శ్రావణ సంధ్య

శ్రావణ సంధ్య

రాజేశ్వర్రావ్ ఆ ఊర్లో పెద్ద జమిందార్. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఆడపిల్లలకి పెద్ద చదువులెందుకు అనుకునే పాతకాలం మనస్తత్వం. కొడుకుని కూడా అలాగే పెంచాడు.
ఏదడిగినా కాదనకుండా ఇచ్చే తండ్రి అండతో డిగ్రీ కూడా పూర్తి చేయకుండా, ఉన్న ఆస్థి అంతా ఖర్చుపెడుతూ తిరిగాడు కొడుకు సురేష్. 
పెద్ద కూతురు శ్రావణి తండ్రి మాట వింటూ పెద్దగా చదువుకోకుండా ఇంట్లోనే ఉంటుంది. చిన్న కూతురు సంధ్యకి చదువంటే ఇష్టం. కానీ తండ్రి సహకరించలేదు. తండ్రికి తెలీకుండా డిస్టన్స్ లో చదివి మంచి మార్కులతో డిగ్రీ పూర్తిచేసింది సంధ్య.
బంధువులు చేసిన మోసాలు, కొడుకు జల్సాలు అన్నీ కలిసి ఆస్థి మొత్తం కరిగిపోయింది. కార్లు, బంగ్లాలు పోయాయి. ఒక చిన్న ఇంట్లో రెంట్ కి ఉంటున్నారు. పెద్ద కూతురుకి పెళ్ళి వయసు దాటుతున్నా సంబంధాలు రావటం లేదు.
కొడుకుతో వ్యాపారం చేయిద్దామంటే పెట్టుబడికి పైసా లేదు. పెద్ద ఉద్యోగం చేయటానికి చదువు లేదు. చిన్న ఉద్యోగం చేయటానికి నామోషీ అనుకున్నాడు.
ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సతమతమవుతుంటే సంధ్య వచ్చి తనకి బ్యాంక్ ఉద్యోగం వచ్చింది అని చెప్పింది. అయిదంకెల జీతం.
తన జీతంతో ఇంటిని చక్కగా నడిపిస్తున్న కూతురిని చూసి రాజేశ్వర్రావ్ కి పశ్చాతాపం కలిగింది. చెల్లిని చూసి ఇన్స్పైర్ అయిన శ్రావణి తనకి ఆసక్తి ఉన్న డ్రెస్స్ డిజైనింగ్ నేర్చుకుని చిన్న బొటిక్ పెట్టుకుంది.
ఒకప్పుడు రోజుకొక కార్ వేసుకుని తిరిగుతూ జల్సా చేసిన సురేష్, చెల్లెల్ని చూసి బుద్ధి తెచ్చుకుని ఇప్పుడు ఒక క్యాబ్ డ్రైవర్ గా సెట్టిల్ అయ్యాడు. 
ఆడపిల్లలకి చదువులెందుకు అనుకున్న ఒకప్పటి రాజేశ్వర్రావ్ ఇప్పుడు ఆ కాలనీలోని ఆడపిల్లలకి ఉచితంగా ట్యూషన్ చెప్తున్నాడు.
ఆడపిల్లల చదువు, స్వేచ్చ గురించి స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేస్తూ అందరికి అవగాహన కల్పిస్తున్నాడు.
– ఇస్మాయిల్ భాయ్

Related Posts