టీచర్ చీటర్

టీచర్-చీటర్

మొన్ననే గురువుల గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నాం. చాలా మంచి గురువులకు శతకోటి వందనాలు తెలుపుకున్నాము.

కానీ ఈ కాలం లో ఉన్న కొందరు టీచర్స్, అదేనండి చీటర్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ..

గురువు అంటే విద్యాబుద్దులు నేర్పేవారు. మంచి ,చెడూ చెప్పేవారు. విద్యార్ధిని ఒక దారిలో తీసుకుని వెళ్ళేవారు.

గురువుకు చాలా అర్ధాలు ఉన్నాయి. మంచి నేర్పు గురువులు కోకొల్లలు గా ఉన్నారు. కానీ అదే సమయంలో చెడు మార్గాన వెళ్ళేవారు ఉన్నారు.

ఒకప్పుడు టీచర్ అంటే పిల్లలకు మార్గదర్శం గా, ఆదర్శంగా నిలిచారు. టీచర్స్ ను చూస్తూ తాము కూడా అంతగా పేరు తెచ్చుకోవాలని ,

అంత ఉన్నతంగా ఉండాలని కోరుకునేవారు. తాము కూడా టీచర్స్ లా ముస్తాబు అవుతూ, వారిని అనుకరిస్తూ ఉండేవారు .

కానీ ఇప్పుడు గురువు అనే పదానికి మచ్చ తెచ్చేవారు ఎందరో..

పిల్లల్ని తమ పిల్లలుగా భావించి, వారు చెడు మార్గం లో వెళ్లకుండా నీతులు బోధిస్తూ ప్రేమగా చూసుకోవాల్సిన చేతులతో శరీరాన్ని తాకుతూ, అప్పుడే విచ్చుకుంటున్నమొగ్గల్లాంటి మనసులను వికసించకుండా,

చెప్పుకోలేని చోట తాకుతూ, వారి అందాలను వర్ణిస్తూ కవితలు రాసే వారు కొందరు.మార్కులు రావాలంటే ఏకాంత సేవ చేయాలని కొందరు.

నమ్మి తమ బిడ్డను మంచి చదువు నేర్పుతాడు అనుకుని, అతని చేతిలో పెడితే.. వాడు ఆ మృగం తన కూతురు లాగా, ఆ పాప కూడా ఒకరి ఇంటి బిడ్డ అని మరిచి ,

నీకు తెలివి లేదు దాన్ని పెంచాలి అంటే, నీ శరీరాన్ని నాకు పంచాలి అంటూ రకరకాలుగా తన కోరిక తీర్చుకుంటూ, పెళ్ళయ్యి,  ఒక బిడ్డ తండ్రిగా బాధ్యతను మరిచి, కాముకుడు లాగా మారి, జలగ లాగా పట్టి పీడించి , అమ్మాయిని అమ్మను చేస్తాడా ?

సమాజ హితం కోరే ఒక ఉపాధ్యాయుడు, సమాజం లో బతుకుతూ, తనకు అన్నం పెట్టే చేతులని నరకాలని చూస్తాడా ? వాడు చదువుకున్న చదువు సంస్కారం ఎక్కడికి పోయాయి ?

వాడి తల్లిదండ్రులు నేర్పిన విలువలు ఇవేనా ? పది మంది కి నీతులు బోధించే గురువు అయి ఉండి, వీడు చేసిన నీచమైన పని ఇదేనా ?

నీతి, నిజాయితీ, నియమాలు.. కేవలం పుస్తకాలకే పరిమితమా ? హా చదువు నేర్పు గురువులు కూడా కామం తో కళ్ళు మూసుకుని పసిపాప లను నలిపేస్తుంటే ఇంకెక్కడి భద్రత ? ఎవర్నీ నమ్మాలి.

వాడికి ఇంత నీచబుద్ది ఎలా వచ్చింది. కన్నబిడ్డలకన్నా ఎక్కువ గా చూసుకోవాల్సిన విద్యార్థి పై అరాచకం జరిపే ధైర్యం ఎలా వచ్చింది ?

గురువుకు అర్థాన్ని మార్చేసిన ఇలాంటి కొందరు టీచర్లను, ఛీ ఛీ కాదు చీటర్లని వరుసగా నిలబెట్టి కాల్చాలి. అని మనసు కుతకుతలాడుతూoది.

లాయర్ లు, డాక్టర్ లు, ఇంజనీర్లు, కూలీ, ఇలా ఏ వృత్తి లో అయినా మగాడు మగాడే. మృగాడు మృగాడే. ఇలాంటివి చూస్తున్న జనాలు ఇక ముందు టీచర్లను నమ్మి తమ పిల్లలను పంపిస్తారా ? నమ్ముతారా ? తులసి వనంలో గంజాయి మొక్కలా, కడివెడు పాలలో చిటికెడు ఉప్పురవ్వలాంటి ఇలాంటి వెధవ లను నరికేయ్యాలి.

పాపం ఇప్పుడా అమ్మాయి ఏం చేస్తుందో, తనకేం జరిగిందో తెలియక, ఉబ్బిన కడుపులో ఏముందో తెలియని స్థితిలో, అందరూ తనను చూసే జాలి చూపులకు అర్దంకాక,

తన తల్లిదండ్రులు తనను ఎందుకు తిడుతున్నారో తెలియక, జారి పోతున్న గౌనును సర్దుకుంటూ, బిక్క మొహం వేసుకుని చూసే బిత్తర చూపులు చూస్తున్న ఆ తల్లిదండ్రుల మానసిక వేదన, వారి కష్టం ఇంకెవరికి రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుందాం ..

ఇలాంటి మృగాళ్ల అరాచకాలను అంతం చేసే రోజు రావాలని ఇలాంటి వారిని శిక్షించే కఠినమైన చట్టాలు ప్రభుత్వాలు తేవాలని కోరుకుందాం ఆప్పుడైనా ఇలాంటి చీటర్లకు బుద్ది వస్తుందా ?

Related Posts