సప్తపది
సప్తపది "అభీ..." బెడ్ పై అస్థిమితంగా కదులుతున్న అభినేత్రి తల్లి పిలుపు విని "ఊ " అంది బద్దకంగా కళ్ళు తెరవకుండానే. "ఏంట్రా.. రోజూ ఈపాటికే లేచి జాగింగ్ కు బయలుదేరిపోయే దానివి.. ఈరోజు ఇంకా నిద్ర మంచం దిగలేదేమిటిరా! ఒంట్లో గాని బాగుండలేదా ఏంటి?" అంటూ కూతురు దగ్గరికి వచ్చి కూర్చొని తలపై చేయి వేస్తూ ఆప్యాయంగా అడిగింది సుమిత్ర. తల్లి స్పర్శ తగలగానే గుండెల్లో ఆవహించుకొని ఉన్న గుబులంతా పటాపంచలు అయినట్లుగా ఏదో ఆహ్లాదకరమైన అనుభూతి. వెంటనే పైకి లేచి ఒక్కసారిగా తల్లి ఒడిలో తల పెట్టుకుని నడుము చుట్టూ చేతులు పెనవేసింది అభినేత్రి. కూతురి చర్యకు సుమిత్ర మాతృ హృదయం ఒక రకమైన పులకింతకు లోనైంది. అదే సమయంలో మనస్సులో ఏదో చిన్న కలవరం! కొద్ది రోజుల్లో తన ఈ అమూల్యమైన పెన్నిధి తనను వదిలిపెట్టి అత్తగారింటికి వెళ్ళబోతున్నదనేదే ఆ కలవరపాటుకి కారణమై కళ్ళు చిప్పిల్లేలా చేసింది.…