స్వతంత్ర దినం

స్వతంత్ర దినం

 

స్వాతంత్ర దినోత్సవం అంటే అందరికీ పండగ లాగా తెలుసు కానీ. ఆరోజు నా జీవితంలో మొదటిసారి జీవితాంతం బాధ పడేలా చేసింది.

నా పేరు దివాకర్. నేను నల్గొండ దగ్గరున్న చిన్న పల్లెలో చదువుకున్నా… అప్పట్లో బళ్ళు చాలా తక్కువ మా ఊరు నుండి వేరే ఊరికి వెళ్లి చదువుకోవాలి. అంటే, పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని, ఇంత సద్ధి ఉంటే తిని ఉన్న నాలుగు జతల్లో మంచివి వేసుకుని వెళ్ళడమే అది ఆరు కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్లాల్సి వచ్చేది. దాంతో, నాకు ప్రొద్దున లేస్తే హడావుడిగా ఉండేది.

తొమ్మిదో తరగతి వచ్చాక ఇలాగే ఒక స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా బళ్ళో అన్ని కార్యక్రమాలు మా మీద వేశారు. ఎందుకంటే, పెద్ద తరగతి వాళ్ళం అని మీటింగ్ రోజు బల్లలు తేవడం, కాగితాలు కట్ చేసి అంటించడం, లై తయారు చేయడంవంటివి. అన్నీ మా తొమ్మిదో తరగతి పిల్లలం చేయాల్సివచ్చింది. తెల్లారి జెండా వందనం కాబట్టి ఆ పనులన్నీ అయ్యాక, ఇంటికి వెళ్లేసరికి రాత్రి పది అయ్యింది.

అప్పటికి నాకున్న ఒకే జత బట్టలు ఇంట్లో పెట్టి అక్కని ఉతకమని చెప్పి వెళ్ళాను. కానీ, ఇంటికి వచ్చేసరికి నేను పొద్దున ఎక్కడ పెట్టానో అక్కడే అవి ఉండేసరికి చాలా కోపం వచ్చింది. దాంతో అక్క మీద అరిచాను. ఉన్న ఒక్క జత మంచిగా ఉతికి పెట్టీ అంటే పెట్టని అక్క మీద, నా పేదరికం మీద, రేపు బట్టలు లేకుంటే నేను స్టేజీ పైకి వెళ్ళలేనని ఆక్రోశం అన్ని కలగలిపి అక్క మిద ఎప్పుడూ లేనంత గట్టిగా అరిచాను.

మా అక్క పడుకునే ఉంది ఇంతగా అరిచినా కూడా ఏమీ అనలేదు. పైగా, ఒరేయి నాకు ఆరోగ్యం బాగా లేదురా, అందుకే ఏ పని చేయలేకపోయాను. వంట కూడా నాన్న చేశారు.

నాకు ఓపిక లేదు ఏమీ అనుకోకు రా, కాస్త ఈ ఒక్క పని చేసుకో అంటూ చెప్పేసరికి నాకింకా కోపం తన్నుకొచ్చి వెధవకొంప నాకు అంటేనే ఎవరు చేయరు బయట నన్ను అందరూ వేళాకోళం చేస్తారు ,అంటూ కోపంగానే నా బట్టలు నేనే ఉతుకుని అరేసుకున్నా, కోపంగా తినకుండా పడుకున్నా.

అది చూసి అక్క ఆ నీరసంలోనే లేచి అన్నం పెట్టి తెచ్చింది. నాకు కోపం తగ్గక పోవడంతో నేను తినను అంటూ కంచాన్ని నెట్టేసి , ముసుగేసి పడుకున్నా, అక్క నన్ను ఏమీ అనకుండా వెళ్లి పడుకుంది. పొద్దున్నే లేచి హడావిడిగా పనులు అన్నీ పక్కన పెట్టేసి , ఊతుకున్న బట్టలు పచ్చిగా వుండగానే వేసుకుని రెడీ అయ్యి బడికి వెళ్ళిపోయాను.

ఎప్పుడూ అక్కను పిలిచి చెప్పి వెళ్ళే వాడిని. కానీ, ఇప్పుడు కోపంగా ఉన్నాను కాబట్టి చెప్పకుండానే వెళ్ళిపోయాను. అలా వెళ్లిన నేను బళ్ళో మీటింగ్ బాగా జరిగింది. అందరూ నన్ను, నేను చేసిన పనిని బాగా మెచ్చుకున్నారు. నాకు ఉపన్యాసంలో బహుమతి కూడా వచ్చింది. దాంతో, మీటింగ్ అయ్యాక బళ్ళో అన్ని పనులు చక్కబెట్టి , ఇంటికి సంతోషంగా తిరిగి వచ్చిన నాకు ఇంటి ముందు పెద్ద గుంపు కనిపించింది.

