తస్మాత్ జాగ్రత్త!!

తస్మాత్ జాగ్రత్త!!

శరీర సంగమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ….. జీవితాలని సంగ్రామంగా చేసుకున్న జంటలు ఎన్నో! పొద్దంతా అలక పానుపులు, రాత్రి కాగానే పూలపాన్పు.

ఈ కామ దాహం లో కళ్లుమూసుకుపోయి, పిల్లల్ని అశ్రద్ధ కి గురి చేస్తున్న మూర్ఖపు తల్లి తండ్రుల సంఖ్య వేలల్లోనే! ఇలాంటి ఇంట పెరిగిన పిల్లల మానసిక ప్రవృత్తి సక్రమంగా ఉండదు.

వీరిని మానసిక శాస్త్రంలో నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ అంటారు. వీరు తరగతిలోనో, విద్యలోనూ, క్రీడలలోను అధికశాతం వెనుకబడి ఉంటారు.

బెడ్ రూంలు వేరుగా లేకపోతే ఆ భార్యాభర్తలు ఏదో పాపకార్యం చేసినట్టు చింపాంజీ మొహాలు పెట్టే అమ్మ, లయ్యలు ఎందరో ఈ లోకంలో. సంగమ ప్రాప్తికై ఆరాటపడి విడాకులు పొందిన జంటలు ఎన్నో……..!

ఇలా పవిత్ర బంధాన్ని అశ్లీలత గా మార్చి జీవితాలని కుంపట్లు గా మార్చుకున్న కథనాలు కోకొల్లలు.. ఇదో పవిత్ర బంధం. ఈ బంధానికి తీపి గుర్తు మన పిల్లలు.

వీరి ఆలనా, పాలన మన బాధ్యత. వీరిని మరిచి, మన దప్పిక కొరకై పరితపించే వ్యవస్థ మారాలి. అభం శుభం తెలియని పసి మనస్సులను మానసిక క్షోభకు గురి చేయొద్దు.

దయచేసి వారిని మానసిక రోగులుగా మార్చొద్దు. ఇక్కడ నా దృష్టికి వచ్చినా ఓ రెండు విషయాలను మీకు చెప్తాను అండి. ఆ తర్వాత అయినా మారుతుంది ఇలాంటి కామలోకం అని నేను భావిస్తున్నాను.

అదొక విడాకులు పొందిన జంట. పిల్లలు తండ్రితోపాటు ఉంటారు. ఆ పిల్లలకి తల్లి ప్రేమ దూరం. ఇక తల్లికి పిల్లలనే సోయే లేదు. మరి అందుకే విడిపోయింది.

ప్రతిరోజు సాయంత్రం వేళలో ఆ తండ్రికి ఎవరో ఫోన్ చేస్తారు. అది ఒక స్త్రీ గొంతు. ఆ ఫోన్ రాగానే వీడిలో వెయ్యి ఏనుగుల బలం.

అప్పటివరకు పిల్లలతోని ముచ్చటించని వాడు, ఇక ఆ ఫోన్ రాగానే, ‘నాన్న, కన్నా, బుజ్జి’, అంటూ మాట్లాడడం మొదలు పెడతాడు.

ఎందుకంటే మరి వాడు ఆమె వద్దకు వెళ్లాలి. కొన్ని గంటలు పిల్లలు ఇంట్లో ఒంటరిగా గడపాలి. అందుకు వాడి మస్కా.

ఇలానే ఒకరోజు ఫోన్ వచ్చింది. ఆయన కొడుకు ఒక పది సంవత్సరాల లోపే ఉంటాడు అండి. ” ఇక వచ్చింది గా, ఫో… ఇక పో……. ఓవరాక్షన్ చేయకు. మా సంగతి మేము చూసుకుంటాం”.

ఇది ఆ పసి హృదయం మాట్లాడిన తీరు. ఇప్పుడు ఆలోచించండి ఆ చిన్న హృదయం ఎంత వ్యధ చెంది ఉంటుందో.

ఇంకో విషయం చెబుతాను. ఇంటికి వెళ్లే దారి కదా అని నేను ఒకరోజు మా బంధువు ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో నుంచి బూతులు వినబడుతున్నాయి.

ఆ యజమాని ఆ విధంగా పిల్లల్ని అసభ్య పదజాలంతో తిడుతున్నారు. అప్పటికి 8:30 కావస్తోంది. కాస్త సంశయిస్తూనే నేను లోపలికి వెళ్లి కూర్చున్నాను.

నాతో మాట్లాడుతూనే ఆ గొప్ప వ్యక్తి లోపలి నుంచి పరుప, దుప్పట్లు ముందుర గదిలో వేశాడు. అప్పుడు అర్థమైంది అండి నాకు. ఆయన అసహనానికి కారణం.

వారు పడుకుంటే, ఈయన తన పనిచేసుకోవొచ్చు. మరి అది జరగట్లేదు. ఇక, తన అసహనాన్ని బూతులు రూపంలో వెలిబుచ్చాడు.

ఆయన కూతురు ఇంటర్మీడియట్ చదువుతోంది. తన కక్కుర్తి కోసం, పిల్లల్ని మానసికంగా మాటలంటూ హింసించడం అవసరమా….??

ఇలాంటి విపరీత బుద్ధి ఉన్న ఓ తల్లిదండ్రులారా….! మీ కలిసిన శరీరాలకి మీ పిల్లలే సాక్ష్యం. దేశానికి మంచి భవిష్యత్తు ని అందించండి. మానసిక రుగ్మతని మాత్రం కాదు. మీ పిల్లలు మిమ్మల్ని దగ్గరగా పరిశీలిస్తున్నారు.

తస్మాత్ జాగ్రత్త!!!

– వాసు

Related Posts