వడ దెబ్బ
తింటే గారెలే తినాలి అంటారు. కానీ ఆ గారెలైనా ఎక్కువగా తింటే ప్రమాదం సుమీ. మొన్న వినాయక చవితి రోజు రామం ఇంట్లో గారెలు చేసారు. మన రామంకి అసలే ఊబకాయం, దానికి తోడు షుగరు అయినా ఏది పడితే అది తినేయటం ఆ తర్వాత బాధపడటం అతని అలవాటు. ఆ రోజు ఉదయం లేచి పళ్ళు తోముకోగానే ఒక అరడజను వడలు లాగించేసి కాఫీ తాగేసాడు. ఆ రోజు సెలవు కావటంతో అటు వెళుతూ ఒకటి, ఇటు వెళుతూ ఒకటి చొప్పున గారెలు అతని పంటి కింద నలిగాయి.
సాయంత్రం అయ్యేటప్పటికి ఒళ్ళంతా తిమ్మిరి, కళ్ళు తిరగటం మొదలయ్యేటప్పటికి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. డాక్టర్ “ఉదయం నుంచి ఏమి తిన్నారు” అని అడిగారు. రామం తాను వడలు తిన్నాను అని చెప్పాడు.” ఎన్ని వడలు తిన్నారు” అని డాక్టర్ అడిగాడు. రామం చెప్పడానికి సిగ్గు పడ్డాడు. అయినా డాక్టర్ వత్తిడితో చెప్పాడు. “మీకు వడదెబ్బ తగిలింది” అన్నాడు డాక్టర్ నవ్వుతూ. వానా కాలంలో వడదెబ్బేంటి డాక్టర్ అడిగాడు రామం అమాయకంగా. “డజనుకి పైగా వడలు తింటే ఎలాగండీ. మీకు ఊబకాయం, పైగా షుగర్ కూడా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి” అన్నాడు డాక్టర్.
నిజమేకదా. ఊబకాయం ఉన్నప్పుడు ఏదిపడితే అది తినేయకూడదండీ బాబూ…..
– వెంకట భానుప్రసాద్ చలసాని