వైఫల్యం

వైఫల్యం

ఇంజనీరింగ్ అయిపోయింది. ఇక ఉద్యోగాల వేటలో పడాలిరా మామా.. అవును నువ్వు సొంతంగా ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటున్నావట ఏంట్రా అది అన్నాడు జగదీష్. అవును రా నేను బిజినెస్ చేస్తాను అనుకోవడం నిజమే కానీ పెట్టుబడి ఉండాలి కదా మా ఇంట్లో మాత్రం ఉద్యోగం చేసుకో అంటున్నారు వారి నుండి సపోర్ట్ లేదురా అన్నాడు కిరణ్ బాధగా.

అవునురా అదీ నిజమే మనపై మన స్నేహితులకు మన తోటి వాళ్ళందరికీ నమ్మకం ఉంటుంది కానీ మన ఇంట్లో వాళ్ళే మనల్ని నమ్మరు అన్నాడు జగదీష్ కూడా. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారా అంటూ అడిగాడు స్వామి. అదే అర్థం కావట్లేదురా ఏం చేయాలో ఎవరి సాయం లేకుండా నేను ముందుకు పోలేను కదా అని అన్నాడు కిరణ్ బాధగా… అవును రా మేము కూడా ఏదైనా సాయం చేయాలనుకున్నా ప్రస్తుతానికి మాకు ఇంకా ఉద్యోగాలు ఏమీ రాలేదు కదా మాకు ఏమైనా ఉద్యోగాలు వస్తే ఏదో ఒక సహాయం చేసే వాళ్ళం అన్నాడు జగదీష్ బాధపడుతూనే…

అరేయ్ నువ్వు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నావు కదా నేను అప్పు ఇప్పిస్తాను నువ్వు తీర్చగలవా అన్నాడు స్వామి కిరణ్ భుజం తడుతూ…. తీరుస్తాలే కానీ ముందు అప్పు ఇప్పించరా అంటూ బతిలాడాడు స్వామితో కిరణ్. సరేరా మా మామయ్య ఫ్రెండ్ ఒకరు ఉన్నారు అతను వడ్డీకి డబ్బులు ఇస్తాడు నీకు ఎంత కావాలి చెప్పు అంటూ అడిగాడు. నాకు ఒక రెండు లక్షలు కావాలిరా అంటూ చెప్పాడు కిరణ్.

సరే ఆ రెండు లక్షలతో ఏమి బిజినెస్ స్టార్ట్ చేస్తావ్ అని అడిగాడు. ఏం లేదురా నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందులోనూ హైబ్రిడ్ చెట్లను పెంచాలని నా చిరకాల కోరిక, ఆశయం కూడా అదే వాటిని మన దేశంలో మన దగ్గర పండించి వేరే దేశాలకు ఇంపోర్ట్ చేయాలనేది నా లక్ష్యం అన్నాడు కిరణ్. ఏంటి ఇంత చేసి నువ్వు వ్యవసాయం చేస్తా అంటావా నేను ఇంకేదో బిజినెస్ అనుకున్నా కదరా అయినా మనం రైతుల గురించి చూస్తూనే ఉన్నాం కదా ఇంత చదువుకొని మళ్ళీ అదే వ్యవసాయం లోకి వెళ్తాను అంటావే అంటూ అన్నాడు జగదీష్ స్వామి ఇద్దరు ఒకేసారి ముక్తకంఠంతో.

అరే అందరం ఇలాగే చదువుకొని ఉద్యోగాలు పట్టిపోతే మనకి అన్నం పెట్టే రైతన్న ఎక్కడ ఉంటాడురా ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని విదేశాల దారి పడుతూ ఉద్యోగాలు చేస్తుంటే పంటలు పండించేది ఎవరు ఇప్పటికే సగానికి సగం వ్యవసాయం తగ్గిపోయింది ఇక మనం కూడా మానేస్తే మన ముందు తరాలకు అన్నమంటే ఎలా ఉంటుంది అనేది మ్యూజియంలో పెట్టి చూపించాలి ఏమో అందుకే నేను ఇది నిర్ణయం తీసుకున్నాను అన్నాడు కిరణ్.