నా ఆనందం, సంతోషం గుంపును చూడగానే ఆవిరయ్యింది. నాన్న ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటారు కాబట్టి, నాన్నకు ఏమైందో అనే ఆత్రుతతో ముందుకు నడిచాను. అక్కడ ఇంటి గడప ముందు అక్క శవం గొంతు వరకు చద్దర్ కప్పి తల దగ్గర దీపం పెట్టి కనిపించింది.

నా చేతిలోని బహుమతి కింద పడిపోయింది. అక్కా అంటూ ముందుకు వెళ్ళి అక్కా లే, అక్క ఏమైంది, అక్కా అంటూ గట్టిగా ఏడుస్తూ తనను లేపుతున్నాను. అసలు అక్క చనిపోయింది అంటే నమ్మకం కలగడం లేదు. నాన్న ఓ వైపు మౌనంగా రోదిస్తూ ఉన్నాడు.

నన్ను చూసి పక్కింటి అత్త, వారం రోజులు గా దానికి జ్వరం మీకు చెప్తే గాబరా పడతారని చెప్పలేదు. మొండిగా పనులు చేస్తూ కూలీకి కూడా వచ్చింది. నిన్న అసలు ఓపిక లేక ఇంట్లోనే ఉంది. పాపం ఒక్కరోజు అయినా విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అనుకుంది. కానీ, అది విష జ్వరం లాగా మారి , ప్రాణాలు పోతాయని తెలియదు. నిద్రలోనే పోయింది.

పొద్దున కనిపించకపోతే ఏమైందో చూద్దామని వచ్చిన నేను,  అప్పటికే అంటూ ఏడవసాగింది అత్త. దాంతో, నా బుర్ర గిర్రున తిరిగింది. అంటే నేను ప్రొద్దున వెళ్ళేటప్పటికి అక్క ప్రాణాలు పోయాయా , నేను తనను లేపి ఉంటే పిలిచి ఉంటే, నాకు తెలిసి ఉండేదేమో … కనీసం కాపాడుకోవడానికి ప్రయత్నం చేసే వాడినేమో, అప్పటికి ఇంకా ప్రాణాలు ఉన్నాయేమో….

ఛీ ఎంత చెడ్డ వాడిని నేను తనను అర్దం చేసుకోకుండా నిన్న ఎన్ని మాటలు అన్నాను. కేవలం బట్టలు ఉతకలేదన్న కోపంతో ఏమీ మాట్లాడలేదు గమనించ లేదు కనీసం తనను పరిశీలనగా చూసినా నాకు అర్దం అయ్యేది ఏమో…. 

అక్క. నన్ను చిన్నప్పటి నుండి తల్లిలా పెంచింది. ఎంతో ప్రేమను పంచింది. అక్క ప్రేమ ముందు ఎవరూ పనికి రారు. అలాంటి అక్కను ఎన్ని మాటలు అన్నానో, ఎంతగా బాధ పెట్టి ఉంటానో, తన బాధ అర్దం చేసుకొని నేను ఎంత అల్పున్ని, ఎంత చెడ్డ వాడిని, ఛీ ఇంకా నా బతుకు ఎందుకు? ఈ బతుకు వద్దు నా అక్కలేని జీవితం, ప్రాణాలు నాకు అవసరం లేదని అనుకుంటూ…

బాయి లో పడాలని ముందుకు ఉరికిన నన్ను చుట్టుప్రక్కల వాళ్ళు అపెసి, మీ అక్క పోయిందని నువ్వు కూడా, నీ తండ్రికి కడుపు కోత మిగులుస్తావా? అంటూ నాకు ఎన్నో విధాల నచ్చచెప్పారు.

కూతురు పోయి కుమిలి పోతూ, మనసులో మౌనంగా దుఃఖిస్తున్న నా తండ్రిని చూసి నా బాధ్యతలు గుర్తుకు వచ్చి, నా ప్రయత్నాన్ని విరమించి, అక్కకు అంత్యక్రియలు చేశాను. ఒక్క క్షణం నేను తనను పరీక్షగా చూసి ఉంటే, తనను కాపాడుకునే వాడినేమో అనే ఆలోచన ఇప్పటికీ నన్ను కుదిపేస్తుంది.

భాద్యతలు నన్ను మళ్లీ లోకంలో పారేసినా, ఇప్పటికీ స్వాతంత్ర దినోత్సవం రోజున, లేదా జెండా ఎగురవేసిన రోజున, అక్క నాకు ఆ జెండాలో కనిపిస్తుంది. ఇంతకీ మా అక్క పేరు మీకు చెప్పలేదు కదా అక్క పేరు స్వతంత్ర..

 

దివాకర్

Related Posts