తమ్ముళ్ళు ప్రాణ దాతలు 

తమ్ముళ్ళు ప్రాణ దాతలు 

ఇంటికి పెద్ద దాన్ని అంటూ చిన్నప్పుడే పెళ్ళయ్యి వెళ్ళిన నాకు అత్తిల్లు నరకంలా మారింది. అది తెలిసి కూడా నాన్న ఏమీ చేయలేక పోయారు. ఎందుకంటే పరువు పోతుంది అని. కొన్నాళ్ళు అయ్యాక భరించే భర్త కాలం గతిలో కలిసిపోవడంతో అత్తింట్లో ఆదరణ కరువై, సహాయం పేరుతో కాటు వేయబోయిన రాబందుల చేతిలో బలి కాకుండా పుట్టింటికి చేరాను పుట్టెడు దుఃఖంతో.

దుఃఖంతో చేరిన నన్ను నా తల్లి తండ్రి ఏమీ ఆనకపోయినా, చుట్టూ ప్రక్కల వాళ్ళు నన్ను చూడగానే పక్కకు మొహాలు తిప్పుకోవడము, చిన్న చూపు చూడడం చేసేవారు. అవన్నీ చూస్తూ నేను ఇంకా కృంగి, కృశించి పోయాను. అప్పటికి నా తమ్ముళ్ళు లోకం తీరు తెలుసుకుంటూ ఉన్నారు.

అదే సమయంలో నాన్నకి తెలిసిన కొందరు భర్త పోయి తలచెడిన ఆడపిల్లను ఇంట్లో పెట్టుకుంటే దరిద్రం అంటూ మగ పిల్లలకు పెళ్ళిళ్ళు కావంటూ ఏవేవో నూరి పోశారు. వారికి ఎందుకు నా పై అంత పగో అర్దం కాలేదు. అనకూడదు కానీ వారికి పిల్లలు ఉంటే, ఇలా జరిగి ఉంటే వాళ్లను ఇలాగే అనేవారా? ఏమో కానీ, వారి మాటలు విన్న నాన్న మాత్రం నన్ను చంపాలి అనుకున్నారు.

అవును మీరు విన్నది నిజమే, కన్న కూతురిని ఒకే ఒక్క కూతుర్ని కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన కూతురిని, ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని భావించే నా కన్నతండ్రి నన్ను చంపాలి అనుకున్నారు. పరాయి వాళ్ళు చెప్పిన మాటలు ఆయన్ని ఈ పని చేసేలా ప్రేరేపించాయి అనుకుంటాను. తండ్రి ఇలా చేస్తాడా అని అనకండి సాక్ష్యం మా నాన్నగారు ఉన్నారు.

ఒకరోజు అంతకు ముందెప్పుడూ ప్రేమగా మాట్లాడని నాన్న నాతో ప్రేమగా మాట్లాడారు. ఆ కాస్త ప్రేమకే పొంగి పోయాను, నాన్న నా కొడుకుని ఎత్తుకున్నారు. ముద్దు చేశారు. బలి ముందు మేకని ప్రేమగా దగ్గరకు తీసుకున్నట్టు నన్ను ప్రేమగా హత్తుకున్నారు. ఇంకా సంతోషం వేసింది. ఆ సంతోషం వెనక అమలిన ప్రేమకు బదులు విషాన్ని నింపబోతున్నారు అని తెలియలేదు.

ఆ సాయంత్రం నా కోసం అంటూ ప్రత్యేకంగా బిర్యానీ తెచ్చారు. అందరూ అన్నాలు తినాలని కూర్చున్న సమయంలో అక్క కోసం అంటూ బిర్యానీ పాకెట్టు ఇచ్చారు. అంతా ఆశ్చర్య పోయారు. నాన్న ఏంటి అక్క కోసం బిర్యానీ తెచ్చారు అని. కానీ, నేను అందరం తిందాం అంటూ అనేసరికి నాన్న గాబరాగా, వద్దు వద్దు అంటూ అది అక్క ఒక్కదానికే అదే తినాలి అనడం, ఇద్దరూ తమ్ముళ్లకు అనుమానం కలిగేలా చేసింది.

తమ్ముళ్ళు ప్రాణ దాతలు 

నేను మాత్రం ఎలాంటి అనుమానం లేకుండా బిర్యానీ తినాలన్న ఆత్రంతో గబగబా నాలుగు ముద్దలు తినేసాను. కానీ, తింటున్నప్పుడు నాకేదో తేడాగా అనిపించింది. అయినా నాన్న తెచ్చింది కదా అని కొంచం తినేసి నీళ్ళు తాగుతూ ఉండగా, పెద్ద తమ్ముడు ఎందుకు వద్దు అంటున్నావు నాన్న? ఏమైంది తింటే? అంత బిర్యానీ అక్క ఒక్కతే ఎలా తింటుంది? మేము కూడా తింటాం మాకు కావాలి అని నా ప్లేట్ బలవంతంగా తీసుకుంటుంటే.