ఆ మాటలు విన్న ఇద్దరూ కూడా ఆలోచనలో పడ్డారు నిజమే తమ ఊరిలో చుట్టుపక్కల ఊర్లలో జరుగుతున్న ఆత్మహత్యలు రైతుల పొలాలను ఫ్యాక్టరీలకు అమ్మేయడం అంతా ఒక్కసారిగా గుర్తొచ్చి నిజమే అనిపించింది దాంతో స్వామి అరే కిరణ్ నీకు నేను వడ్డీకి కాకుండా మామూలుగా రెండు లక్షల అప్పు ఇప్పిస్తాను వ్యవసాయం చెయ్యి అన్నాడు నేను నీకు ధీమాగా ఉంటాం ఏ సహాయం కావాల్సి వచ్చినా మేము చేస్తాంరా అన్నారు ఇద్దరు.

ఆ వెంటనే పనులు చక చక జరిగిపోయాయి. స్వామి, కిరణ్, జగదీష్ ముగ్గురు కలిసి వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్లడం వాళ్ళ మామయ్యకి విషయం చెప్పి డబ్బులు అప్పుగా తీసుకోవడం జరిగిపోయింది. కిరణ్ వాళ్ళ పొలంలోనే ఒక ఎకరం పొలాన్ని నేను తీసుకుంటాను అంటూ అడిగాడు తండ్రిని కిరణ్ సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో కానీ పైసా కూడా ఇవ్వను నేను అన్నాడు తండ్రి సరే నాన్న నువ్వు ఇవ్వకపోయినా సరే అంటూ కిరణ్ తను తెచ్చిన పెట్టుబడితో కొన్ని మొక్కలు కొని ఆ పొలంలో వేశాడు వాటిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.

కానీ మన వాతావరణానికి పంటలకు ఆ హైబ్రిడ్ మొక్కలు బ్రతకలేక కొన్ని మంచిగా పెరిగితే మరికొన్ని చనిపోయాయి పెట్టిన పెట్టుబడి కూడా ఏమీ రాలేదు ఈ విషయం చూసి ఎవరు హర్షించలేదు కూడా అందరూ లేనిపోని తంట నెత్తిన పెట్టుకున్నాడు అంటూ అందరూ వెక్కిరించారు. ఈలోపు జగదీష్ స్వామి లకు ఉద్యోగాలు దొరికాయి..

ఇంట్లో ఉన్న వాళ్ళు సైతం అంటే తల్లిదండ్రులు అన్నాతమ్ముళ్ళు మిగిలిన వాళ్ళంతా వాళ్ళను సాకుగా చూపించి చూడు నీ తోటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు నువ్వేమో వ్యవసాయం అంటూ ఇక్కడే వేలాడుతున్నావు మంచిగా వెళ్లి ఉద్యోగం చేసుకో అంటూ మాటలు చెప్పడం ఆరంభించారు. కిరణ్ జగదీష్ స్వామిలను కలిసి విషయమంతా చెప్పాడు మనం పైసల్యం చెందినంతమాత్రాన ఏమీ కాదు మనం ఏదైనా అనుకుంటే దాన్ని పూర్తిగా నేర్చుకోగలిగినప్పుడు చేయగలిగినప్పుడే మనం గట్టిగా నిలబడగలగాలి అని అన్నాడు.

అందరూ అలా అంటుంటే నువ్వు మాత్రం నీ ధైర్యాన్ని కోల్పోవద్దు ఇప్పుడేం చేయాలనుకుంటున్నారా అంటూ అడిగారు. అరే ముందు అయితే మీ మామయ్య దగ్గర తీసుకున్న అప్పు తీసేయాలి కాబట్టి నాకు ఏదైనా ఉద్యోగం చూపించండిరా అంటూ అడిగాడు కిరణ్. సరే మా ఆఫీస్ లోనే కాళీ ఉంది నీకు వచ్చిన పర్సంటేజ్ కి ఈజీగా జాబ్ వస్తుంది పద నిన్ను మా ఎండి గారి దగ్గరికి తీసుకు వెళ్తాం అంటూ అదే రోజు ఎండి గారి దగ్గరికి తీసుకువెళ్లారు.

