వేయి పడగలు పుస్తకం రివ్యూ

వేయి పడగలు పుస్తకం రివ్యూ

వేయిపడగలు నవల గురించి రివ్యూ రాయడమంటే సాహసమే అని చెప్పాలి. దీనికి రివ్యూ రాయడమంటే ఒక చిన్నపాటి పుస్తకం రాయడం వంటిది. దీనిని చాలామంది ఇరవయ్యో శతాబ్దపు ఆధునిక ఇతిహాసం అని పిలుస్తారు.

చదివిన తర్వాత ఆ విధంగా పిలవడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తోంది. విశ్వనాథసత్యనారాయణ గారు స్పృశించని అంశం లేదు ఇందులో. జేబుదొంగ మనోగతం నుంచి రాజు గారి (కృష్ణమనాయుడు) ఔదార్యం నుంచి, పరమేశ్వర శాస్త్రి స్నేహం దగ్గర నుంచి ఒక్కటేమిటి సమాజంలో కనిపించే అన్నిరకాల మనస్తత్వాలు ఇందులో కనిపిస్తాయి.

ఒక నవలగా చదవడం ప్రారంభించి మనముందే జరుగుతుంది అన్నట్టుగా,దానికి మనము సాక్ష్యులుగా నిలుస్తున్నాం అన్న భావన చదివే ప్రతి ఒక్కరికి వస్తుంది.

ఇందులో ప్రధానమైన సుబ్బన్నపేట అనే గ్రామం కావచ్చు మరియు అందులో ఆయన లిఖించిన పాత్రల తీరు కావచ్చు, వాళ్ళంతా మన ముందు తిరగాడుతున్నట్లు  ప్రత్యక్ష ప్రసారం చేసారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

