేది. మామయ్య కి ఉద్యోగం లేదు ఏదో కొట్టులో పని చేసేవాడు. అమ్మ అక్కడ వారికి అన్ని విధాలా చూసుకునేది.

కాబట్టి అమ్మను రమ్మని పిలిచేవారు. అమ్మ సంతోషంగా వెళ్ళి ఉండేది. అమ్మమ్మకు బాత్రూం వెళ్ళినా, స్నానం చేయించడం, జుట్టు దువ్వి కొప్పు వేయడం, అన్నం తినిపించడం లాంటివన్నీ చేసేది.

ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తాను ఎలా రియాక్ట్ అవుతుందో అనే భయం వేసింది. కానీ చెప్పకుండా ఉండలేని పరిస్థితి, చెప్పక తప్పదు కాబట్టి వాడు నాకేసి చూస్తూ నీదే చెప్పే బాధ్యత అక్కా అంటూ నా నెత్తిన వేశాడు.

అమ్మో చచ్చింది రా గొర్రె, అమ్మకు ఈ విషయం చెప్తే తను ఏడ్చి గగ్గోలు పెడుతుందనే భయం వేసింది. కానీ నేనే గుండె రాయి చేసుకున్నా, అంట్లు అన్ని అక్కడే పారేసి, మెల్లిగా టీవీ చూస్తున్న అమ్మ దగ్గరికి వెళ్లి కూర్చున్నా, అయ్యాయా అంటూ అడిగింది.

అమ్మా అది కాదు మనం వెంటనే మామయ్య దగ్గరికి వెళ్లాలి అన్నాను కొంచం మెల్లిగా, విన్న అమ్మ ఎందుకమ్మా, ఏమైంది అంటూ అడిగింది. ఏం లేదమ్మా అమ్మమ్మ కు కొంచం బాగాలేదట, హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారట అన్నాను.

అంతేనా అంది అమ్మ తీక్షణంగా చూస్తూ, అంటే అది అమ్మ అంటూ నసుగుతున్న నన్ను చూస్తూ, అమ్మ ఎందుకే నా దగ్గర అన్ని దాస్తారు.

నాకు అర్దం అయింది కానీ ఎలా వెళ్ళాలో ఆలోచించండి, ఇప్పటికే సమయం పదకొండు అవుతుంది. ఇప్పుడు బస్ ఉందంటారా అంటూ అడిగింది.

తమ్ముడు వచ్చి అక్క పదండి ఆటో తెచ్చాడు అంటూ పిలిచాడు. నేను అమ్మను పట్టుకుని ఎలా ఉన్నామో అలాగే వెళ్లి ఆటోలో కూర్చున్నాం పదకొండున్నరకు సుచిత్ర లో బస్ ఎక్కాం. మధ్యలో తమ్ముడు డ్రైవర్ వద్దకు వెళ్లి ఏదో చెప్పాడు.

కాసేపటి తర్వాత మా పిన్ని వాళ్ళు కూడా అదే బస్ లో ఎక్కారు. వాళ్ళు అంతకు ముందే తమ్ముడితో మాట్లాడారు అంట కలిసి వెళ్దాం అని దాంతో వాళ్ళు బస్ ఎక్కగానే ఇక అమ్మ, పిన్ని తట్టుకోలేక ఒకర్ని పట్టుకుని ఇంకొకరు ఏడవడం మొదలు పెట్టారు.

మేము చూస్తూ ఉండడం తప్ప ఏం చేయాలో అర్థం కాలేదు. వారి దు:ఖం ఎవరూ తీర్చలేనిది. ఆపలేనిది అమ్మ ఎవరికైనా అమ్మనే కదా, అమ్మ లేకుండా ఎవరం ఉండలేము.

అలా మేము ఇంటికి అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నాం. అప్పటికి ఇంట్లో లైట్, ఇంటి ముందు మంట రెండూ వెలుగుతూ ఉన్నాయి.

మంచం పై మామయ్య శోక సముద్రంలో మునిగి ఉన్నారు. అత్తమ్మ కూడా పిల్లలు మాత్రం ఒక పక్కగా తట్టుపై నిద్ర పోతున్నారు. చిన్నపిల్లలు వారికేం తెలుస్తుంది.

అమ్మమ్మ మాత్రం తనను ఎప్పుడూ పడుకునే పరుపులో హాయిగా నిద్రపోయినట్టే ఉంది. అమ్మా, పిన్ని ఏడుపుకు ఆ నిశ్శబ్దం లో కదలిక వచ్చినట్టు అయ్యింది. పాపం అత్తమ్మ వారిని ఓదార్చింది.

తెల్లర్లు వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. వారిని చూసి నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కానీ ఏడిస్తే అమ్మను ఎవరు ఒదారుస్తారు అందుకే గట్టిగా ఏడవలేదు. తెల్లారి రావాల్సిన వాళ్ళు వచ్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

మామయ్యకు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి నేను మా పెద్ద తమ్ముడు ఇద్దరం అన్ని విధాలా చూసుకున్నాం. మామయ్య పెదనాన్న కొడుకు అంటే పెద్ద మామయ్య కూడా వచ్చారు. తను కుడా ఒక చేయి వేశారు. వంట బ్రహ్మణులను పిలిచారు. మరి ఈ దుఖం లో ఎవరు చేస్తారు.

ఇక అమ్మమ్మను సాగనంపి వచ్చాము. అమ్మ ఏడుపు ఆపుకోలేక పోతుంది. తనను పట్టుకోలేక పోతున్నాం. అప్పుడే మా పెద్ద మామయ్య వచ్చి అమ్మతో సమయం వచ్చింది, పోయింది.

పుణ్యాత్మురాలు కాబట్టే ఏకాదశి రోజున వెళ్ళింది. ఆమెకు శాంతి లేకుండా చేయకండి అన్నాడు. దాంతో అమ్మ కాస్త తెరిపిన పడింది.

అన్ని కార్యక్రమాలు అయ్యే వరకు అక్కడే ఉన్నాం. మామయ్య ఆ సంఘటన నుండి కాస్త బయటపడి తిరిగి తన మామూలు జీవితంలో పడ్డారు. ఇక మేము వెళ్ళే రోజు దగ్గర పడింది.

అమ్మ, అమ్మమ్మ పడుకున్న ఆ చోటు ను చూస్తూ ఒకటే ఏడుపు, తనని ఓదార్చడం నా వల్ల కాలేదు. తల్లి లేని పుట్టింటికి ఎలా రావాలి. ఇక నన్నెవరూ పిలుస్తారు అంటూ చాలా ఏడ్చింది.

నిజమే అమ్మ లేకపోతే ఎవరు పిలవరు. ప్రేమలు, ఆప్యాయతలు పంచేవారు ఎవరు ఉండరు. అత్తమ్మ, మామయ్య మేము లేమా మీరు ఎప్పుడైనా రావచ్చు అన్నారు.

కానీ ఇప్పటికీ మమల్ని ఒక్కసారి  కూడ పలకరించలేదు. అమ్మమ్మ సంవత్సరికానికి కూడా మేము ఫోన్ చేసి గుర్తు చేసేవరకు వాళ్లు పట్టించుకోలేదు.

ఆ రోజు రాత్రి మాత్రం మాకు శివరాత్రి లాగా అనిపించింది. మా అమ్మమ్మ మాత్రం ఎంతో పుణ్యం చేసుకుందో అందుకే వైకుంఠ ఏకాదశి రోజున మోక్షం కలిగిందని సంతోషించాం… ఆమె అనుభవించిన బాధ నుండి కూడా ఆమెకు మోక్షం లభించింది..

– అర్చన

Related Posts