వేగుచుక్క

వేగుచుక్క

వేసారిన మనసుకు
నీవేనోయ్ తోడు
వెలుగిచ్చే వేకువను
కళ్ళ కద్దుకుందాము

కలతలు నలతలు
కన్నీళ్లు కష్టాలు
ఇవి కావోయ్ బతుకంటే
మనుషులను గెలిచేటి
వానచుక్క నీవయితే
తొలగును ఇక వేదనలు
కురియునుగా దీవెనలు

స్వప్నాలను నేలదింపు
ఆనందమునవి ఒంపును
నైరాశ్యము తెంపినావ
తెప్పరిల్లు బతుకు నావ
రేపనే రోజు కన్న
నేడులోన సుఖముందోయ్

ఆకలితో అలమటించు
జనులెందరొ కనుల ఎదుట
ఎదకరిగిన కొంచెమయిన
స్పందించవ క్షణమయిన
జీవన వనమిక చూడు
విరబూయును మానవతను

గమ్యాలు గమనాలు
గోరింకల గానాలు
గతితప్పిన మనసుకవి
మౌనభాష్యమై పలుకు
అజ్ఞానపు తలుపుతీయ
వేగుచుక్క నీవేనయ్యా

– సి. యస్. రాంబాబు

Related Posts