స్మశానం లేని ఊరు

స్మశానం లేని ఊరు

 

ఎక్కడైనా హాస్పిటల్ లేని ఊరు చూసుంటారు, బడి లేని ఊరు చూసింటారు, ఇప్పుడు నేను చెప్పబోయే ఊరిలో మాత్రం స్మశానం లేదు. ఏంది స్మశానం లేదా అని అనుకుంటున్నారా? అయితే రండి వివరాలలోకి వెళదాం.

ఒకరోజు మాకు ఊరి నుంచి కాల్ వచ్చింది, తాతయ్య తమ్ముడు చనిపోయారు, మీరు వెంటనే రండి అని మామయ్య చెప్పారు. సరే అని మేము రాత్రి బయలుదేరాము, ఉదయం 6 గంటలకు అక్కడికి చేరుకున్నాము. కొడుకులు ఏడుపు రాకా కళ్ళను తడుముకుంటున్నారు, అవ్వ మాత్రం తాతయ్యను చూస్తూ ఏడుస్తూ, చివరిసారిగా మాట్లాడిన మాట నువ్వు అన్నం తినుపో అని అన్న మాటని తలచుకుంటూ బాధపడుతూ ఉంది. అది చుసిన నేనూ ఏడ్చాను, ఇంకా బంధువులు ఒక్కొక్కరిగా 9 గంటల వరకు అందరూ వచ్చారు. 

మామయ్య ఊరిలో గొయ్యి తీసేవాళ్లకు కబురు పెట్టారు, వాళ్లు అక్కడ గొయ్యి తీసి శవాన్ని పుడ్చడం కోసం కాసుకొనీ కూర్చున్నారు. ఇంకా ఇంటి దగ్గర అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోని తాతయ్య శవాన్ని స్మశాననికి తీసుకెళ్లడానికి సిద్ధం అయ్యారు. మా సొంత తాతయ్య నన్ను నువ్వు వద్దులే ఇంటి దగ్గరే ఉండు, మేము వెళ్ళగానే ఇంటిని శుభ్రం చెయ్యి అని అన్నారు. సరే అని నేను ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఇంకా ఇంటిని శుభ్రం చేసి పిల్లలకు స్నానము చేయించి, నేనూ స్నానము చేసేలోపు స్మశానంకి వెళ్లిన వాళ్లు అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకొని వచ్చారు.

ఇంకా వాళ్లు స్నానాలు చేసి ఆలా ఫ్యాన్ కింద కూర్చున్నారు. మా పెద్ద మామయ్య ఈ ఊరు చాలా అద్వానం, ఈ ఊరు పెద్ద మనుషులు సరి లేరు అని అన్నారు. ఎందుకు మామయ్య ఆలా అంటున్నావు అంటే, ఈ ఊరు స్మశానం చాలా ఘోరం, ఈ ఊరులో స్మశానం స్థలం కేవలం 5 శవాలకు ఎంత స్థలం కావాల్సివస్తుందో అంతే ఉంది. ఒక్కో గొయ్యిలో నాలుగు, అయిదు శవాలను వేసి పూడుస్తున్నారు, మన టైమ్ బాగులేకా గత రెండు నెలలుగా దాదాపుగా 10 మంది వెంటవెంటనే చనిపోయారు. ఇప్పుడు నడిపి తాతయ్యను వేసిన గొయ్యిలో నాలుగు శవాలు ఉన్నాయంట. తాతయ్యను గొయ్యిలోకి వెయ్యడానికి లోతు సరిపోదు అని గొడవ చేస్తే, అందులో ఉన్న ఒక శవాన్ని పూర్తిగా మన్నులో కలిసిపోనీ శవాన్ని బయటికి మా కళ్ళ ముందే తీశారు.

ఆ శవం నెలనర్ర కిందట వేశారు అంట, ఆ గొయ్యి తీసే వాళ్లు ఇంకా లోతు సరిపోకుంటే చెప్పండి ఇంకో శవాన్ని తీసేస్తాము అని అనడంతో అక్కడికి చివరిసారిగా మన్ను ఇవ్వడానికి వెళ్లిన వాళ్లు బయపడి వద్దులే సామి ఇప్పుడు తీసిన శవమే ఇలా ఉంటే ఇంకా లోపల ఉన్న శవం ఎలా ఉంటుందో అని తొందరగా తాత్తయ్యను గొయ్యిలో వేసి పాతిపెట్టి వచ్చాము అని అన్నారు. నాకు సందేహం వచ్చి, మరి మామయ్య ఈ లోపు వేరేవాళ్లు చనిపోతే అని నేను అడిగితే, ఏముంది తాతయ్యను వేసిన గొయ్యిలో తాతయ్య పైన వేస్తారు అన్నారు. ఈ విషయం విన్నాక నా శరీరం పైన గోగ్గిరిపోటు పోసింది.

ఎక్కడికి పోతుంది ఈ సమాజం? చివరిసారిగా చనిపోయిన వాళ్లకు గుర్తుగా కనీసం ఒక సమాధి లేకపోవడం వింత. నాకు కోపం వచ్చి అటుగా వెళుతున్న ఊరి పెద్దమనిషిని, ఏంటి ఈ ఊరిలో స్మశానం ఇంత దారుణంగా ఉంది, స్మశాననికి స్థలం లేకపోవడం విడ్డురంగా ఉంది అని అడిగితే, ఈ ఊరిలో అన్ని పట్టా భూములే, స్మశాననికి ఒక ఎకరా భూమి ఉంది, దానిని ఆ స్మశానం పక్కన ఉన్న భూమి వాళ్లు కబ్జా చేసి దున్నుకొని పొలం సాగిస్తున్నారు. ఎవరు అడిగే ధైర్యం చేయలేదు, ఎవరన్నా అడిగినా ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని మాటలు మాట్లాడుతున్నారు అని అ పెద్దమనిషి అన్నారు.

చివరిసారిగా పెద్దలకు గుర్తుగా వుండే స్మశానన్ని కూడా మిగల్చకుండా కబ్జా చేసుకోని, బ్రతికున్నపుడు జీవితాన్ని చూసుకుంటున్నారు. కానీ, సచ్చాక వాళ్ళను కూడా పూర్తిగా మన్నులో కలిసిపోకముందే కుక్కశవాన్ని మాదిరి తీసి బయటికి వేస్తారు. వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండదు అని తెలుసుకోలేక, చివరికి నా స్థిరత్వం సమాదే అని ఉన్న నిజాన్ని గ్రహించలేక మా ఊరి మనుసులు కొట్టుమిట్టడుతున్నారు.
భూములు ఎన్ని ఉన్నా భూములు చాలక, స్మశానానికి కేటాయించిన భూములు కూడా తక్కువ వస్తున్నాయి. ఈ ఊరు అనంతపురం జిల్లా, గుత్తికి సమీపంలో ఉంది.

– కళావతి

 

Related Posts