తేల్చుకోమంటుంది

తేల్చుకోమంటుంది

లాలసలో జీవితం కొట్టుకుపోతోంది
చిరునవ్వుల పెదవులు
కనుల రాయబారాలకు
బేరాల్లేవిప్పుడు
జీవితసారం వంటి పెద్దమాటలన్నీ
పుస్తకాల్లో చేరి ముసుగుతన్నాయి

ఒకప్పుడు ఇల్లు వాణిీ నిలయం
ఇప్పుడు వినిమయ విలయంలో
మోహతిమిరం
మాటల గలగలలన్నీ
మౌనరాగాలై
చరవాణి ఖైదులో బందీలుగా
ఉన్నాయి

ప్రపంచమిప్పుడు కుగ్రామమే కానీ
ఇళ్ళన్నీ ఒంటరి ద్వీపాలు
ఎవరింట్లో వారే కాందిశీకులు
కలలు, కలతల రాగాలకు
సామాజిక మాధ్యమాలే పక్క వాయిద్యాలు
లైకులు, షేర్స్, కామెంట్లే
కన్నీటిని తుడిచే ఆత్మీయ స్పర్శలు

నువ్వు నీ నాస్టాల్జియా చాపల్యమని
విసుక్కున్నా సరే
మంచికో చెడుకో విశ్రాంతి జీవితాలే
ఇప్పుడు విరమణ లేని వాక్యాలై వెలుగుతున్నాయి
వృద్ధాప్యం కావ్యం వెలవెలబోతోంది

ఒంటరితనం, ఒంటరి ద్వీపాల మధ్య
నిరర్థకమై మనసు పరిభ్రమిస్తోంది
కాలమంతే
కుటుంబ బంధాలకు అడ్డుగోడ కడుతూనే
ఎల్లలు లేని సంబంధాలకు
సోషల్ మీడియాతో తాపడం చేస్తుంది
మెరిసేదంతా బంగారమో కాదో నిన్నే తేల్చుకోమంటుంది

– సి. యస్.రాంబాబు

Related Posts