వాలు జడ తోలు బెల్టు

వాలుజడతోలుబెల్టు

వాలుజడతోలుబెల్టు

 

ఈ అంశం చూడగానే నాకు కొన్ని సంఘటనలు గుర్తుకు వచ్చాయి అవి మీతో పంచుకోవాలని రాస్తున్నాను. చిన్నప్పుడు మా అమ్మగారికి చాలా పెద్దగా వెంట్రుకలు ఉండేవట మా అమ్మగారికి ఒక్కరికే కాదు వాళ్ళ చెల్లెలు కూడా అంటే మా చిన్నమ్మలు వారికి కూడా చాలా పెద్ద జడలు ఉండేవట.

దాంతో వాళ్ళ  అయిదు గురికి మా అమ్మమ్మ జడలు వేయలేక పోయేదట. అయితే ప్రతి ఆదివారం మా తాతమ్మ వీళ్ళ ఐదుగురిని తీసుకొని చెరువుకు వెళ్లి, అక్కడ వీళ్ళకి సబ్బుతో తల స్నానం చేయించేదంట. ఆ తర్వాత అక్కడే వాళ్ళ జుట్టు అంతా ఆరే వరకు కూర్చోబెట్టుకొని, వెళ్లేటప్పుడు తీసుకువెళ్లిన అన్నాన్ని వీళ్ళకు తినిపించి,

జుట్టు ఆరిన తర్వాత ఓపికగా కూర్చుని ఒక్కొక్కరిని పిలిచి జడలు వేసేదట, మళ్లీ వచ్చే ఆదివారం వరకు ఎవరు జడలు విప్పవద్దు అని గట్టిగా రిబ్బన్లు కట్టేది అట. వీళ్లు కూడా రోజు అమ్మ జడ వేయదు కాబట్టి అవి అలాగే జాగ్రత్తగా ఉంచుకొని రాత్రుళ్ళు నిద్రలో అటు ఇటు పోర్లకుండా  పడుకునే వారట. మిగిలిన రోజుల్లో బడికి వెళ్ళేటప్పుడు పైపైన జుట్టు దువ్వుకుని వెళ్లిపోయేవారట.

అప్పట్లో చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేవారు కాబట్టి  వాళ్ళ  చిన్నమ్మలు అంటే మా అమ్మమ్మలు కూడా మా అమ్మ వయసు వారే ఉండడంతో తర్వాత కాలం లో ఒకరికొకరు జడలు వేసుకునే వారట. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ల చిన్నమ్మలకి ఇంకా పెళ్లిళ్లు కాలేదట.

మా అమ్మగారి ఐదో తరగతిలో ఒక చిన్నమ్మకు పెళ్లి అయి వెళ్లిపోయారట. ఆ తర్వాత ఇంకొక చిన్నమ్మ కూడా పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో జడలు ఎలా వేయాలో వాళ్ళ దగ్గర నేర్చుకున్న మా అమ్మ పిన్ని వాళ్ళు ఒకరికొకరు జడలు వేసుకునే వారట.

అయితే మా తాతమ్మ ఈ ఐదుగురు పిల్లల్ని తీసుకొని చెరువుకు వెళ్లడం మా తాత గారికి నచ్చేది కాదట, దాంతో వచ్చిన తర్వాత మా తాతమ్మను తెగ కొట్టేవారట. ఎందుకు తీసుకువెళ్లావు నువ్వు బయటకు ఎందుకు వెళ్లావు అని, అయినా సరే మా తాతమ్మ మళ్లీ మా అమ్మ వాళ్ళను మరో ఆదివారం అలాగే తీసుకొని వెళ్లి తాను ఉన్నన్ని రోజులు జడలు వేసేదట.

*********

తర్వాత వీళ్ళు పెద్దగా అవడంతో పాటు చిన్నమ్మలు కూడా సహాయం చేయడంతో తాతమ్మ చెరుకు వెళ్లడం స్నానం చేయడం తగ్గించింది అట, చిన్నప్పుడు అంటే పిల్లల్ని తీసుకువెళ్ళింది. కానీ ఆడపిల్లలు కాస్త పెద్దయన తర్వాత బయటకు అందులోనూ చెరువులోకి తీసుకువెళ్లడం పద్ధతి కాదు, కాబట్టి తాతమ్మ మా అమ్మమ్మలకు తన బాధ్యతను అప్పగించేదట.

వాళ్లు ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్కరికి తలస్నానం చేయించేవారట. తల మొత్తం ఆరినా, ఆరకపోయినా నూనె రాసి జడలు వేసేవారు అట, దాంతో వీరికి తలనొప్పి వచ్చేది. జుట్టు ఆరలేదు కాబట్టి తరచుగా జలుబులు చేసేవట, ఆ జలుబులు చేసినప్పుడు తాతమ్మ దగ్గర ఉండి మిరియాల కషాయం చేయించి తాగించేదట, దాంతో జలుబు తగ్గే పోయేదట.