అతని సర్టిఫికెట్స్ అన్ని చూసినా ఎండి తనకి జాబ్ ఇస్తున్నట్టుగా చెప్పాడు. ఏమయ్యా ఇంత టాలెంట్ ఉంది వ్యవసాయం అంటూ ఇంకా పల్లెటూర్నే పట్టుకొని వేలాడుతున్నావా అంటూ నవ్వాడు కూడా అయినా కిరణ్ మౌనంగా భరించాడు. అలా రెండేళ్లు గడిచిపోయాయి ఈ రెండేళ్లలో కిరణ్ ఉద్యోగం చేస్తూ స్వామి వాళ్ళ మామయ్య దగ్గర తీసుకున్న అప్పు మొత్తం తీర్చేశాడు ఆ తర్వాత ఏ రకమైన మొక్కలు అయితే మన నేలలో పెరుగుతాయో వాటికి ఏమేమి అవసరం అనేది అంతా నేర్చుకున్నాడు పుస్తకాల ద్వారా అంతర్జాలం ద్వారా అన్ని రకాల విషయాలు నేర్చుకున్నాడు.

అప్పు తీర్చేసిన తర్వాత కూడా ఒక రెండేళ్లు గట్టిగా ఉద్యోగం చేసి ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా తీసుకుంటూ అలా జీతం పెంచుకుంటూ పోయాడు వచ్చిన డబ్బంతా బ్యాంకులో వేస్తూ తన అవసరాలు కేవలం తన అవసరాలకు మాత్రమే ఉంచుకుంటూ డబ్బంతా పోగు చేసుకున్నాడు.

***********

ఒక సంవత్సరం తర్వాత ఇండియా టుడే పుస్తకంపై కిరణ్ చిత్రంతో పాటు అతని గురించిన ఒక వ్యాసం వచ్చింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఉత్తమ రైతుగా ఉన్నతమైన ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేసి దేశంలో మంచి రైతుగా ఎన్నో రకాల ఉచిత హైబ్రిడ్ విత్తనాలు తయారు చేయడంలో అలాగే వ్యవసాయంలో గల లోటుపాట్లను గురించి ఒక పుస్తకం కూడా కిరణ్ రాశాడు అది సీఎం చేతుల మీదుగా విడుదల అయింది.

ఈ విషయం విన్న ఇంటి వాళ్ళు ఊరి వాళ్ళు అతని ఆఫీసు ఎండి అందరూ ఆశ్చర్యపోయారు తమ దగ్గర మామూలు మనిషిలా పనిచేసిన కిరణ్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారాడు. యువరైతు అనే బిరుదు కూడా పొందాడు. తను అనుకున్న లక్ష్యం సాధించి తన కల నెరవేర్చుకున్నాడు.

మన ఆశయ సాధనలో ఒకసారి వైఫల్యం పొందాము అని చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతారు కానీ మరోసారి ప్రయత్నించరు కానీ కిరణ్ అలా కాకుండా ఒకసారి వైఫల్యం పొందిన కూడా మరోసారి తన స్వశక్తిని నమ్ముకుని తన లక్ష్యాన్ని సాధించాడు.

అందరికీ ఇలాంటి స్నేహితులు బంధువులు అప్పటికప్పుడు ఉద్యోగాలు ఇచ్చే ఎండీలు ఉండకపోవచ్చు కానీ మనిషి తలుచుకుంటే దేన్నైనా సాధించవచ్చు అది తనపై తనకు ఉన్న నమ్మకం బట్టి ఉంటుంది అలాగే తన అనుకున్న లక్ష్యం కూడా బలంగా కూడా ఉండాలి.

– భవ్య చారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress