తప్పదిక
కలలన్నీ ఇంకిపోవ
బతుకంతా బెంగ
కలతేమో తీరకుంది
చీకటేమో చుట్టుచేరె
తప్పదిక సాగాలోయ్!
రాత్రంతా కలతనిద్ర
బరువెక్కెను ఙ్ఞాపకాలు
బాటేమో కానరాక
తల్లడిల్లు మనసును
నీవే ఇక సాకాలోయ్
సాకుతు సాగాలోయ్
కుదుపులతో జీవితం
గమ్యాన్ని చేరదిక
కనిపించని శక్తేదో
నిన్నుచేర వచ్చువరకు
తప్పదిక సాగాలోయ్!
పదాలన్ని వెక్కిరించ
కవితేమో కుదరిదంక
ఇంకిపోవు భావనలను
చెదిరిపోవు కలలను
పోగుచేయాలోయ్
ముందుకు సాగాలోయ్!
నీవంక చూడరెవరు
నీవెంట రారెవరు
నీకు నీవు తోడుగా
నీ నీడే వెంటరాగ
సాగాలోయ్..తప్పదిక సాగాలోయ్
తప్పుకాదు వైఫల్యము
ఒప్పుకాదు విజయము
బేరీజుల రివాజుతో
బేషరతుగ సాగాలోయ్
తప్పదిక సాగాలోయ్
– సి.యస్.రాంబాబు