ఈ ఆటలు అన్ని మా అమ్మగారు చెప్పినవే, నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి మా తాతమ్మ బ్రతికే ఉంది. నేను మా తాతమ్మ ని చూసాను కానీ మా ముత్తాతని చూడలేకపోయాను. నాకు ఊహ తెలిసినప్పుడు మా తాతమ్మ తన పని తాను చేసుకునేది. ఇంట్లో కూడా చిన్న చిన్న సహాయం చేసేది. కాకపోతే కాస్త చెవుడు వచ్చింది,

ఇక్కడ నాకు ఒక విచిత్రమైన విషయం బాగా నవ్వు తెప్పించేది. ఇప్పటికి తలుచుకుంటే నవ్వు వస్తుంది. మా తాతమ్మ కూర్చుని కూర్చుని గురకపెట్టేది. తర్వాత ఎవరైనా పిలవడంతో ఆ అంటూ లేచేది. అంటే కూర్చోనే కూర్చొని నిద్ర పోయేది అన్నమాట. మేము మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినంత వరకు నాకు మా తాతమ్మ గారు గుర్తున్నారు. ఒక్కోనెలా ఒక్కో కూతురు దగ్గర ఉండేది. ఎందుకంటే తనకు పెన్షన్ వస్తుంది కాబట్టి ఒక్కొక్క కూతురు ఒక్కోనెల తనని ఉంచుకునేవారు. చివరికి మా తాతమ్మ మా రెండో అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు చనిపోయారని తెలిసింది.

కానీ అప్పటికి మా నాన్నగారు మా అమ్మను వాళ్ళ అమ్మగారింటికి పంపించేవారు కాదు. మా తాతమ్మ చనిపోయినప్పుడు మాత్రం అమ్మగారు ఒక్కరే వెళ్లారు. మేము వెళ్లలేక పోయాము. నిజంగా అప్పటి మనుషులకు ఎంత ఓపికనో కదా, అంతంత బారెడు జుట్టును తల స్నానం చేయించడం, రెండు చేతుల్లో పట్టలేనంతగా ఉన్న జుట్టు ను పట్టుకొని జడలు వేయడం వాళ్లకి ఓపికగా అన్నం తినిపించడం అంటే మామూలు విషయం కాదు.

ఇప్పటికీ మా అమ్మగారి జడ బాగానే ఉంటుంది. కానీ ఎందుకో నా జుట్టు అంతగా పెరగలేదు. నాకు ఆ ఒక్క జుట్టు లేదన్న బాధ తప్ప మిగతా బాగానే ఉంది. ఇంతకీ మా తాతమ్మ గారు అలా వెళ్ళినప్పుడు మా తాతగారు ఎందుకు కొట్టేవారో తెలుసా, చెరువుకు వెళ్ళినప్పుడు  అక్కడికి బట్టలు ఉతికేందుకు మా తాత గారి దగ్గర పనిచేసే వారు వచ్చేవారట.

వారు తిరిగి వచ్చిన తర్వాత అమ్మగారు ఎంత అందంగా ఉన్నారు బాపుగారు అంటూ అనేవారట. దాంతో తన భార్య అందాన్ని పొగడడం ఇష్టం లేని మా ముత్తాత గారు ఇంటికి వచ్చి మా తాతమ్మను కొట్టేవారట. భార్య అందాన్ని ఎవరో పొగడడం ఎవరు ఇష్టపడతారు చెప్పండి. అందుకే మా ముత్తాత గారు తాతమ్మని కొట్టేవారు. అయినా తాతమ్మ గారు ఓపికగా సహించేదట. అప్పుడు అమ్మ వాళ్ళు చిన్నవాళ్లు కాబట్టి తాతమ్మని కొడుతుంటే చూస్తూ బిక్కుబిక్కుమంటూనే వారని మా అమ్మగారు ఇప్పటికీ కథలుగా చెప్తారు.

షికాయ, కుంకుడుకాయలతో తల స్నానం చేయించేదని, నల్లని మట్టి ఒంటికి రాసేదని, అలాగే నూనె కూడా పెట్టి జడలు వేసేదని , ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. అంత ఓపిక సహనం ఇప్పుడు మనకి ఎక్కడిది, అందుకే మేము ఆశ్చర్యంగా వింటుంటాం.

ఇంతకీ ముత్తాత పనిచేసే చోటేమిటో తెలుసా హెడ్ కానిస్టేబుల్ గా పని చేసేవారట. అందుకే మా తాతమ్మకి పెన్షన్ వచ్చేది, చివరి వరకు వచ్చిన తన పెన్షన్ తోనే తాను బ్రతికింది. అయిదుగురు ఆడపిల్లలు తాతమ్మకి, అందులో మా అమ్మమ్మ పెద్దది. మా అమ్మమ్మ దగ్గరే ఎక్కువగా ఉన్నప్పుడు అది మా నాన్నగారు దయ తలచి మమ్మల్ని మా అమ్మమ్మ గారి ఇంటికి పంపించినప్పుడు మాత్రమే మేము మా తాతమ్మ  చూసాము. చివరిగా చూడలేక పోయినందుకు చాలా బాధపడ్డాం. అప్పటి మనిషి చాలా దృఢంగా గట్టిగా ఉండేది. హఠాత్తుగా నిద్రలోనే చనిపోయారు. ఈరోజు ఈ విధంగానైనా మా తాతమ్మని నేను గుర్తు చేసుకున్నాందుకు సంతోషంగా ఉంది. ఇక ఉంటాను..

 

– భవ్యచారు

కొత్త పెళ్ళికొడుకు Previous post కొత్త పెళ్ళికొడుకు
సమాజపు పయనం Next post సమాజపు పయనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close