వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!!! (భాగం -5)

వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!!! (భాగం -5)

వీరిద్దరూ ఆ శాల్తీ తో క్రికెట్ ఆడుతున్నప్పుడు అగుపించిన పోలీసు జీపు నేరుగా వచ్చి అదే గుడిసె ముందు ఆగింది.

**********

జీపు ఆపి, ” రేయ్, బాబు, ఇటు రా ” అని పిలిచాడు డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆఫీసర్.

“గుడ్ ఈవినింగ్ సర్” అంటూ దగ్గరికి వచ్చాడు ఆ నల్లని శాల్తీ.

“నీ పేరు ఏమిటి? నువ్వు, ఆ బండి మీద వెళ్లిన ఇద్దరూ ఫైటింగ్ చేశారు కదూ…..!” అని అడిగాడు అధికారి.

“నా పేరు లక్ష్మణ్ సార్. మేము బచపన్ కా దోస్తులం సార్. వొట్టిగానే మజాకులాడినం, సార్. నేను వాడి వీపు మీద ఒకటి గట్టిగా సర్సిన నవ్వులాటలో. ఎండకి సుర్రు అన్నట్టుంది వాడి వీపు పాపం.” చెప్పాడు లక్ష్మణ్.

“మరి, నీ పెదవిపై ఆ రక్తం ఏంటి?” అడిగాడు అధికారి.

“గదే సార్, నేను వీపుపై కొట్టేసరికి, వాడికి నిజంగానే తిక్క లేచింది, నా మూతి పైన బౌలింగ్ చేసిండు.” చెప్పాడు లక్ష్మణ్.

“సరే ఇంకోసారి ఆడుతూ కనబడితే బొక్కలో పెడతా”

“అట్లనే సార్. రేపు కాలేజీ లో మాట్లాడుకుందాం అని చెప్పడానికి నా దగ్గరికి వచ్చిండ్రు.” అన్నాడు లక్ష్మణ్.

“సరే” అంటూ ముందుకు పోనిచ్చాడు డ్రైవ్ చేస్తున్న ఆఫీసర్.

 

****************

 

జీపు లో నుంచి మొత్తం ఆరుగురు అధికారులు దిగి గుడిసెలోకి వచ్చారు.

“అవ్వ, ఆరు స్పెషల్ చాయ్ చెయ్యి. కాస్త, అల్లం వేసి ఘాటుగా పెట్టు.” అన్నాడు డ్రైవింగ్ చేసిన అధికారి.

“గట్లనే దొరలు, కూర్చోండి ఆడ. అగ్గి ఇరగ మండుతోంది. క్షణాల్లో ఛాయ పెడతా.” అంటూ అవ్వ వారికి కూడా కుండలో నుంచి చల్లటి నీళ్ళు తీసి ఇచ్చింది.

వాసు, ఆనంద్ వీరిని గమనించనట్టు వాళ్ళ మధ్య జరుగుతున్న చర్చను ఆపకుండా కొనసాగిస్తున్నారు. ఇంతలో చాయి సిద్ధం చేసి ఆ ఆరుగురు అధికారులకు గ్లాసులు అందించింది అవ్వ..

డ్రైవింగ్ చేస్తున్న అధికారం మాత్రం పేపర్లో లీనమై మధ్య, మధ్యలో చాయ్ సిప్ చేస్తున్నాడు. మిగిలిన ఐదుగురు చాయి తాగేసి వెళ్ళి జీపులో కూర్చున్నారు. గుడిసె లో ఒక్కడే మిగిలిపోయిన అధికారి పేపర్ పక్కకి పెట్టి వీరిద్దరిని పలకరింపుగా చూసి నవ్వాడు.

“ఆ, చూశాను, ఇందాక మీరు వాడితో ఫుట్ బాల్ ఆడుకున్నప్పుడు.” అన్నాడు ఆయన.