నాన్న వాడిని కొట్టి వద్దురా, అది అదే తినాలి, అదే తినాలి మీరు కాదు అది బిర్యానీ తినాలి చావాలి, నా ఇంట్లో దరిద్రం అంతా పోవాలి అంటూ అనేసరికి అందరం బిగుసుకు పోయాము.

వెంటనే చిన్న తమ్ముడు ప్లేట్ లాక్కుని వాసన చూసాడు. అక్క నాన్న ఇందులో పురుగుల మందు కలిపాడే అంటూ, నా దగ్గరికి వచ్చి అక్కా అక్కా అంటూ ఏడుస్తూ నా మూతి తుడిచాడు. అప్పటికే నాకు నురగలు వస్తున్నాయి. దాంతో అమ్మ, పెద్ద తమ్ముడు నాన్న కేసి చూస్తూ నాన్న ఏంటిది ? అక్క మనకు దరిద్రం అని ఎలా అనుకున్నావు ? ఎవరి మాటలో విని ఇలా చేస్తావా  ? అంటూ అంబులెన్స్ కి ఫోన్ చేశాడు.

అమ్మ నాన్న ను చూస్తూ, ఏంటయ్యా ఇది కడుపులో పెట్టుకుని చూడాల్సిన బిడ్డను కాటికి పంపి నువ్వేం సాధిస్తావు? నీ ఇంటి లక్ష్మిని పోగొట్టుకుని ఇంకో లక్ష్మిని తెచ్చి ఏం బాగుపడతావు? దానికి ఏదన్నా అయ్యిందో మేమంతా చస్తాం అప్పుడు మీరొక్కరే రాజ్యం ఏలండి అంటూ బాగా తిట్టింది.

అందరూ తిట్టడంతో నాన్న కళ్ళకు కమ్మిన మైకం పోయినట్టు ఉంది. ఏడుస్తూ కూలబడ్దారు. ఇంతలో అంబులెన్స్ రావడంతో నన్ను ఎక్కించారు. ప్రాణాలతో బయటపడ్డాను కానీ నాన్న ఇలా చేశారు అని, చేస్తారు అని నమ్మలేక పోయాను. ఇక ఆ ఇంట్లో ఉండడం మంచిది కాదని, చిన్న బిడ్డను తీసుకుని వేరే ఇల్లు కిరాయికి తీసుకుని, బిడ్డతో పాటు వెళ్తున్న నన్ను నాన్న ఆపేశారు.

కన్నీళ్ళతో తడిసిన కళ్ళను ఒత్తుకుంటూ, నన్ను క్షమించుతల్లీ ,మంది మాటలు విని నిన్ను చంపుకోవాలి అనుకున్నా, దయచేసి ఎక్కడికి వెళ్లకు ఇక్కడే ఉండు, ఇక నిన్ను ఏమీ అనను, నా పిల్లలే నాకు ఆస్తి అని తెలుసుకున్నాను. నాకు శిక్ష వెయ్యొద్దు తల్లి అంటూ బతిలాడారు. కానీ నేను వద్దు నాన్న నీకు భారంగా ఉండలేను అని బయటకు నడిచాను..

అప్పటి నుండి నేను బిడ్డతో వంటలు చేసుకుని బ్రతుకుతున్నాను. కానీ, నా ప్రాణాలు తండ్రి చేతిలో పోకుండా కాపాడిన నా తమ్ముళ్ళు మాత్రం నన్ను అపురూపo గా చూసుకుంటున్నారు. వారికి ఉద్యోగాలు వచ్చే వరకు కొంచం కష్టపడినా, కూడా తర్వాత నన్ను వంట పని మానేయించి తమ ఇంట్లో దేవతలా చూసుకుంటున్నారు.

వారికి నేను ఎంతో ఋణ పడి ఉన్నాను. ప్రతి సంవత్సరం నేను వాళ్లకు నా శక్తి మేరకు కొని రాఖీలు కడుతున్నాను. వాళ్లు లేకుండా నేను లేను. బిర్యానీ తిని ఒకరు, అంబులెన్స్ పిలిచి ఇంకొకరు నా ప్రాణాలు కాపాడిన వాళ్ళు. వాళ్ళు ఎప్పటికీ సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో పచ్చగా కళకలాడుతూ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. నా తమ్ముళ్ళ కుటుంబానికి నేనే పెద్ద దిక్కుగా ఉన్నాను..

ఈ శ్రావణ మాసంలో నా కొడుక్కు, నా తమ్ముని కూతురుకు పెళ్ళి జరగబోతోంది. మీరు ఆశీర్వదించండి.

– వెంకట కస్తూరి

Related Posts