త్యాగానికి మొదటి గుర్తువు…!!!

త్యాగానికి మొదటి గుర్తువు…!!!

కలిసి తిరిగిన స్నేహమా
విడదీయలేని బంధమా…
వెన్నెల గొడుగుల క్రింద కట్టిన
ఇసుక గూళ్ళు…ఆడిన కోతి కొమ్మచ్చి
ఆటలు బురుద గుంటల్లో పట్టిన
చేప పిల్లలు రోజులతో దాటిపోతున్నాయి…

తిరిగిన రోజులు మూగబోయి…
గుచ్చిన గాయాలతో గడిచిపోతు
మరుపురాని విరహాన్ని కాలం ఖైదు చేస్తున్న…
బాధలను మరువాలంటే ఈ దేహానికి తీరని
దుఃఖం అవసరమే ఎందుకో…

తాత్విక చింతనని మనస్సున
ఆలోచనలు రక్తి కట్టించలేక పోతున్నవి…
బంధువు కాని బంధం వేసి పెంచుకొన్న
అనురాగాలు కూలిన శిథిలాలతో విషాద
గీతాలై కలిసి పంచుకొన్న కష్ట సుఖాల
ఫలితాలు కంటికి దూరం అవుతున్నవి…

అడవిన కాచిన వెన్నెల
తెలవారితో కాననని విడిచిపోవునని
ఎంతటి మధుమాసమని పూజించినా
పూచిన పూవులన్ని పెనుగాలికి రాలునని
ప్రాణానికి బదులుగా పలుకే నేస్తమై
సాగేటి అవినాభావ బంధమైనా…
విధి నిర్వహణలో బలికావలసిందేనా…

సుఖ దుఃఖాల సారుప్యతలో
ఎండనకా వాననకా చేయికి చేయని
కలిపిన త్యాగానికి మొదటి గుర్తువు…
అంతులేని ఆనందంతో ఓలలాడాము
కష్టాల అంచులదాకా వెళ్ళొచ్చాము…
కావాలన్నది దాచుకొన్న రోజే లేదు
ఇద్దరి మధ్యన అభిప్రాయాలు
ఎడబాటును కోరుతున్నవి ఎందుకో…
ఇది తెలిసి జరుగుతున్నదా తెలియక పొరబడుతున్నదా తెలియదు…

– దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *