గాలిపాటొకటి
గాలిపాటొకటి నాన్న తెచ్చిన తాయిలంలా వర్షంతో వచ్చే గాలి అపురూపం అల్లరి మేఘాలను అమ్మలా జోకొడుతుంది ఎండదెబ్బకు శోషొచ్చిన నేలను తడిమే తల్లిదీవెనై చుట్టేస్తుంది వేడిగాలులన్నీ వేయించేయగా ఏసీ గూళ్ళలో దాక్కున్న ప్రాణాలకు ప్రాణనాధుడిలా వేంచేస్తుంది ప్రభాతం భూపాలం కలిసిపోయినట్టు వర్షం, వర్షపు గాలి శ్రుతిలయల్లా కలిసిపోయింటాయి చెక్కుల సంతకాలే కాదు చెట్లపై గాలిసంతకాలనూ వెతుకుతూ ఉండాలి గాలిపాటొకటి నా వెంటే వస్తుంటే వెనక్కి తిరిగాను అమ్మ జ్ఞాపకాలన్నీ నాముందు కుప్పపోసింది - సి. యస్. రాంబాబు