స్వతంత్రం
నేటి భారత దేశ సమగ్ర పరిస్థితిని చూసి వృద్ధుడైన సాయిలు దీర్ఘంగా నిట్టూర్చాడు. అతనికి తన గతం గుర్తుకు వచ్చింది. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు తనతో పాటు తన మితృలు చేసిన సంగ్రామం గుర్తుకు వచ్చింది. భారతదేశం బ్రిటీషు వారి ఆధీనంలో ఉన్నప్పుడు చాలా సార్లు జైలుకు వెళ్ళాడు సాయిలు. అతనిది నిరుపేద కుటుంబం.
రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అతను స్వతంత్ర సమరంలో చురుకుగా పాల్గొనేవాడు. ఎప్పుడూ జైలులో ఉండేవాడు. అతని కుటుంబానికి తినటానికి తిండి ఉండేది కాదు. ఎవరన్నా దయ ఉన్న మారాజులు ఏదైనా ఇస్తే తినటం లేకపోతే వారికి పస్తులే. పోలీసు లాఠీ దెబ్బలు తిని సాయిలు శరీరం రాటు దేలిపోయింది.
అంత కష్టపడి అందరూ కలసి సాధించిన స్వాతంత్ర్య ఫలాలు నేటి తరానికి అందటం లేదని సాయిలు భావన. ఇందుకోసమేనా తామంతా అంత కష్టపడింది. పేద పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య లభించటం లేదు, పేదవారికి ఉచిత వైద్య సేవలు లభించటం లేదు. అందరికీ ఆహారం అసలే అందటం లేదు.
స్వతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా అనుకున్న అభివృద్ధి కనబడటం లేదు అని సాయిలు అనుకుంటూ ఉన్నాడు. అతని భావనలు అందరూ ఏకీవభించకపోయినా కొన్ని విషయాల్లో సాయిలు చెప్పింది నిజమేమో అనిపించక మానదు.
– చలసాని వెంకట భానుప్రసాద్