షుక్రియా సాబ్ – కథానిక

షుక్రియా సాబ్ – కథానిక

ఆఫీసు పనిమీద అర్జంట్ గా కోఠి వెళ్ళాల్సి వచ్చి క్యాబ్ దొరక్క రోడ్డుమీద కొచ్చాను. కనీసం ఆటో అన్నా దొరుకుతుందేమోనని. ఆటోలు చాలా ఉన్నాయి కానీ ఒక ఆటో నన్ను ఆకర్షించింది. కాదు.. కాదు.. నన్నాకర్షించింది ఆ ఆటో డ్రైవర్. యాభై పైనే ఉంటాయనిపించింది. చాలా శుభ్రంగా ఉండి తలపై చిన్న టోపీ, గడ్డం.. చూస్తే ముస్లిం లా ఉన్నాడు. చేతిలో హిందూ పేపర్ ఉంది.

“ఎక్కడికి పోవాలి సర్” చాలా మర్యాదగా అడిగాడు. “కోఠి వస్తారా” అంతే మర్యాదగా అడిగాను. అక్కడితో ఆగకుండా ఎంతిమ్మంటారని కూడా అడిగాను..

“భలేవారే సర్. మీటర్ హైనా” అంటూ మీటర్ వేసి నన్నాశ్చర్యపరిచాడు. “ఈరోజుల్లో మీటర్ వేసేవాళ్ళున్నారా” అన్న నా మాటకు అతని సమాధానం ఇంకా ఆశ్చర్యపడేలా చేసింది.

“మీటర్ ఉన్నప్పుడు వేయాలి సర్. వద్దనుకుంటే ఆ మీటర్ పనిచేయటం లేదని మాత్రం అబద్దమాడకూడదు సర్” అతని సమాధానం నాకు ముుచ్చటగా అనిపిస్తుంటే అతనితో సంభాషణ పొడిగించాను..

“ఆటో డ్రైవర్ లు ఎక్కువగా తెలుగు పేపర్ లేదంటే ఉర్దూ పేపర్ తో కనిపిస్తారు. మీరేమిటి హిందూ పేపర్ తో కనిపిస్తున్నారు” క్యూరియాసిటీ తో అడిగాను.

“పిల్లలకు ఇంగ్లీష్ చెప్పటం కోసం హిందూ పేపర్ చదవటం అలవాటు చేసుకున్నాను సాబ్. నెమ్మదిగా అది వ్యసనంగా మారింది” డ్రైవ్ చేస్తూనే మాట్లాడసాగాడు.

“మీ పిల్లలు ఏం చేస్తున్నారు ” కుతూహలంగా అడిగాను

“అమ్మాయి సి. ఏ. చేస్తోంది సర్. అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడు.”

“ఎంతకాలం బట్టి ఆటో నడుపుతున్నారు! కేవలం ఆటో డ్రైవింగ్ తో వచ్చే ఇన్ కం సరిపోతుందా?” అడిగాను.

“దాదాపు ఇరవై ఏళ్లుగా ఆటో నడుపుతున్నాను. మేముండే ఏరియాలో ఒక ఆటో కూడా ఉండేది కాదు. అందుకని చేసే ఉద్యోగం మానేసి ఆటో కొనుక్కున్నాను. అదే ఆటో ఇది.. నాకొచ్చేది సరిపోదు. అందుకని నా భార్య టైలరింగ్ చేసి కొంత హెల్ప్ చేస్తుంది సార్”

“మీ పేరు” తెలుసుకోవాలనిపించి అడిగాను.

“అబ్దుల్ సాబ్”

“మీ అబ్బాయి ఏ ఇంజనీరింగ్ కాలేజ్” చెప్పాడు అబ్దుల్.

అల్లా దయవలన పిల్లలిద్దరు బాగా చదువుకుంటున్నారు. అదే సంతోషం.. మా బాబు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. ఆ టెన్షన్ లో ఉన్నాను. ఆ అల్లాయే చూసుకుంటాడు” అంటూ అబ్దుల్ పైకి చూశాడు

“మీ బాబు పేరేమిటి.. ఏ ఇయర్ లో ఉన్నాడు” కేజువల్ గా అడిగాను.. తన పిల్లవాడి పేరు హమీద్ అని చెప్పాడు అబ్దుల్ ఈలోగా నేను చేరాల్సిన కోఠీ వచ్చేయటంతో మా సంభాషణ కు ఫుల్ స్టాప్ పడింది. మీటర్ 150 అయితే రెండొందలిచ్చాను. యాభై ఉంచుకోమన్నాను.

అతను అంతకంటే మర్యాదగా “షుక్రియా సాబ్” అంటూ యాభై ఇచ్చేశాడు.. ఈలోగా మా కాలేజీ వెహికల్ వచ్చింది నన్ను పికప్ చేసుకోవటానికి..

*******

ఆరోజు సాయంత్రం అబ్దుల్ వాళ్ళబ్బాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు. “అబ్బూ.. నా ఫీజు మా ప్రిన్సిపాల్ కట్టేశారు. మీ నాన్న ఏం చేస్తారు అని అడిగారు. మీ నాన్న కోరుకున్నట్టు బాగా చదువుకో అన్నారు. అబ్బూ మీకాయన తెలుసా?”

కొడుకడుగుతుంటే అబ్దుల్ కు లీలగా వెలిగింది.. పొద్దున్నే ఆటో ఎక్కిన ఆ సార్ తన కొడుకు పేరడగటం గుర్తొచ్చింది.. మనసులో మరోసారి “షుక్రియా సాబ్” అనుకున్నాడు.

– సి. యస్. రాంబాబు

Related Posts