వాసు, ఆనంద్ కాస్త ఖంగుతిన్నారు. బిక్క మొహాలు పెట్టకయినా, కాస్త అమాయకత్వం కవళికలను అరువు తెచ్చుకున్నారు.

“అవును సార్. క్రికెట్ ఆడాము.” అతి వినయంగా చెప్పాడు ఆనంద్.

“అది క్రికెట్టో, ఫుట్బాలో ఏదైతే ఏంటి గాని…. చూడ్డానికి ఇద్దరూ ముచ్చటగా ఉన్నారు. పైగా కాలేజీ స్టూడెంట్స్ లా కనిపిస్తున్నారు.” అన్నాడు అధికారి.

“అవును సార్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాము” చెప్పాడు వాసు.

“ఓకే, ఇట్స్ నైస్. మరి ఈ ఆటలు ఎందుకు? ఇద్దరిలో తెలివితేటలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. చక్కగా చదువుకుని వృద్ధిలోకి రండి.” అన్నాడు అధికారి.

“అలాగే సార్” అంటూ అమాయకంగా తలాడించారు ఇద్దరూ.

అధికారి లేచి షర్ట్ జేబులోనుంచి అవ్వకి పైసలు ఇవ్వబోయాడు.

“అంకుల్, మేము పే చేస్తాం.” అన్నాడు వాసు.

“నో, మై బాయ్స్. అవ్వ, వీరిద్దరి ఛాయలతో కలిపి ఎంతో చెప్పు పైసలు.” అన్నాడు ఆ పోలీస్ ఆఫీసర్.

“24 రూపాయలు,, దొర.” అంది అవ్వ.

డబ్బులు అవ్వకి ఇచ్చేసి ముందుకెళ్లాడు ఆయన. మళ్లీ ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చాడు.

“మీరు నాకు నచ్చారు. చిన్నప్పుడు నేను మీలానే క్రికెట్, ఫుట్బాల్ ఆడేవాడిని. పెదవులను ఒక పక్కకి సాగదీసి మురిపంగా నవ్వుతూ, జాగ్రత్త, నా నేస్తాలు” అంటూ వెళ్లి తన డ్రైవింగ్ సీట్లో కూర్చుని జీపుని ముందుకు తీసుకెళ్ళాడు.

“బిడ్డలూ, గా దొరలు ఏమో మీరు ఆడింది ఫుట్బాల్ అంటుండ్రు, మీరేమో క్రికెట్ అంటుడ్రు . ఇంతకీ మీరు ఏం ఆడింర్రు?” ఉత్సాహంగా అడిగింది అవ్వ.

“మేము ఆడిన ఆట కి ఏ పేరైనా పెట్టొచ్చు, అవ్వ, చెడుగుడు’ అని కూడా పిలవచ్చు.” కొద్దిగా చిలిపిగా సమాధానమిచ్చాడు వాసు.

“గట్లనా………..” అయితే నేను ఒక పేరు పెడతా మీ ఆటకి” అంది అవ్వ.

వీరిద్దరిలో ఉత్సాహం శిఖర స్థాయికి చేరింది. “చెప్పవ్వ, చెప్పు” అంటూ ఇద్దరూ ఏక కంఠంతో అడిగారు.

“కాసేపు ఆలోచిస్తూ……. లోలోన ముసి ముసి గా నవ్వుకుంటూ, ఆ, గుర్తొచ్చింది బిడ్డలు.” అంది అవ్వ

“చెప్పు, చెప్పు” అన్నాడు ఆనంద్.

“గదే బిడ్డ మల్లయుద్ధం” అంది బిగ్గరగా నవ్వుతూ అవ్వ.

వాసు, ఆనంద్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఒకరి మొహం ఒకరు బిత్తర గా చూసుకున్నారు. అంటే, అవ్వ చూసిందా మనల్ని అని అనుకున్నారు.

ఇంకా ఉంది…..

– వాసు

Previous post పిడుగు
Next post పంచాంగము 29.04.2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *