వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!! (భాగం -1)

వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!! (భాగం -1)

విశాలమైన క్రీడా మైదానము. ఒక ప్రక్క ఆహ్లాదంగా తీర్చిదిద్దిన పూదోట. దాన్ని ఆనుకొని అన్ని హంగులతో ఏర్పాటు చేయబడిన ఈతకొలను. ఆ క్రీడ మైదానానికి హృదయ స్థలంలో నడుపబడుతోంది ఒక డిగ్రీ కళాశాల.

వాసు, ఆనంద్ ఇద్దరు మంచి స్నేహితులు. విరామసమయంలో స్నేహితులు అందరూ కలిసి క్రికెట్ ఆడడం వారికి అలవాటు. ఇది వారి దినచర్య.

అందరూ పైసలు జమ చేసుకొని క్రికెట్ బ్యాట్ కొనేవాళ్ళు ఆ రోజుల్లో. 150 రూపాయలు వెచ్చించి బ్యాట్ కొనాలంటే గుండెలు ఆవిరైపోయేవి . ఒకరి డబ్బే కాదు కాబట్టి ధైర్యంగా బ్యాట్ కొట్టేవాళ్ళు.

ఆనంద్ మంచి పేస్ బౌలర్. చూడ్డానికి సన్నగా ఉన్నా, వాడికి అంత విసురు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ అర్థమయ్యేది కాదు. అందరం ఆశ్చర్య పోయే వాళ్ళం.

‘ఇప్పుడు బౌలింగ్ ఆనంద్ ది’, అని వినగానే ముందు స్ట్రైకర్స్ గార్డ్ కోసం అటూ ఇటూ వెత్తుకునే వారు. వాడి బౌలింగ్లో గార్డ్ లేకపోతే ఇక అంతే…..!

ఇలా సరదాగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ, చాలా రోజుల నుంచి వారిని ఒక రెండు జెళ్ళ సీత కిటికీలోంచి చూస్తోంది. వీరు గమనించలేదు.

రెండు జడలు, లంగా, వోణి, జాకెట్టు ఈ కట్టుతో చూడడానికి దివి నుంచి దిగి వచ్చిన అప్సరసలా ఉండేది.

వాసు మరియు ఆనంద్ కాలేజీలో ఆలస్యంగా ప్రవేశం పొందారు. కానీ అప్పటికే ఉన్న సీనియర్స్ అంతా వీరికి చిన్ననాటి స్నేహితులు. ఈ రెండు జెళ్ళ సీత ని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు..

అలానే యథాప్రకారం ఆ రోజు కూడా వీళ్ళు ఆట మొదలు పెట్టారు. బౌలర్ ఆనంద్. స్ట్రైకర్ వాసు. ఇంకేంటి గార్డ్ ధరించి చేశాడు వాసు. ముందు జాగ్రత్త చర్య మరి.

ఆనంద్ చిరుతపులిలా పరుగులు పెడుతూ బాల్ ని వికెట్స్ పైకి విసిరాడు. వాసు దాన్ని అవలీలగా బాది బౌండరీకి తరలించాడు. చిరుతకి చిత్తరువు అయ్యే.

వాసు ది బ్యాటింగ్ చూసి మాత్రం కాదు. కిటికీ లోనుంచి వీరి ఆట గమనిస్తూ ఈల వేసే అంత పని చేసిన ఆ రెండు జెళ్ళ సీత ని చూసి.

ఆనంద్, “ఒరేయ్, మనము ఆడుతుంటే, ఒక అమ్మాయి మనల్ని గమనిస్తోంది.” అన్నాడు. కాలేజీ కి కొత్త కాబట్టి ఆమె ఎవరో ఈ ఇద్దరికీ తెలీదు.

“ఎలా ఉంది?” అడిగాడు వాసు.

“అతిలోక సుందరి లా ఉంది” అన్నాడు ఆనంద్.

” సరే రోజూ ఆడదాం. కానీ, ఆమెని పట్టించుకోనట్టు నటిద్దాం .” అన్నాడు వాసు.

********

అప్పుడే మార్కెట్ లోకి టీవీఎస్ సుజూకీ వచ్చింది. అప్పటివరకు జావా, యజ్దీ లాంటి భారీ ఐన వాహనాలు మాత్రమే తెలుసు. ఈ బండి నాజూకుగా సీత మాదిరిగా ఉండడంతో దాన్ని కొనేశాడు వాసు. ఇక షికార్లే షికార్లు.

కాలేజీ గ్రౌండ్ అంతా చక్కర్లు.. పోటీపడి అందరూ నేర్చుకున్నారు ఆ బండి నడపడం. ఇలా వీరిద్దరూ రోజూ బండి పై రావడం మొదలుపెట్టారు.

సాయంత్రం నాలుగు గంటల తరువాత రోడ్లన్నీ చుట్టేయడం వీరిద్దరికీ పరిపాటి అయ్యింది.

*********

“ఆ అబ్బాయిని పిలవండి” రెండు జెళ్ళ సీత గొంతు.

“ఎవరు?” స్పందించాడు రామన్న.

“అదిగో…… అతనే” అంది.

“కనుబొమ్మలు ఎగరేస్తూ ఎవరు?” అన్నాడు సంపత్.

“అదే ఆ ఎర్రటి శాల్తీ” అంది రెండు జెళ్ళ సీత.

” ఒరేయ్, వాసు, అదిగో, ఆ అమ్మాయి పిలుస్తోంది” వాసుకి చేరవేశాడు విషయం దుర్గేష్.

“దగ్గరికి వెళ్లి ఏంటి?” అన్నాడు వాసు.

“ఏమి చెప్పకుండానే, బ్యాగ్ లో నుంచి లంచ్ బాక్స్ తీసి, కిటికీలోనుంచి చేయిచాచి, దాన్ని వాడి చేతిలో పెట్టింది.”

“ఏంటిది?” అడిగాడు వాసు.

“ఉప్మా” చెప్పింది అమ్మాయి.

“ఏం చేయాలి?” అడిగాడు వాసు.

“ఏం చేస్తావ్, తిను.” అంటూ కోపంగా వెళ్లిపోయింది రెండు జెళ్ళ సీత.

సాయంకాలం పూట వాళ్ళ కంపెనీ బస్సు కాలేజీ ముందు ఆగేది. ఆ బస్సు రోజూ ఆగడం ఆమె బస్సు ఎక్కి వెళ్లడం వీరు గమనించారు. బస్సు రాని రోజుల్లో ఆమె అడ్డదారి గుండా నడిచి వెళుతూ ఉండేది.

పాపం ఆ రోజు బస్సు రాలేదు. రెండు జెళ్ళ సీత నడుస్తూ వెళ్ళిపోయింది. వీళ్ల లోకం వీళ్లది. ఎవరెటు పోతే మాకేంటి అనేది వీరి ధోరణిని. ఇంతలో ఆనంద్ పరిగెత్తుకుంటూ వాసు దగ్గరికి వచ్చాడు.

“ఒరేయ్, ఆమె బస్సు రాలేదు.” అన్నాడు.

“అయితే ఏంటి?” అన్నాడు వాసు.

” తీయరా బండి అడ్డ గాడిద” అన్నాడు కోపంగా ఆనంద్.

“బండి కిక్ కొట్టాడు”, వాసు.

అందరికీ, ‘సి యూ టుమారో’, అంటూ రివ్వున బండి పై దూసుకెళ్లారు ఇద్దరూ….

– వాసు

Related Posts