భార్యాభర్తల (ధర్మారావు, అరుంధతి) అనుబంధం ఎలా ఉండాలో, వారి మధ్య ప్రేమానురాగాలు ఎంత పటిష్టంగా ఉండాలో, నవల ఆద్యంతం కనిపిస్తుంది. పాత్రలను అంత గొప్పగా తీర్చిదిద్దారు.
ఇందులో తన భార్య మరణించినప్పుడు ధర్మారావు పాత్ర పొందిన బాధ కావచ్చు,ఆ క్షణంలో తాను మాట్లాడిన మాటలు కావొచ్చు, “నేటి రోజుల్లో ప్రతి చిన్న విషయానికి గొడవలు, మనస్పర్దలు, ఇంకొందరు ఇంకొక అడుగేసి విడాకులు సైతం కోరుకోవడం అలాంటి ఆలోచన ఉన్న జంటలందరు ఒక్కసారి వేయిపడగలు నవల చదివితే, ఆ ఆలోచన విరమించేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.”
నవల మొత్తం సుబ్బన్నపేట గ్రామం చుట్టూ అల్లుకున్న ఒక గ్రామంలో ఎంతమంది జీవిస్తారో, అన్నీ రకాల వ్యక్తుల పాత్రలు ఇందులో దర్శనమిస్తాయి. అలాగే వారి మనోభావాలను అద్భుతంగా ఆవిష్కరించారు విశ్వనాథసత్యనారాయణ గారు.
ఆధునికంగా చోటుచేసుకునే తీవ్ర మార్పులకు, ఒక జాతి మొత్తం ఎలా లోనవుతుందో,ఆ మార్పులో భాగంగా ఎలాంటి విలువలను కోల్పోతున్నామో అనేది అత్యద్భుతంగా లిఖించారు. మార్పు కోరుకుంటూనే, శతాబ్దాల నుండి వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను విస్మరించకూడదు అనే సత్యాన్ని అంతర్లీనంగా తెలియబరిచారు.
ప్రకృతిలో మమేకమయ్యి, తాను మనిషన్న స్పృహ కూడా లేని పసిరిక పాత్ర అయితే నభూతో నా భవిష్యతన్నట్లు వర్ణించారు. ఎప్పుడైతే తాను మనిషన్న స్పృహ మనసులో స్పూరిస్తుందో… ఎప్పుడు ఆడుకునే తన నేస్తాలకు పాము కాటు వేయడం, తాను మరణించడం ఎంతో హృద్యంగా పొందుబరిచారు.
ఏ పాత్ర గొప్పది అని చెప్పలేము. ఏ పాత్ర గొప్పగా లిఖించారు అని చెప్పాలంటే కష్టమే. అన్నీ పాత్రలను అత్యద్భుతంగా చిత్రీకరించారు. వేయిపడగలు నవల అనేది ఒక మనస్తత్వ గ్రంధం అనొచ్చు.
ధర్మరావు చెల్లెలయిన దేవదాసీకి, స్వామితో ఉండే అనుబంధం, గుళ్ళో తాను పొందే తన్మయత్వం, మనసుతో లిఖిస్తే కానీ అంత గొప్పగా రాయలేరేమో అన్నట్లు రాశారు విశ్వనాథసత్యనారాయణ గారు.
సంస్కృతి, సంప్రదాయాల గురించి, భాష గురించి, బతుకు జీవనం గురించి, భార్యభర్తల అన్యోన్యతల గురించి, సమాజంలో తారసపడే వివిధ వ్యక్తుల మరియు వారి వారి మనస్తత్వాల గురించి, ప్రకృతి గురించి, ఆధునిక మార్పుల గురించి, ధర్మంకొరకు, విలువల కొరకు బ్రతికే వ్యక్తిత్వాల గురించి, స్నేహితుల గురించి, మానవ జాతి,భూతదయ గురించి, మూగ జీవాల గురించి, భక్తి గురించి.. ఇలా ఒకటేమిటి చివరకు ఒక దొంగ యొక్క అంతరంగమును కూడా యధాతధంగా పొందుబరిచారు.
సమాజాన్ని ఎంతో నిశీతంగా పరిశీలిస్తే కానీ ఇంత గొప్ప నవలను రాయడానికీ పూనుకోలేరు. ఇంత గొప్పగా వేయిపడగలను తీర్చిదిద్దారు అంటే.. సమాజాన్ని వారెంత సూక్ష్మంగా పరిశీలించారో అర్థం చేసుకోవచ్చు.
చివరగా, “నేటి తెలుగు జాతి ప్రజలు, ముఖ్యంగా యువత దీన్ని చదివి అర్థం చేసుకోవాలి. దాదాపు తొంభై ఏళ్ల క్రితం రాసిన నవల, నేటికీ సమాజంలో జరిగే అనేక సంఘటనలు స్పూరించేలా ఉందంటే, దీనిలో ఇంకెన్ని నిగూఢ విషయాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ధర్మంగా బ్రతికే ఎందరో ధర్మారావులకు వెన్నుదన్ను ఈ నవల. దారితప్పి అధర్మ మార్గంలో జీవితాలను కోల్పోయే ఎందరికో మార్గదర్శకం ఈ నవల. చిన్న చిన్న కారణాలతో, మనస్పర్ధలతో కోర్టు మెట్లెక్కి..
వందేళ్ళ పచ్చని సంసారాన్ని రద్దు చేసుకునే వారికి అపురూప కానుక ఈ నవల. నిజమైన చదువేదో,జ్ఞానమేదో తెలియచెప్పే గురువు లాంటిది ఈ నవల. సంస్కృతి, సంప్రదాయాలు భాష గురించి అధ్యయనం చేయాల్సిన గ్రంధం ఈ నవల.
మార్పును కోరుకోవడంలో ఏమి కోల్పోకూడదో కళ్లుతెరిపించే కాల్పనిక ఈ నవల. ప్రేమలు, బంధాల విలువలు తెలియచెప్పే గొప్ప కావ్యం ఈ నవల. ప్రకృతి పర్యావరణమును కాపాడటానికి చట్టాలు, మంత్రులను నియమించే నేటి రోజుల్లో మన జీవితాల్లో ప్రకృతి యొక్క ప్రాముఖ్యత మరియు లీనమయ్యే తీరు కళ్ళకు కట్టినట్లు చూపించే దృశ్యకావ్యం లాంటిది ఈ నవల… ఇలా ఒకటేమిటి, చదివి అర్థం చేసుకునేవారికి అర్ధం చేసుకున్నంత”.
– KPR(అమొఘీ)

Related Posts