వాన దృశ్యం

వాన దృశ్యం

మేఘాల సామూహిక గానం
నగరాన్ని హర్షంతో తడిపేసింది
ముడుచుకున్న నగరం
బద్దకాన్ని కప్పుకుంది
మినుకుమనే వాహనాలన్నీ
తొందరపడటం లేదు
చినుకులను చప్పరిస్తూ
రీఛార్జ్ అవుతున్నాయి

అడపాదడపా రాలే చినుకులు
చిత్తడినేలతో చిలిపి ముచ్చట్లను చెబుతున్నాయి
మూలనున్న మందార చెట్టు ఆకుపై చినుకు ముత్యం మెరుస్తోంది
దాచుకున్న జ్ఞాపకాల్లా
నేలపై నీటి అద్దాలు తళతళమంటున్నాయి!

పాలపేకెట్ కుర్రాడు
యాంత్రికంగా కదిలాడు
కునుకు వదలిన బైరాగి బీడీ ముట్టించాడు
తోకాడిస్తూ కుక్కపిల్ల ఏదో చెబుతోంది
ముట్టడించిన వాన మందగించేదెప్పుడనా!

చుట్టపు చూపులాంటి వర్షపుగాలి
వచ్చిందంటే చాలు
వేడి కాఫీతో మనసుని వెలిగించి
గతం రోడ్డుని సాఫు చేస్తుంది
వర్షపు చినుకు ఊరికే ఉండనివ్వదు
అనుభూతులను ,అనుభవాలను
కలిపేసి
మనుషులతోపాటు పాటు
నగరాన్ని కూడా ఏకాంత మందిరం చేస్తుంది!

– సి. యస్. రాంబాబు

Related Posts