వెన్నెలతో నా అనుభవాలు

వెన్నెలతో నా అనుభవాలు

వెన్నెల తో పెద్దగా పరిచయం లేదు 😐 కానీ, వేసవి కాలంలో మాత్రం మా ఇంటి వసారా లో మా అమ్మగారు చాప వేసి, వంట పాత్రలన్నీ తెచ్చి, అందరికీ ఒకే దగ్గర కలిపి పెట్టేది.

కొత్తగా పెట్టిన అవకాయలో కాచిన నెయ్యి కానీ లేదా కాచిన నూనె కానీ వేసి, కలిపి ముద్దలుగా ఒక్కొక్కరికి పెట్టేది. మేము అమ్మ పెట్టే ముద్దలను గబుక్కున మింగేసి, మళ్లీ చేతులు చాపే వాళ్ళం.

ఆవకాయ అన్నం ఎంత తిన్నా తృప్తి ఉండేది కాదు. పైగా తినే కొద్ది తినాలనిపించేది. అందుకే అంటారేమో అమ్మ, ఆవకాయ ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. ఎంత తిన్నా తనివి తీరదు అని 😜

ఆ తర్వాత ఏదైనా కూర కానీ లేదా పప్పు చారు కానీ కలిపి పెట్టేది. అమ్మ పెడుతూనే ఉండేది. మేము తింటూనే ఉండేవాళ్ళం.

పిల్లలం కాబట్టి మాకు మా కడుపు గుర్తు తెలిసేది కాదు. అమ్మ పప్పు చారుతో నాలుగు ముద్దలు పెట్టీ, ఇక చాలు అనేది. మాకేమో ఇంకా కావాలి అనిపించేది 😛

అమ్మ మమల్ని మరిపించడానికి అదిగో చందమామ ఎంత బాగున్నాడో చూడండి. మీకు మంచి కథ చెప్తాను. తొందరగా వెళ్లి చేతులు కడుక్కొని రండి అని గిన్నెలు లోపలికి తీసుకుని వెళ్ళేది.

మేము కథ పై ఉన్న ఇంట్రెస్ట్ తో గబగబా హౌజ్ (నీళ్ళ తొట్టి) దగ్గరికి వెళ్లి, అందులో కనిపించే చందమామను చూస్తూ, నేను చందమామ ను పట్టుకున్నా అంటూ అరుస్తూ నీళ్ళను చెల్లా చెదురు చేస్తూ బట్టలు తడుపుకుంటూ ఉంటే, అమ్మ వచ్చి మా వీపు లు విమానం మోత మోగించేది 😭

తర్వాత బట్టలు మార్చేసి, చాప దులుపేసి ఒక బొంత మాత్రం వేసి, మమల్ని పడుకోబెట్టుకొని తను మధ్యలో పడుకుని చుక్కలు చూపుతూ కథలు చెప్పేది.

ముసలవ్వ కథ, నక్క తోడేలు కథలన్నీ చెప్పేది. మేము కథలకు ఊ కొడుతూ అలాగే నిద్ర పోయేవాళ్ళం..

ఇవండీ వెన్నెలతో మా అనుభూతులు ఎలా ఉందో చెప్పండి, అలాగే మీకు వెన్నెలతో పరిచయం ఎలాంటిదో కూడా చెప్పండి 🤗

-భవ్య చారు

Related Posts

1 Comment

  1. Chala bhaga chepparu me అనుభూతులు .. 👌👌👌👌👌👌

Comments are closed.